జగన్‌ నిర్ణయంపై సర్వత్రా చర్చ

మైనింగ్‌ మాఫియా భరతం పట్టగలరా?
అవినీతి రహిత పాలన అందిస్తానని, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జనం నాలుకపై నానుతున్నారు. ఆరు నెలల్లోనే సుపరిపాలన అందిస్తానని హామీనిస్తున్న జగన్‌పై ప్రజల్లో అనేక అంచనాలున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కొత్త ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ళపాటు అనేక కీలకమైన పరిణామాలు గోదావరి జిల్లాల్లో సంభవించాయి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే గోదావరి జిల్లాల్లో అధికారులను కీలుబొమ్మలుగా చేసి కొందరు ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా సహజ వనరులను కొల్లగొట్టారు. అధికారులు అవినీతి మత్తులో జోగుతుంటే నాయకులు కోట్లకు కోట్లు దోచుకున్న వైనం తూర్పు గోదావరి జిల్లాలో సర్వసాధారణం అయ్యింది.

ఇసుక, మట్టి, గనులను అక్రమ మార్గంలో తవ్వుకుపోయి కోట్లు ఆర్జించిన ప్రజా ప్రతినిధుల్లో కొందరికి తాజా ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్‌ రాజాగా పేరొందిన ఓ అభ్యర్ధి ఈ ఎన్నికల్లో సుమారు 50 కోట్లు ఖర్చు చేసినప్పటికీ జనం తిరస్కరించడంతో ఓటమి చెందారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమ మైనింగ్‌ వ్యాపారంలో కోట్లు గడించారు. అయితే ఎన్నికల ఫలితాలనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలతో వీరి ఉనికికి ముప్పు వాటిల్లుతుందా? అక్రమార్కులు ఇక దుకాణాలు సర్ధుకోవల్సిందేనా? అన్న చర్చ జనంలో జరుగుతోంది. జగన్‌ ప్రజలకిచ్చిన హమీలను నిలబెట్టుకునే దిశగా పయనించిన పక్షంలో అనేక ఏళ్ళుగా అక్రమ మార్గంలో జరుగుతున్న మైనింగ్‌పై దృష్టిసారించాల్సి ఉంటుంది.

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంతాడ కొండల్లో దశాబ్ధకాలంగా లాటరైట్‌ను అక్రమమార్గంలో తరలిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి మరీ ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ అక్రమ గనుల తవ్వకాలను స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిననేత స్వయంగా ఇంతకాలం నడిపించారు. ఎమ్మెల్యేల నుండి రాష్ట్ర ప్రభుత్వంలోకి పెద్దలకు సైతం ఈ నాయకుడే వాటాలు పంపేవారని సమాచారం! మైనింగ్‌ సామ్రాజ్యంతో లింకులున్న నేతలందరూ కోట్లకు పడగలెత్తారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఓ వెలుగు వెలిగిన నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోయింది.

గత ఐదేళ్ళలో పెద్దాపురం పట్టణంలో ఓ కొండకు కొండనే తవ్వి తరలించిన ఘనత ఇక్కడి మాఫియా స్వంతం చేసుకుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకపోయింది. ఇసుక ర్యాంపులన్నీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడిచాయి. ఇసుకను ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో ఇది సాధ్యంకాకపోగా మరింత ధర పెరిగింది. రవాణా ఛార్జీల పేరుతో మాఫియా చెలరేగిపోయింది. ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించారు. స్టాక్‌యార్డ్స్‌లో అనధికారికంగా నిల్వచేసినా అధికారగణం మౌనం వహించింది. అక్రమార్కులు సామాన్యుడికి అందనంత దూరంలో ఇసుకను తీసుకువెళ్ళారు.

అధిక ధరలకు ఇసుకను దిగుమతి చేసుకునే దుస్థితిని ఇసుకాగ్రేసరులు కల్పించారు. ముఖ్యంగా ఇసుక అక్రమ లావాదేవీలతో వైకాపా నేతలకూ సంబంధాలుండటం ఇపుడు చర్చనీయాంశమయ్యింది. ఇసుక మాఫియాలో కొందరు వైకాపా నేతలు గత ప్రభుత్వంలో వాటాలను అందిపుచ్చుకున్నారు. ఇదే అంశంపై జిల్లా పరిషత్‌ సమావేశం సాక్షిగా అప్పట్లో తెలుగుదేశం-వైకాపా సభ్యుల మధ్య రభస జరిగింది. మైనింగ్‌ విషయానికి వచ్చేసరికి ఈ వ్యవహారాన్ని పూర్తిగా తెలుగుదేశం నేతలే నడిపించినట్టు తెలుస్తోంది. మట్టి మాఫియాలోనూ టీడీపీ నేతలే అగ్రస్థానంలో కొనసాగారు.

ఇపుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటివరకూ జరిగిన అక్రమాలపై దృష్టిసారిస్తారన్న నమ్మకంతో జనం ఉన్నారు. భవిష్యత్‌లో అక్రమ తవ్వకాలకు తావులేకుండా చూడటంతో పాటు ఇప్పటివరకూ కోట్లలో జరిగిన అక్రమ లావాదేవీలు, అనధికార తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయని విజ్ఞులు సూపిస్తున్నారు.

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు