జగన్.. ఇలా అయితే కష్టమే

అధికార ప్రతినిధులు ఒకప్పుడు చాలా చురుగ్గా వుండేవారు. వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా కడుపు నిండిపోయిన వ్యవహారం అన్నట్లుగా వున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం వళ్లు విరుచుకుని సోషల్ మీడియాను వాడుకోవడం మొదలుపెట్టింది. మెయిన్ మీడియా సంగతి సరే సరి.

ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షం చెలరేగిపోతోంది. అన్న క్యాంటీన్ లు కావచ్చు, వరదలు, నీటి విడుదల కావచ్చు, ఇతరత్రా ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు వీటన్నింటి వెనుక విషయాలు వివరించి, విమర్శలను తిప్పికొట్టే చతురత, చాకచక్యం ప్రదర్శించడంలో వైకాపా జనాలు వెనుకపడతున్నారన్నది వాస్తవం. మంత్రి పదవులు అందుకున్న వారు ఎవ్వరూ కూడా పెద్దగా పెదవి విప్పుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అస్సలు మంత్రులు ఎక్కడున్నారో అన్నది చాలామంది విషయంలో అనుమానంగా వుంది.

పనిచేసినా, చేయకపోయినా, క్రియాశీలకంగా కనిపించడం అన్నది ఓ ఆర్ట్. ఆ విషయంలో వైకాపా మంత్రులు అంతా దాదాపు విఫలమయినట్లే కనిపిస్తోంది. జగన్ విదేశాలకు వెళ్లిన టైమ్ చూసుకుని, వరద నీటి మేనేజ్ మెంట్ పై ప్రతిపక్షం అసత్యాలు ప్రచారంలోకి తెచ్చింది. ప్రతిపక్ష అనుకూల మీడియా దానినే ప్రచారం చేస్తోంది. చిత్రమేమిటంటే ఈ విషయంలో సాక్షిపత్రికలో వచ్చిన పాయింట్లు చూసి అయినా, మాట్లాడే పరిస్థితిలో వైకాపా టీమ్ లేకపోవడం.

సాక్షి ఎడిటోరియల్ పేజీలో వరద నీటి మేనేజ్ మెంట్ మీద లెక్కలు, తేదీలతో ఆర్టికల్ వచ్చింది. కానీ అందులోని పాయింట్లను ఏ ఒక్క మంత్రి లేదా నాయకుడు చెప్పి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన దాఖలాలేదు. జగన్ అమెరికా సభలకు జనం రావడం లేదన్న ప్రచారం స్టార్ట్ అయింది. సభ ప్రారంభం కావడానికి ముందే ఖాళీ కుర్చీల వీడియోలను తీసి, వాటిని జగన్ ప్రసంగం వీడియోలకు జతచేసి వదులుతున్నారు. వీటిని కౌంటర్ చేసే వారే లేరు.

మొత్తంమీద జగన్ టీమ్ కు కాస్త బద్దకం లేదా ధీమా వచ్చేసినట్లు కనిపిస్తోంది. అన్నీ జగన్ చూసుకుంటారు అనే భరోసా వచ్చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఇదంతా జగన్ ఆలోచనల్లోకి రానంత వరకే. ఒకసారి వస్తే, మౌనవ్రతం పాటిస్తున్న జగన్ టీమ్ కు కష్టకాలం తప్పదు. కానీ ఈలోగా పార్టీకి డ్యామేజ్ తప్పదు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments