జనసేన లక్ష్మినారాయణ ఎక్కడ.?

జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యనేతల్లో ఒకరిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రాచుర్యంలోకి వచ్చారు.. అదీ సరిగ్గా ఎన్నికల సమయంలో. 'పవన్‌ కళ్యాణ్‌తో కలిసి జనసేన పార్టీ తరఫున జనంలో వుంటాను..' అని మాటిచ్చారు అప్పట్లో లక్ష్మినారాయణ. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మినారాయణ, ఓటమి పాలైన విషయం విదితమే. అఫ్‌కోర్స్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సైతం గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారనుకోండి.. అది వేరే విషయం.

షరామామూలుగానే, జనసేన పార్టీలో లక్ష్మినారాయణకి పెద్దగా ఆ తర్వాత ప్రాధాన్యత లేకుండాపోయింది. లక్ష్మినారాయణ, జనసేనను వీడుతున్నారన్న ప్రచారం గతంలో గట్టిగా జరగడం, దానికాయన కాస్త నొచ్చుకుని.. తాను జనసేనలోనే వున్నాననీ, తన సేవల్ని ఎలా వినియోగించుకోవాలో పవన్‌ కళ్యాణ్‌కి తెలుసనీ సెలవిచ్చారు. ఆ తర్వాత ఆయన పెద్దగా జనసేన కార్యక్రమాల్లో కన్పించలేదు.

ఇక, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించబోతున్నారు.. అదీ విశాఖ వేదికగా. నవంబర్‌ 3 లేదా 4 తేదీల్లో ఈ కార్యక్రమం వుంటుందట. అదేంటి.? ఏదో ఒకరోజు పక్కాగా నిర్ణయించుకోవాలి కదా.? అంటే, దానిపై జనసేన నేతలే సమాధానం చెప్పలేని పరిస్థితి. లక్ష్మినారాయణ పోటీచేసిన విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఈ కార్యక్రమం జరగబోతోంది. కానీ, ఆయన ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా స్పందించలేదు.

కానీ, జనసైనికులు.. అందునా లక్ష్మినారాయణని అభిమానించేవారు.. 'ప్లీజ్‌ సర్‌.. మీరు స్పందించండి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి..' అంటే బతిమాలుకుంటున్నారు. కానీ, ఏం లాభం.? ఆయన వారికి 'తీపి' కబురు అందించలేకపోతున్నారాయె. నిజానికి, ఇలాంటి కార్యక్రమాల్ని డిజైన్‌ చేసినప్పుడే పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, అందర్నీ కలుపుకుపోవాలి.

ఇంకా నయ్యం.. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కే పార్టీలో తగిన గౌరవం దక్కట్లేదాయె. అలాంటిది, సీబీఐ మాజీ జేడీ అయితే మాత్రం.. విశాఖలో ఓడిపోయిన లక్ష్మినారాయణని పట్టించుకుంటారా.? ఛాన్సే లేదు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

Show comments