జగన్‌ సవాల్‌కి 'సున్నా' చుట్టేసిన చంద్రబాబు

అవకాశాలు అరుదుగా వస్తాయి.. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందే ఎవరైనా.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో. 'సున్నా వడ్డీ' విషయమై ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నేతకీ మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఓ దశలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకి సవాల్‌ విసిరేశారు.

'సున్నా వడ్డీ' టీడీపీ హయాంలో ఇవ్వలేదనీ, ఇచ్చామని టీడీపీ చెప్పగలదా.? అని సవాల్‌ విసిరారు. 'ఇవ్వకపోతే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేస్తారా.?' అంటూ జగన్‌ సవాల్‌ విసిరేసరికి, చంద్రబాబు సహా పసుపు దళమంతా బిక్కమొహం వేసేసింది. 

ఆ తర్వాత తీరిగ్గా చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ హయాంలో 'సున్నా వడ్డీ' అమల్లో వుందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 'ఆధారాలు తీసుకొచ్చేసరికి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు' అంటూ చంద్రబాబు, అధికారపక్షంపై నిందారోపణలు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అనుభవం 40 రోజులు మాత్రమే.. చంద్రబాబు లెక్కల్లో. కానీ, చంద్రబాబు అనుభవం పధ్నాలుగేళ్ళు.. అదీ ముఖ్యమంత్రిగా. ఇంత అనుభవం పెట్టుకుని, అందివచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వినియోగించుకోలేకపోయారట.? 

ఒకవేళ నిజంగానే చంద్రబాబు హయాంలో 'సున్నా వడ్డీ' అమలు చేసి వుంటే, వైఎస్‌ జగన్‌ అడ్డంగా బుక్కయిపోయేవారు. 'సరే, నేను సవాల్‌ స్వీకరిస్తున్నా.. నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా.?' అని చంద్రబాబు అనగలిగి వుంటే, ఈక్వేషన్‌ ఇంకోలా వుండేదేమో.! కానీ, ఇక్కడ అసలు సమస్య వేరే. చంద్రబాబు ఉత్త బుకాయింపులకు మాత్రమే పాల్పడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడేందుకు బోల్డంత సమయం దక్కింది.. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుణ్యమే. 

'నా అనుభవం అంత వుంటుంది నీ వయసు..' అంటూ వైఎస్‌ జగన్‌ని హేళన చేయడానికి చంద్రబాబు తన చాణక్యాన్ని ఉపయోగించారు తప్ప, జగన్‌ సంధించిన ఏ ప్రశ్నకీ చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారాయె. మొత్తమ్మీద, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పెర్ఫామెన్స్‌ గుండు 'సున్నా' అయిపోయిందన్నమాట.