పాపం తెదేపాది.. నిందలు ఈ ప్రభుత్వానికి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12775 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు కాలపరిమితి 15 నెలలకిందట ముగిసిపోయింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించి ఉండాలి. కానీ.. అలా జరగలేదు.

అప్పటికే ఓటమి భయంతో కుమిలిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఎన్నికలకు సాహసించలేకపోయింది. సత్వరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటూ.. 13 నెలల కిందటే.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబునాయుడు ఆ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేశారు.

తీరా ఇప్పుడు.. అదే సమస్య మళ్లీ తమ సముఖానికి వచ్చాక.. హైకోర్టు ప్రభుత్వ అలక్ష్యాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. చంద్రబాబు సర్కారు చేసిన పాపానికి జగన్ ప్రభుత్వం నిందలు మోయాల్సి వచ్చింది.

2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కొంత ‘ఎడ్జ్’  కనిపించింది. దానిని చంద్రబాబునాయుడు తనకు అనుకూలంగా విపరీతంగా వాడుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పదేపదే ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉన్నదని చాటుకుని మైలేజీ పొందారు.

అదే చంద్రబాబునాయుడు తన జమానాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సాహసించలేకపోయారు. అప్పటికే తన ప్రభుత్వం, ఏలుబడి పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో ఆయనకు తెలుసు. అందుకే హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఉండిపోయారు.

తీరా ఇప్పుడు జగన్ సర్కారు వచ్చింది. జూన్‌లో అధికారంలోకి రాగా, కుర్చీల్లో కుదురుకోగానే.. అక్టోబరులోనే జగన్మోహనరెడ్డి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహిస్తామనే ప్రకటన చేశారు. అయినా సరే.. తాజాగా ఆ కేసు మళ్లీ కోర్టు ఎదుటకు వచ్చినప్పుడు.. జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికే అక్షింతలు పడ్డాయి.

సత్వరం ఎన్నికలు నిర్వహించడానికి జగన్ కృతనిశ్చయంతోనే ఉన్నారు. సంక్రాంతి తర్వాత.. మునిసిపాలిటీలతో ప్రారంభించి.. ఒక్కొక్కటిగా స్ఖానిక సంస్థల ఎన్నికలు అన్నీ పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారు కూడా. కానీ ఇప్పటికే 15 నెలల జాప్యం జరిగిపోయింది.

గ్రామ పంచాయతీల వికాసానికి, క్షేత్రస్థాయిలో సంతులిత అభివృద్ధికి అది ఇబ్బందికరం. హైకోర్టు హితవచనాలకు తాను కారణం కాకపోయినా.. ప్రకటించిన ప్రకారం సంక్రాంతి తర్వాత జాప్యం లేకుండా పంచాయతీ ఇతర ఎన్నికలన్నీ జగన్ సర్కారు పూర్తి చేయిస్తే బాగుంటుంది.

Show comments