స్క్రిప్ట్ చంద్రబాబుది.. డైలాగ్స్ అతడి పార్టనర్ వి

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్. చంద్రబాబు, పవన్ కలిసి చీకటి ఒప్పందంతో ముందుకెళ్తున్నారని.. చంద్రబాబు స్క్రిప్ట్ రాస్తుంటే పవన్ వాటిని చదవి వినిపిస్తున్నారని విమర్శించారు.

"చంద్రబాబు రాజకీయ కుట్రల గురించి మీకు తెలిసిందే. వ్యూహంలో భాగంగానే తన పార్టనర్ (పవన్)తో చంద్రబాబు మామీద స్క్రిప్ట్ చదివిస్తున్నారు. ఆ పార్టనర్ ఎవరో తెలుసు కదా. ఓ సినిమా యాక్టర్. బాబే స్క్రిప్ట్ రాస్తారు, ఈయన డైలాగులు కొడతారు. బాబు ఆదేశాల మేరకే ఆ సినిమా యాక్టర్ అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. అన్ని నిర్ణయాలు బాబువే, బి-ఫారమ్ పై మాత్రమే ఆ యాక్టర్ సంతకం పెడతాడు. మొన్నటికిమొన్న ఆ యాక్టర్ నామినేషన్ వేయడానికి వస్తే అన్నీ టీడీపీ జెండాలే కనిపించాయి. ఇలా తన పార్టనర్ తో చంద్రబాబు రకరకాల ఎత్తులు వేస్తున్నారు."

నామినేషన్ వేసేందుకు వచ్చిన జగన్, పులివెందులలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఈ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్రామాలు అక్కర్లేదని సినిమాలు తీయాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు జగన్. రాబోయే రోజుల్లో చంద్రబాబు విపరీతంగా డబ్బు ఆశ చూపిస్తారని, దానికి లొంగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి చంద్రబాబు విపరీతంగా డబ్బులు పంపిస్తారు. అక్రమంగా సంపాదించిన డబ్బు అది. ఆ డబ్బుకు లొంగకూడదు. ఆ డబ్బుకు మన నవరత్నాలే పోటీకావాలి. నవరత్నాలతో సంవత్సరానికి ఎంత మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రతి రైతుకు ఈ విషయాన్ని చెప్పాలి. గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి".

చిన్నాన్నను దారుణంగా హత్యచేసి, కుటుంబ సభ్యులపై ఆ హత్యను తోసేయడానికి చంద్రబాబు కుట్రపన్నారంటూ జగన్ ఆరోపించారు. ఇలాంటి హత్య రాజకీయాలతో పాటు మరో 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు భారీ స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు జగన్.

"కుటుంబ సభ్యులే చిన్నాన్నను హత్యచేసినట్టు చూపించి, కుటుంబ సభ్యుల్లో కీలకవ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చూశారు చంద్రబాబు. అలా పులివెందులలో ఎన్నికలు జరగకుండా చూడాలని కుట్రపన్నారు. అంతేకాదు, మరో 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనానికి, హత్యలకు సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు చంద్రబాబు నిన్ననే ఆదేశాలు ఇచ్చారట. నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నెట్టేయాలని చూస్తున్నారట."

అన్యాయంగా కేసులు పెట్టినా, అన్యాయపు అరెస్టులు చేసినా ఎవరూ హద్దులు దాటొద్దని కార్యకర్తలకు సూచించారు జగన్.. అందరూ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఎన్నికల సమయానికి వైసీపీకి చెందిన పెద్దపెద్ద నేతల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని, ప్రజలే దగ్గరుండి వైసీపీని గెలిపించే బాధ్యను తీసుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు.

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..

Show comments