బీసీల సాక్షిగా బాబు బాగోతం బట్టబయలు

ప్రజాసంకల్పయాత్రలో అడుగడుగునా చంద్రబాబు అవినీతి పాలనను, అరాచకాన్ని బయటపెట్టారు వైఎస్ఆర్సీ అధినేత జగన్. ఆ తర్వాత సమర శంఖారావం పేరిట బాబు నాలుకలో మడతల్ని, టీడీపీ సాగించిన దుష్టపాలనను ఎండగట్టారు. ఇప్పుడు బాబులోని మరో కోణాన్ని బయటపెట్టారు జగన్. కేవలం ఓట్ల కోసం చంద్రబాబు బీసీల్ని మభ్యపెట్టారని ఆరోపించిన జగన్.. ఈ ఐదేళ్లలో బీసీల కోసం చంద్రబాబు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించారు.

"కేజీ నుంచి పీజీ ఉచిత విద్య గాలికి ఎగిరిపోయింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐప్యాడ్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక సంవత్సరానికి బీసీ సబ్-ప్లాన్ కింద 10వేల కోట్లు అన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుకు చట్టం చేస్తారట. ఎన్నికలు నెల రోజులు ముందు చంద్రబాబుకు చట్టాలు గుర్తొస్తాయి. ఐదేళ్లు పాలించినప్పుడు చట్టాలు గుర్తుకురావు."

ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ఇలా చంద్రబాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారు జగన్. బీసీల్ని కేవలం ఓట్లగా మాత్రమే చూసిన బాబు, వాళ్లకిచ్చిన ప్రతి హామీని కావాలనే మరిచిపోయారని, చివరికి తన చేతిలో ఉన్న సబ్-ప్లాన్ అమలును కూడా నీరుగార్చారని జగన్ ఆరోపించారు.బాబు హామీల్ని ఒక్కొక్కటిగా జగన్ చదువుతుంటే, ఏమీ జరగలేదంటూ, ఒక్క హామీ కూడా అమలు కాలేదంటూ ప్రజలంతా చేతులు పైకెత్తి అడ్డంగా ఊపారు.

"రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో 25శాతం నిధుల్ని బీసీ ఉపప్రణాళికగా రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రణాళిక వ్యయంలో 25 శాతం నిధుల్ని బీసీ సబ్ ప్లాన్ కోసం వచ్చేలా ప్రయత్నిస్తానని బాబు మాటిచ్చారు. రాష్ట్రానికి దిక్కులేదు, సబ్-ప్లాన్ దిక్కులేదు, 25శాతానికి కూడా దిక్కులేదు. కేంద్రంలో మాత్రం చక్రం తిప్పి ఏదో చేస్తారట."

కేంద్రంలో ఉన్న బీజేపీతో నాలుగున్నరేళ్లు సంసారం చేసినప్పుడు బీసీ సంక్షేమం అనే పదం ఒక్కరోజు కూడా చంద్రబాబుకు గుర్తురాలేదని విమర్శించిన జగన్.. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీద అరుపులు అరుస్తున్నారని, ఇకనైనా చంద్రబాబు నాటకాల్ని బీసీలతో పాటు ప్రజలంతా గుర్తించాలని పిలుపునిచ్చారు.

"రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవు. ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్రానికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు. బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తామని ఎన్నికల టైమ్ లో చెప్పిన చంద్రబాబు వాటి గురించి పూర్తిగా మరిచిపోయారు. కేవలం ఓట్ల కోసం అప్పట్లో చంద్రబాబు ఆడిన నాటకాలు ఇవన్నీ."

వైసీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఐదేళ్లలో 75వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు జగన్. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిన జగన్.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి 15వేలు ఇస్తామని ప్రకటించారు.

బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించడంతో పాటు బీసీ ఉపకులాల్లో ఉన్న డిమాండ్లను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన డిక్లరేషన్ లో భాగంగా కులాల వారీగా ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు ప్రకటించారు జగన్. కేవలం ఓట్లు కోసం ఇదంతా చెప్పడం లేదని, ఒక్కసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తానని అన్నారు. అన్ని హామీలు నెరవేర్చి ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు అడుగుతామని స్పష్టంచేశారు.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!

Show comments