ఆ పని చేసినప్పుడే జనసేనకు అసలైన విజయం

2014 నుంచీ ఎన్నికల్లో అభ్యర్థులకు, పార్టీలకు ప్రచార వరంలా మారింది సోషల్ మీడియా. సోషల్ మీడియాని బాగా వాడింది ఎవరంటే కచ్చితంగా ప్రధాని మోడీ గుర్తుకొస్తారు. అలాగే సోషల్ మీడియాతో పూర్తిగా దెబ్బతిన్నది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పవన్ కల్యాణ్. నాకు మీడియా అక్కర్లేదు, సోషల్ మీడియా ఉంది, జనసైనికులు ఉన్నారంటూ భ్రమలో పడిపోయిన పవన్ కల్యాణ్ కు ఈ పరాభవం గొప్ప గుణపాఠాన్ని నేర్పింది.

పక్కనే మనిషి ఉన్నా పార్టీ గురించి చెబుదామని అనుకోకుండా.. సోషల్ మీడియాలో భావజాలం అప్ లోడ్ చేస్తామనుకుంటే ఎలా? అసలు జనసేనకు ఉన్నన్ని సోషల్ మీడియా వింగ్స్ ఇంకే జాతీయ పార్టీకి కూడా లేవంటే అతిశయోక్తి కాదు. అలాగని పవన్ ప్రచారాన్ని పక్కనపెట్టారా అంటే లేదని చెప్పలేం. బహిరంగ సభలు పెట్టారు, భారీ ర్యాలీలు తీశారు. కాకపోతే నేరుగా ఏ ఒక్కరనీ కలవలేదు, ఏ ఒక్కరికీ వ్యక్తిగతంగా తన అజెండా ఇదని, తన మేనిఫెస్టో ఇదని వివరించలేదు.

జనసైనికులు కూడా మేనిఫెస్టో కరపత్రాన్ని ఓటర్ల చేతిలో పెట్టి సెల్ఫీ తీసుకోడానికి ఇష్టపడ్డారు కానీ వాటిలోని అంశాలను వివరించడానికి మాత్రం కష్టపడ్డారు. అందుకే జనసేన పార్టీ సోషల్ మీడియా పార్టీగా మిగిలిపోయింది, జనసైనికులంతా సెల్ఫీరాజాలుగా మారిపోయారు. ఇప్పటికైనా పవన్ తప్పు తెలుసుకోవాలి, సోషల్ మీడియా నుంచి బైటకొచ్చి, సోషల్ లైఫ్ లో ఉండాలి.

జనంతో కలవాలి అంటే వారితో కలసి ఫొటోలు దిగాలని కాదు. ఫొటోలు, అప్ లోడ్ ల సంగతి పూర్తిగా పక్కనపెట్టి జనంతో మమేకం అవ్వాలి. విస్తృత ప్రజా సంకల్ప యాత్రతో జగన్ సీఎం అవ్వడానికి కారణం ఇదే. ఒక రకంగా జగన్ కంటే ఎక్కువ వీడియోలు, ఎక్కువ ఫొటోలు, ఎక్కువ మాంటేజ్ సాంగ్స్.. పవన్ కల్యాణ్ వే సోషల్ మీడియాలో కనపడుతుంటాయి. మరి ఓట్లు పడింది ఎవరికి? ఈ విషయాన్ని పవన్ అర్థం చేసుకుంటే చాలు.

సోషల్ మీడియా అనేది ఒక టూల్ మాత్రమే. జనంతో మనం ఎంత మమేకం అయ్యామనేది మాత్రమే పార్టీ ఎదుగుదలకు కీలకం. ఇకనైనా ట్విట్టర్, ఫేస్ బుక్ వాడకాన్ని జనసైనికులు తగ్గించాలి. అసలైన కార్యక్షేత్రంలోకి దూకాలి. అప్పుడే ఫలితాలు కనిపిస్తాయి. ఇది లేకుండా ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టినా ఉపయోగం ఉండదు.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!

Show comments