తీగ లాగబోతున్న జగన్.. డొంక కదులుతుందా?

అసలైన రివ్యూ మీటింగ్ మరో 2 రోజుల్లో
రాజధాని భూములపై జగన్ ఫోకస్
సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పట్నుంచి అందరి దృష్టి అమరావతిపైనే ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధాని తరలిపోతుందని, వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందంటూ ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా చాలా ప్రచారం చేసింది. ఆ సంగతి పక్కనపెడితే, అసలు రాజధాని పేరుచెప్పి బాబు ఇన్నాళ్లూ ఆడిన డ్రామాల్ని బయటపెట్టబోతున్నారు జగన్.

ఇప్పటికే అమరావతి భూములు, రాజధాని కోసం ఏర్పాటుచేసిన సీఆర్డీఏపై ఓ కన్నేసిన జగన్.. మరో 2 రోజుల్లో దీనిపై కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రైతుల నుంచి ఎన్ని ఎకరాల భూములు తీసుకున్నారు, పరిహారం ఎంత చెల్లించారు లాంటి విషయాలతో పాటు.. ఇన్నాళ్లూ సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు, రాజధాని ప్రాంతంలో చేసిన పనులపై సమీక్ష నిర్వహించబోతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే జగన్ తీగ లాగబోతున్నారనే విషయం అర్థమౌతూనే ఉంది. రాజధాని చుట్టూ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటుందంటూ ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా జగన్ కూడా ఈ అంశంపై అనుమానాలు వ్యక్తంచేశారు. ప్రజలు, ప్రతిపక్షాలకు కూడా తెలియకుండా విడుదల చేసిన రహస్య జీవోల గురించి జగన్ అప్పట్లో చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ జీవోలన్నింటినీ బయటకు తీయబోతున్నారు జగన్.

ఇవన్నీ ఒకెత్తయితే.. అమరావతి బాండ్లు మరో ఎత్తు. ఈ బాండ్లు రూపంలో సేకరించిన నిధుల్ని ఏం చేశారనే కోణంలో కూడా జగన్ ఆరా తీయబోతున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి సమీక్షకు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే సీఆర్డీఏ అధికారులకు సమాచారం అందింది. రాజధాని అంశంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత.. 7వ తేదీన జరగనున్న వైసీపీఎల్పీ సమావేశంలో దీనిపై కాసేపు చర్చ చేపట్టబోతున్నారు. అందరి ఆమోదంతో ఓ ఏకగ్రీవ తీర్మానం చేయబోతున్నారు.

ప్రస్తుతం జగన్ వేగం చూస్తుంటే.. అమరావతి పేరిట జరిగిన అక్రమాలను ఆయన త్వరలోనే వెలికితీసేలా కనిపిస్తున్నారు. అదే కనుక జరిగితే గత ప్రభుత్వంలో మంత్రులే కాకుండా, ముఖ్యమంత్రి మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐతో పాటు ఈడీ, ఇన్ కం టాక్స్ వంటి సంస్థలపై బాబు విధించిన ఆంక్షల్ని జగన్ తొలిగించారు. చట్టానికి లోబడి ఈ సంస్థలు రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలైనా చేపట్టేలా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు.

జగన్ తీసుకోబోయే ఈ నిర్ణయానికి, రాజధాని అమరావతిపై సమీక్షకు చాలా దగ్గర సంబంధం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూస్తుంటే చంద్రబాబుకు బ్యాడ్ డేస్ దగ్గరపడినట్టున్నాయి. ఇన్నాళ్లు తను చేసిన అక్రమాలకు బాబు మూల్యం చెల్లించే రోజు దగ్గరపడినట్టుంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు