బాబుకి ఝలక్ ఇచ్చిన జగన్.. సభలో స్లైడ్ షో

అసెంబ్లీలో తాము మాట్లాడాల్సిన పాయింట్లపై నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు చాలామంది సభ్యులు. అంతేకాదు.. కొన్ని ఆధారాలను సిద్ధం చేసుకుంటారు. ఎమ్మెల్యేలందరికీ ఈ డాక్యుమెంట్లు పంపిణీ చేస్తారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా సభలో స్లైడ్ షో సిస్టమ్ ప్రవేశపెట్టారు. గతం కంటే భిన్నంగా తాను చెప్పదలుచుకున్న పాయింట్ ని పిన్ పాయింట్ గా స్లైడ్ షోల రూపంలో ప్రజెంట్ చేశారు.

విత్తనాల కొరత, ఇన్ పుట్ సబ్సిడీ సమస్యలను ప్రస్తావించే సమయంలో జగన్ స్లైడ్ షోలను వాడుకున్నారు. విత్తనాల కొరత సమస్య గత ప్రభుత్వ పాపం అని, తాము అధికారంలోకి రాక మునుపే విత్తనాల పంపిణీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉండాల్సిందని, టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసిందీ ఆధారాలతో సహా సభలో ప్రవేశపెట్టారు.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. రైతు రుణమాఫీ పేరుతో చంద్రబాబు అన్నదాతల్ని ఎలా వంచించారో వీడియో క్లిప్ చూపించారు ముఖ్యమంత్రి. 2014 ఎన్నికల సమయంలో బాబు గుప్పించిన హామీలు, సీఎం అయిన తర్వాత బాబు మాట మార్చిన తీరుని ప్రజెంట్ చేశారు. ఈ వీడియో చూస్తూ బాబు కూడా షాక్ కి గురయ్యారు. జగన్ ఇలా వీడియోలతో సభకు వస్తారని పాపం చంద్రబాబూ ఊహించలేదు.

గతంలో ఎప్పుడూ ఇలా అసెంబ్లీలో వీడియో క్లిప్ లు చూపించలేదు. తొలిసారిగా జగన్, బాబు అబద్ధాలను ఆధారాలతో సహా సభలో చూపెట్టేసరికి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ కావాలో కూడా బాబుకి తెలియలేదు. మొత్తమ్మీద స్లైడ్ షో టెక్నాలజీతో చంద్రబాబుని ఓ ఆటాడేసుకున్నారు జగన్.

ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ చూసిన తర్వాత బాబుకే కాదు, టీడీపీ సభ్యులెవరికీ నోట మాటరాలేదు. తమ తప్పులు, అబద్ధాలన్నీ ఇలా కళ్లముందు వీడియోలు, స్లయిడ్స్ రూపంలో కనిపిస్తుంటే వాళ్లకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?