ఇది నా కల.. అమెరికాలో జగన్ తొలి ప్రసంగం

అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, డాలస్ వేదికగా తన విజన్ ను ఆవిష్కరించారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను తను ఎలా చూడాలనుకుంటున్నానో ఎన్నారైలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎందులోనూ తక్కువ కాదని, మరీ ముఖ్యంగా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని సగర్వంగా ప్రకటించారు సీఎం.

"నాకు కూడా ఓ లక్ష్యం ఉంది. నాక్కూడా ఓ కల ఉంది. మహానేత నాన్నగారి పాలన చూశాం. డాక్టర్ వైఎస్ఆర్ తనయుడిగా, 50శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే ఉన్న నాయకుడిగా, అన్నింటినీ మించి 3648 కిలోమీటర్ల మేర కాలినడకన 13 జిల్లాల  ఏపీలో పాదయాత్ర చేసిన నాయకుడిగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని నా డ్రీమ్. అన్నం పెట్టే రైతన్నలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదనేది నా డ్రీమ్. 33శాతం నిరక్షరాస్యతను జీరోకు తీసుకురావాలనేది నా డ్రీమ్. పల్లెలు కళకళలాడాలని, అక్కడి స్కూల్స్, హాస్పిటల్స్ మెరుగ్గా ఉండాలనేది నా డ్రీమ్. ఏ పథకమైనా గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ లంచాల్లేకుండా, విచక్షణలేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలనేది నా డ్రీమ్."

ఐదేళ్ల వరకు టైమ్ తీసుకోకుండా.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకాల గురించి వివరించారు. రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఎందుకు పునఃసమీక్షించాల్సి వచ్చిందో ఎన్నారైలకు సమగ్రంగా వివరించారు.

"రెండున్నర నెలల పరిపాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశాం. అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లుల్ని తీసుకొచ్చాం. గతంలో ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచాం. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాల అమలుతో పాటు.. ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాల్ని ఈ ఏడాదిలోనే ఇవ్వబోతున్నాం. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామా వాలంటీర్లు, గ్రామ సెక్రటరీల్ని తీసుకొస్తాం. వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది. అక్టోబర్ 2 నాటికి గ్రామ సెక్రటరీల్ని కూడా తీసుకొస్తాం. 3 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నాను. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తీసుకొచ్చాం."

అమెరికా వేదికగా మరోసారి తండ్రిని గుర్తుచేశారు జగన్. ఎన్నారైలలో పెట్టుబడిదారుల్ని చూడకుండా ఆత్మీయుల్ని, స్నేహితుల్ని చూశారు జగన్. పెట్టుబడుల కోసం కాకుండా, తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసమైనా ఇండియాకు వచ్చిపోతుండాలని కోరారు. ఆ తర్వాతే పెట్టుబడులు, గ్రామాభివృద్ధి కోసం ఆలోచించాలని సూచించారు. 
జగన్ చెప్పిన ఈ మాటతో ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది.

"ఇది మీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలతో రండి, గ్రామాలకు వచ్చి మీ తల్లిదండ్రుల్ని, అవ్వ-తాతల్ని, స్నేహితుల్ని చూడ్డానికి సంవత్సరానికి కనీసం ఒకట్రెండు సార్లయినా రండి. ఆ తర్వాతే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. మీ గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్టాప్స్ మార్చాలనే ఆరాటం ఉండావాళ్లు ముందుకు రండి. మీ సహాయంతోనే వాటిని పునరద్ధరిస్తాం. వాటికి మీ పేరే పెడతాం. మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీతో కలిసి గ్రామాలు బాగు చేసుకుంటాం రండి."

ఎన్నారైలకు అనుకూలంగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఓ పోర్టల్ ను తెరుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ పోర్టల్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుసంధానమై ఉంటుందని.. అందులోకి వచ్చి ఏ రకమైన సాయమైనా అందిచ్చొచ్చని ప్రకటించారు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments