జగన్ గ్రేట్... అంతే...!

మే నెల ఎండలా గత కొద్ది రోజులుగా మండిపోతూ వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఒక్కసారిగా శ్రావణమాసం వాన జల్లుగా చల్లగా మారిపోయారు. ఆయనే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. నేను మెతక అనుకుంటున్నారా. అలా కానే కాదు, నేను హింసావాదిని అంటూ మీడియా ముందు హాట్ హాట్ కామెంట్స్ చేశారు బాబూరావు.

మంత్రి పదవి విషయంలో తనకు తీరని అన్యాయం జరిగిందని ఆయన బాగా ఆవేశపడ్డారు. దెబ్బకు దెబ్బ తీస్తాను అంటూ ఒక దశలో మీడియా ఎదుట రెట్టించి మాట్లాడారు. అలాంటి బాబూరావు ఇపుడు పూర్తిగా మాట మార్చేశారు. తానెపుడు అలాంటి మాటలు అనలేదని అంతా మీడియా సృష్టి మాత్రమే అనేశారు.

ఇక తాను సదా సౌమ్యవాదినే తప్ప హింస‌ వాదిని ఎందుకు అవుతాను అని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. మంత్రి పదవి రాకపోయినా పార్టీకి బద్ధుడినే, జగన్ కి వీర విధేయుడినే అని మాట్లాడేశారు. ఇక ఆయన లేటెస్ట్ గా మరో స్టేట్మెంట్ ఇచ్చేశారు. జగన్ ఏపీలో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కొనియాడారు. జగన్ గ్రేట్ అంటే గ్రేట్ అంటూ కితాబు ఇచ్చారు.

మొత్తానికి బాబూరావు వేసవి టైమ్ లోనూ చాలా బాగా చల్లబడ్డారు. గతంలో మాదిరిగానే మెత్తగా మాట్లాడుతున్నారు. ఆయనలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అన్న చర్చ అయితే ఉంది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అనుకోవాలి కానీ బాబూరావు విషయం మాత్రం వైసీపీ యాంటీ మీడియాకు కొన్ని రోజులు మేత పెట్టింది అని కూడా చెప్పుకోవాలి. ఇప్పటికైతే పేట పంచాయతీ ముగిసినట్లే మరి.

Show comments