జగన్‌ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!

కడపజిల్లా కమలాపురం రాజకీయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతూ ఉండటం గమనార్హం. ఇటీవల భర్తీ అయిన గ్రామవాలంటీర్ల నియామకాలకు సంబంధించే రచ్చ రేగింది. అది ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఇంటి ముట్టడి వరకూ వెళ్లడం విశేషం. రవీంద్రనాథ్‌ రెడ్డి తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తంచేస్తూ ఉన్నారు. వారు వ్యక్తంచేస్తున్న అసంతృప్తి ఆసక్తిదాయకంగా మారింది.

ఇంతకీ వారు ఏమంటున్నారంటే.. 'ఇన్ని రోజులూ ఏదైనా అడిగితే పార్టీ అధికారంలో లేదు అనే విషయాన్ని మాకు చెప్పేవారు. చిన్నచిన్న పనుల విషయంలో ఆయనను సంప్రదించినా పార్టీ పవర్‌లో లేదనే విషయాన్ని ఒత్తి చెప్పేవాళ్లు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాకా, ఆయన తన గురించి ఆలోచించుకుంటున్నారు కానీ మా గురించి పట్టించుకోవడం లేదు..' అని రవీంద్రనాథ్‌ రెడ్డి అనుచరులు అంటున్నారు.

గ్రామ వాలంటీర్‌ పోస్టుల నియామకాలు అన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు, ఎన్నికల సమయంలో టీడీపీ కోసం పనిచేసిన వారికే దక్కాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఆ వ్యవహారంలో వారు రవీంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించారు. తమకు అన్యాయం జరిగిందని వారువాపోయారు.

ఆ సంగతలా ఉంటే.. మరో వ్యవహారంలో కూడా రవీంద్రనాథ్‌ రెడ్డి విషయంలో పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది. అదే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేరిక. ఆయనను ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారో అర్థం కానట్టుగా ఉన్నాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఆయన ఎన్నికల ముందు ఏదో మాటమాత్రంగా రవీంద్రనాథ్‌ రెడ్డికి మద్దతు పలికారట. అయినా కూడా వీరశివారెడ్డికి పట్టున్న ప్రాంతంలో వైఎస్సార్సీపీకి పెద్దగా ఓట్‌ షేర్‌ లభించింది కూడా లేదు.

అయినా ఆయనకు పార్టీ అధికారంలోకి రాగానే కండువా వేశారు. గతంలో వీరశివారెడ్డి చాలా దారుణంగా మాట్లాడారు. జగన్‌ మీద, వైఎస్‌ మీద వీరశివారెడ్డి హద్దు మీరి మాట్లాడారు. అర్థరహితంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీ నేత అయిపోవడం గురించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో మద్దతు పలికారని ఆయన విషయంలో చెబుతున్నా అంత తేలికగా వారు సమాధాన పడలేకపోతున్నట్టున్నారు!

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments