జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!
సిండికేట్లకు కాలం చెల్లినట్టే... సెటిల్‌మెంట్లపై నిఘా
మంత్రులు సహా ఎమ్మెల్యేల దూకుడుకు కళ్ళెం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కీడెంచి మేలెంచమన్న చందాన వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. అందిపుచ్చుకున్న అధికారం ఐదేళ్ళకే పరిమితం కాకుండా పదికాలాల పాటు పచ్చగా పాలన సాగించాలన్న తాపత్రయంతో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అత్యంత జాగరూకతతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం! అందివచ్చిన అధికారానికి మిడిసిపడకుండా అత్యంత బాధ్యతాయుతంగా పాలన సాగించాల్సి వుందని, ఇందుకు తనతోపాటు ప్రతివొక్కరూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందేనని జగన్‌ ఇప్పటికే స్పష్టంచేశారు.

ప్రజలతో మమేకమై జనరంజక పాలన అందించడంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ విధంగా ముందుకుసాగితే తదుపరి ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి, పదికాలాల పాటు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని అవకాశం దొరికినపుడు మంత్రులు సహా ఎమ్మెల్యేలకూ ముఖ్యమంత్రి క్లాసు తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఉదహరిస్తూ అటువంటి చర్యలకు తమ ప్రభుత్వంలో ఆస్కారం ఉండదని చెబుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను పటిష్టం చేసే పనిలో ముఖ్యమంత్రి ఉన్నట్టు భోగట్టా!

తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటిలిజన్స్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, బాబు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై నిఘా అనేది ఉండేది కాదని జగన్‌ వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం! ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి లేక ఎమ్మెల్యే ఇతర నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే క్షమించేది లేదని జగన్‌ హెచ్చరికలు పంపినట్టు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిందని సిండికేట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ పరిణామం ప్రస్తుతం అధికార పార్టీలో కొందరికి మింగుడుపోని విధంగా మారింది.

వాస్తవానికి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మంత్రుల్లో కొందరు గతంలో ఇతర పార్టీలో చక్రంతిప్పారు. అవినీతి, అక్రమ వ్యాపారాల్లో ఆరితేరిన సదరు నేతలు ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని జనం చెప్పుకుంటున్నారు. అందరూ ఆ తానులో ముక్కలేనని, ఇటువంటి పరిస్థితుల్లో జగన్‌ ఆదేశాలను అటువంటి నేతలు ఖాతరు చేస్తారా? అన్న సందేహంలో పలువురున్నారు. దీనిపై కొందరు నేతలు మాట్లాడుతూ ఏదేమైనా తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో జగన్‌ చాలా కచ్చితంగా ఉన్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో ఇసుక స్కాం నుండి మైనింగ్‌, మట్టి, లిక్కర్‌, భూ మాఫియాల వరకూ ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన అక్రమార్కులకు జగన్‌ చెక్‌ పట్టారని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వివిధ మాఫియాల పక్షాన చక్రం తిప్పిన అక్రమార్కులు ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం పంతున్నప్పటికీ అటువంటి అక్రమార్కులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు చేరనివ్వరాదని ముఖ్యమంత్రి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించినట్టు సమచారం!

ఇటువంటి వ్యవహారాలు నడుపుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రికి ముఖ్యమంత్రి ఇప్పటికే ఓ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం! ఏ ఒక్క మంత్రి లేక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సెటిల్‌మెంట్ల జోలికి వెళ్ళవద్దని ఆదేశించినట్టు భోగట్టా! ఈ కారణంగానే ఇప్పటివరకూ ఏ ఒక్క జిల్లాలోనూ మంత్రులు హాహా (తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిరిగా) కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామం గోదావరి జిల్లాల్లోని పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మింగుడుపోవడం లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా మద్యం సిండికేట్లు కొత్త ప్రభుత్వం నిబంధనలకు మద్యం వ్యాపారం చేయలేమని చేతులెత్తేశారు. సిండికేట్లు తమకనుకూలంగా మంత్రుల సహకారంతో లాబీయింగ్‌ చేసేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తాము చేసేదేమీలేదని ఓ మంత్రి సహా ప్రజా ప్రతినిధులు చేతులెత్తేశారు. ఈ పరిణామానికి సిండికేట్లు ఆగ్రహానికి గురైనట్టు సమాచారం!

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments