తెలంగాణ సమ్మెపై జగన్ స్పందన ఏంటి?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి 17 రోజులవుతోంది. ఇటు కార్మికులు, అటు కేసీఆర్ ఒకరికొకరు తగ్గకుండా పంతానికి పోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తాత్కాలిక సిబ్బందితో రోడ్డు ప్రమాదాలూ పెరిగిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పరోక్ష కారణంగా నిలిచిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించకపోవడం విశేషం. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మరుసటి రోజు నుంచే తెలంగాణ ఆర్టీసీ కార్మికులలో చర్చ మొదలైంది.

ఆర్థిక కష్టాల్లో ఉన్న పక్క రాష్ట్రమే కార్మికులపై అంత ఉదారంగా ఉంటే, ధనిక రాష్ట్రం తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్ తమ కష్టాలను ఎందుకు పట్టించుకోరంటూ నిరసనకు దిగారు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది. ప్రభుత్వంలో విలీనం సహా ఇతర డిమాండ్లతో సమ్మెబాట పట్టారు. అయితే కేసీఆర్ మాత్రం సమ్మెపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ 50వేల మంది కార్మికుల పొట్టకొట్టారు. ఈ పరిణామాలన్నీ ఏపీ ప్రజలు, నాయకులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు నేరుగా కార్మికులకు మద్దతు తెలుపుతున్నాయి. జనసేనాని నేరుగా రంగంలోకి దిగకపోయినా బహిరంగ లేఖలతో తానూ స్పందిస్తున్నానే విషయం తెలియజేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా కార్మికుల బలిదానాలపై మొసలి కన్నీరు కార్చి, కేసీఆర్ పేరెత్తకుండా గోడమీద పిల్లిలా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా నోరు తెరవలేదు. కేవలం రోజా మాత్రమే సమ్మె మొదలైన రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఏపీలో అలాంటి కష్టాలు లేకుండా జగన్ కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు.

అయితే ఆ తర్వాత జగన్ సూచనలతో ఇంకెవ్వరూ తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రియాక్ట్ కాలేదు. జగన్ కూడా పూర్తి స్థాయిలో మౌనాన్నే ఆశ్రయించారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకప్పుడు రాజకీయ వైరుధ్యాలున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం వాటన్నిటినీ పక్కనపెట్టారు జగన్. రాష్ట్రం కోసం నదుల అనుసంధానం వంటి బృహత్తర ప్రణాళికలపై చర్చలు కూడా జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయాలపై జగన్ వ్యాఖ్యానించడం సరికాదు.

ముఖ్యమంత్రులుగా ఎవరి పాలన వారిది, ఎవరి రాజకీయ నిర్ణయాలు వారివి, ప్రజలు మెజార్టీ కట్టబెట్టారు అంటే ఐదేళ్లు వారి పాలనకు కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నట్టే లెక్క. పక్క రాష్ట్రాల విషయాల్లో వేలు పెట్టడం, పొరుగు రాష్ట్రాల నేతలకు సరికాదు. అందుకే జగన్ ఈ విషయంలో పూర్తి సంయమనంతో ఉన్నారు. సమ్మె విషయంలో కోర్టు ఆదేశాలపై సన్నిహితుల వద్ద ఆరా తీస్తున్న జగన్.. తమ పార్టీ తరపున ఎవరూ తొందరపడి స్పందించొద్దని కూడా అంతర్గత ఆదేశాలు జారీచేశారు.

అందులోనూ హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో తన స్పందనను ఇతర రాజకీయ పార్టీలు వారి స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో జగన్ ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఏదేమైనా పక్క రాష్ట్ర రాజకీయ నిర్ణయాలపై జగన్ ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మౌనంగా ఉండడమే సరైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

Show comments