జగన్ ఫోకస్ ఇక రాజధానిపైనే..!

జగన్ పాలన 100రోజులు దాటింది.. ఇప్పటికే వాలంటీర్ల నియామకం పూర్తైంది, సచివాలయాలు ఏర్పడుతున్నాయి, మద్యపాన నిషేదం దిశగా అడుగులు పడ్డాయి, ప్రతి పేదవాడికీ ఇళ్ల స్థలాల కోసం ఎంపిక జరుగుతోంది, అమ్మఒడి విఢి విధానాలు ఖరారయ్యాయి, ఆరోగ్యశ్రీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. రైతు భరోసా, వాహన మిత్ర.. ఇలా నవరత్నాల కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటే పట్టాలెక్కేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన వందరోజుల లోపే, ఓ కొలిక్కి తెచ్చిన సీఎం జగన్, ఇప్పడు రాజధాని అమరావతిపై ఫోకస్ పెంచుతున్నట్టు కనిపిస్తోంది.

ఆమధ్య జగన్ విదేశీ పర్యటనలో ఉండగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్య రాష్ట్రంలో కలకలం రేపింది. రాజధాని అమరావతిని తరలిస్తున్నారని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడాయి ప్రతిపక్షాలు. మీడియా కూడా నానా యాగీ చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. జగన్ మాత్రం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే రాజధాని విషయంలో జగన్ కు ఓ క్లారిటీ, ఓ విజన్ ఉంది. దాన్ని త్వరలోనే బయటకు తీయబోతున్నారు ముఖ్యమంత్రి.

రాజధాని అంటే పేద రైతుల దగ్గర పొలాలు బలవంతంగా లాక్కోవడం కాదు, గాలిమేడలు కట్టినట్టు, తాత్కాలిక భవనాలు కట్టి  రాజధాని తరలించేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు. విదేశాలతో ఒప్పందాలు చేసుకుని గ్రాఫిక్స్ మాయాజాలాన్ని మీడియాకు వదలడం కాదు. రాజధాని పేరుతో నిధులు కాజేయాలన్న దురాశతోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ఓ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లాగా డీల్ చేశారు. కేంద్రం నిధులు విదల్చకపోవడంతో బాబు నోట్లో పచ్చివెలక్కాయ పడింది.

అయితే జగన్ ఆలోచన వేరు. రాజధాని ఎవరో వచ్చి నిర్మించేది కాదు, అన్ని ప్రభుత్వ భవనాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోవడం అంతకంటే కాదు. రాష్ట్రంలోని ప్రజలందరికీ యాక్సెస్ ఉండాలి, ముఖ్యంగా స్థానికులు సంతోషంగా ఉండాలి. కానీ అమరావతి విషయంలో అది జరగడంలేదు. రాజధానికి పొలాలిచ్చిన రైతులు పూర్తి నిరాశలో ఉన్నారు.  ప్రభుత్వం కౌలు రూపంలో నష్టపరిహారాన్ని ఏటా ఇస్తున్నా కూడా వారిలో అసంతృప్తి చల్లారలేదు.

తమకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని, నష్టపరిహారం పెంచాలని, త్వరలో రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరేందుకు త్వరలో జగన్ ని కలవబోతున్నారు రైతులు. వారికి అపాయింట్ మెంట్ కూడా ఇచ్చిన జగన్.. భేటీ తర్వాత కీలక ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తాత్కాలిక హైకోర్టు అమరావతిలోనే ఉన్నా.. శాశ్వత భవనాన్ని రాయలసీమకు తరలించాలనే ప్రతిపాదన పార్టీలో ఉంది, ఉత్తరాంధ్రకు కూడా మరో రకంగా న్యాయం చేయబోతున్నారట. పేరుకి అమరావతి రాజధాని అయినా, దానిపై ఒత్తిడి పెరగకుండా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

నవరత్నాల పథకాల అమలు ఓ కొలిక్కి వచ్చింది కాబట్టి, ఇకపై రాజధానిపై జగన్ దృష్టిసారించబోతున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా, కేంద్రం సహాయ నిరాకరణ చేస్తానన్నా కూడా జగన్ తన నిర్ణయాన్ని ధైర్యంగా ప్రకటిస్తారని, తాత్కాలిక పరిష్కారం కాకుండా.. రాష్ట్రానికి శాశ్వతంగా ఏది మంచి జరుగుతుందో అదే చేయాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారు. మరి జగన్ మనసులో ఏముందు మరికొన్ని రోజుల్లోనే బైటపడనుంది. 

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!