బాబుకు షాక్.. సభలో జై ఎన్టీఆర్ నినాదాలు

ముఖ్యమంత్రి జగన్ ను బద్నామ్ చేసేందుకు... తన సొంత మైలేజీ పెంచుకునేందుకు... పార్టీని తిరిగి బతికించుకునేందుకు.. కార్యకర్తలపై దాడుల్ని ఖండించేందుకు.. ఇలా కారణాలు ఏమైతేనేం చంద్రబాబు మాత్రం జిల్లా పర్యటనలు షురూ చేశారు. ఇప్పటివరకు అంతా బాగానే నడిచింది. తను ఆడిన ఆటను, పాడిన పాటను.. అనుకూల మీడియాలో బాగానే చూపించుకోగలిగారు. కానీ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో రెండో రోజు మాత్రం బాబు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు.

ఊహించని విధంగా తెలుగుదేశం కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని లేవనెత్తారు. ఓవైపు వైసీపీ బాధితుల ఓదార్పు అంటూ చంద్రబాబు హంగామా చేయడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కార్యకర్తల నుంచి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు అందుకున్నారు. దీంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే నినాదాలు చేసిన ఓ 10 మందిని మిగతా కార్యకర్తలు, ఛోటా నేతలు బయటకు పంపించేశారు.

బయటకొచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలతో కొన్ని వెబ్ ఛానెల్స్, స్థానిక మీడియా మాట్లాడింది. ప్రస్తుత టీడీపీ పరిస్థితిని, లోకేష్ వ్యవహరశైలిని, ఎన్టీఆర్ పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకతను వాళ్లు కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. వాటిలో కొన్నింటిని యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

* ఎన్టీఆర్ వస్తే టీడీపీ మళ్లీ పంజుకుంటుంది.. 15 ఏళ్ల వరకు పార్టీ కంటిన్యూ అవుతుంది. ఎన్టీఆర్ లో ఆ గొప్పదనం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ వస్తుంది. లేకపోతే రాదు.
* లోకేష్ ప్రజల్లో తిరిగినా తిరగకపోయినా ఒకటే. ఆయన తిరిగినా వేస్ట్. మేం మాత్రం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తాం. జూనియర్ ఎన్టీఆర్ కాకుండా లోకేష్ వస్తే ప్రజలకు టీడీపీపై మంచి ఫీలింగ్ రాదు.
* అయినా లోకేష్ ఎవడు మధ్యలో. పెద్ద ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అల్లుడిగా చంద్రబాబు నడిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ రావాల్సిందే. అదే వారసత్వం కదా.
* యూత్ ను ఆకర్షించే శక్తి ప్రస్తుతం టీడీపీలో ఎవ్వరికీ లేదు, కాబట్టి ఎన్టీఆర్ రావాల్సిందే.

ఇవి కొన్ని అభిప్రాయాలు మాత్రమే. ఈ టీడీపీ కార్యకర్తలకు తోడు మరింత మంది చేరి, ఎన్టీఆర్ కు మద్దతుగా మాట్లాడారు. అవసరమైతే చంద్రబాబే, ఎన్టీఆర్ తో చర్చలు జరిపి రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓవైపు కొడుకు లోకేష్ ను పార్టీకి పెద్దదిక్కుగా తయారుచేసేందుకు తెగ తంటాలు పడుతుంటే, మరోవైపు ఇలా టీడీపీ కార్యకర్తలే ఓపెన్ గా ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేయడం బాబును ఇరకాటంలో పడేసింది.

ఈ నాలుగేళ్లలో ఇలాంటి నినాదాల్ని చంద్రబాబు ఇంకెన్ని వినాల్సి వస్తుందో! బహుశా బాబు ఇప్పటికే మానసికంగా ఇలాంటి వాటికి సిద్ధపడి ఉండొచ్చు.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments