టైమ్ మించిపోతోంది.. ఇక జగన్ మాట్లాడాల్సిందే!

అమరావతిపై తీవ్ర దుమారం చెలరేగిన వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనాన్నే ఆశ్రయించారు. పల్నాడులో వేధింపులంటూ ప్రతిపక్షం అడ్డగోలు వాదనలు చేసిన వేళ, మంత్రులు సమాధానమిచ్చారు కానీ ముఖ్యమంత్రి కలుగజేసుకోలేదు. కానీ ఇప్పుడు జరుగుతోన్న దుమారం 18లక్షల కుటుంబాలకు సంబంధించినది. గ్రామ సచివాలయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న లక్షలాది యువకులకు సంబంధించినది. ఇప్పుడైనా జగన్ ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి.

ఇది ప్రతిపక్షాలకు చెబుతున్న సమాధానంగా అనుకోవాల్సిన పనిలేదు, ప్రజలకు చెబుతున్న వివరణగా భావించాలి. ప్రతిపక్షం పేలుతున్న అవాకులు చెవాకులన్నిటికీ ముఖ్యమంత్రి బదులు చెప్పాల్సిన పనిలేదు కానీ, ప్రజలకు సంబంధించిన ప్రతి అనుమానాన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలే ప్రభుత్వానికి మచ్చగా మిగిలే ప్రమాదం ఉంది.

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని దడదడలాడించిన వేళ.. బయట కూడా అదేస్థాయిలో జగన్ విరుచుకుపడతారని భావించారంతా. అయితే ఆ ఆవేశాన్ని కేవలం అసెంబ్లీకే పరిమితం చేశారు జగన్. బయట పూర్తిగా శాంతి మంత్రాన్నే పఠించారు. ఎన్నిసార్లు ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా జగన్ మాత్రం స్పందించలేదు. కానీ ఇప్పుడు స్పందించక తప్పని పరిస్థితి. జగన్ మాట్లాడితేనే ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయి. మరోవైపు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న 18లక్షల కుటుంబాలకు కాస్తో కూస్తో సమాధానం లభిస్తుంది.

ఇప్పటికే ప్రతిపక్షాలు, యెల్లో మీడియా గ్రామ సచివాలయ ఉద్యోగాలపై తీవ్ర రాద్ధాంతం చేస్తున్నాయి. అధికారపక్షం ఎదురుదాడి మొదలైనా.. అది అంతంతమాత్రమే. ఈలోగా ప్రతిపక్షం ప్రజల్ని రెచ్చగొడుతోంది. ఇలాంటి సమయంలో కనీసం విచారణ గురించి కానీ, లేదా ఉద్యోగాల భర్తీ గురించి కానీ జగన్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ప్రతిపక్షాల నోళ్లు మూతపడే అవకాశముంది.

మరోవైపు నిరుద్యోగుల్లో కూడా ఈ ఉద్యోగాల భర్తీపై సందేహాలున్నాయి. అనుకున్న టైమ్ ప్రకారం ఉద్యోగల ప్రక్రియ పూర్తవుతుందా అవ్వదా? ఎవరైనా కోర్టులో కేసులు వేశారా? ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతంలో నిజమెంత లాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్రంగా సీఎం జగన్ ఓ వివరణ ఇస్తే బాగుంటుంది. 

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments