జగన్‌ వ్యూహం: ప్రజా కోర్టులో తేల్చుకోవాలని.!

ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే ప్రభుత్వంలో ప్రకంపనలు పుట్టాలి. జరగకూడని ఘటన జరిగిందంటూ తమ అసమర్థతను చూసి సిగ్గుతో తలదించుకోవాలి. ముందుగా బాధిత ప్రతిపక్ష నేతను పరామర్శించాలి. ప్రాణాపాయం ఏమైనా వుందా.? అని ఆందోళన చెందాలి. నిఘా వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించాలి. కానీ, ఇవేవీ జరగలేదు.

డీజీపీ హడావిడిగా మీడియా ముందుకొచ్చేసి 'పబ్లిసిటీ దాడి' అంటారు. ఆ వెంటనే హోంమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి.. అందరిదీ ఒకటే తీరు. ఏమన్నా అంటే, ప్రతిపక్ష నేత మీద దాడి దురదృష్టకరమంటూనే, ఇలాంటి చర్యలతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీదనే అనుమానాలు వ్యక్తం చేసేశారంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 'పరిపాలన' ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితుల్లో హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న జగన్‌ ముందున్న రెండే రెండు మార్టాలు.. ఒకటి న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం, ఇంకోటి జనం వద్దకు వెళ్ళి ప్రభుత్వం తాలూకు చేతకానితనాన్ని ఎండగట్టడగం. మొదటి పని ఎప్పుడో జగన్‌ చేసేశారు.

రెండో పని నిన్ననే మొదలు పెట్టారు. రాజకీయ నాయకుడికి సంయమనం ముఖ్యం. ఆ సంయమనం జగన్‌ పాటించబట్టే రాష్ట్రం అల్లకల్లోలం కాకుండా, ప్రశాంతంగా వుంది. లేదంటే, జగన్‌ మీద హత్యాయత్నం.. అనగానే, అభిమానులెంతగా సంయమనం కోల్పోవాలి.? ఆ మాత్రం విజ్ఞత కూడా లేకుండా పోయింది నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి.

మీడియాకి యాక్సెస్‌ ఇచ్చి, ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి.. తనపై జరిగిన దాడికి మరింత పబ్లిసిటీ తెచ్చుకోవాలని జగన్‌ కోరుకోలేదు. కోరుకుని వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. కామ్‌గా ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభించిన జగన్‌, నిన్నటి బహిరంగ సభలో తన ఆవేదనను బయటపెట్టారు.

ప్రభుత్వ అసమర్థతను కడిగి పారేశారు. చిత్రమేంటంటే, జగన్‌కి ఇదే రోజు కోర్టు నోటీసులు రావడం. రక్తంతో తడిసిన చొక్కా ఇవ్వాలంటూ 'సిట్‌' న్యాయస్థానం ద్వారా కోరడం, న్యాయస్థానం ఆ దిశగా జగన్‌కి నోటీసులు పంపడం జరిగిపోయాయి.

హత్యాయత్నం చేసిన వ్యక్తి దొరికాడు.. 'పబ్లిసిటీ స్టంట్‌' అని ప్రకటించిన డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎదురుగానే వున్నారు. చొక్కా మేటర్‌ ముఖ్యమా.? లేదంటే, ఎయిర్‌పోర్ట్‌లో సీసీటీవీ కెమెరాలెందుకు పనిచేయలేదన్నది ముఖ్యమా.?

హత్యకు యత్నించిన వ్యక్తికి, ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ ఎలా లభించింది.? ఆ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి టీడీపీనేత అవడమేంటి.? అన్నది ముఖ్యమా.! ఇందుకే, జగన్‌ ప్రజాకోర్టులో తేల్చుకోవాలనుకున్నారు. న్యాయం కాస్త లేటవుతుందేమోగానీ, ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది.

హత్యాయత్నం నిజం. దాన్ని అధికార పార్టీ వెటకారం చేసిన మాట వాస్తవం. అధికార పార్టీ ఆదుర్దా, అందుకు డీజీపీ వంత పాడిన వైనం.. ఇదంతా రికార్డెడ్‌. ప్రభుత్వ చేతకానితనానికి ఇంతకన్నా నిదర్శనాలు ఇంకేం కావాలి.?  

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments