బాబు చీప్ ట్రిక్.. జగన్ ఘాటు రియాక్షన్

తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే. జగన్ కు పరీక్ష పెడదామని చంద్రబాబు చేసిన ఓ విఫల ప్రయోగం చివరకు బాబు పరువునే బజారున పడేసింది. అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బాబు కుటిల పన్నాగాన్ని సాక్ష్యాలతో సహా జనం ముందుంచారు జగన్. బాబు ప్లే చేసిన చీప్ ట్రిక్, దానికి జగన్ ఇచ్చిన ఘాటు రియాక్షన్ వివరాలు ఇవి.

రెండు రోజుల క్రితం... 108 సకాలంలో రాక ఓ గర్భిణి స్త్రీ ఆటోలో ఆస్పత్రికి వెళ్తూ అవస్థలు పడుతుంటే.. పాదయాత్రలో ఉన్న జగన్ ఆ ఆటోకి దారివ్వండి అంటూ పదే పదే మైక్ లో కార్యకర్తలకు సూచిస్తూ సురక్షితంగా ఆటోని పంపించిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సన్నివేశంలో జగన్ వ్యవహరించిన తీరు, అదే సమయంలో 108 వ్యవస్థ పనితీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

"అన్నా నిండు గర్భిణి అన్నా ఆటోకి దారివ్వండి అన్నా" అంటూ జగన్ చేసిన ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ఆర్ ఆశయాలకు టీడీపీ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తోందో, అంబులెన్స్ లు అందుబాటులో లేక ప్రజలు ఎలా అవస్థలు పడుతున్నారో అందరికీ అర్థమైంది. దీంతో బాబు సర్కారు బాగా ఇరుకునపడింది. ఇదంతా జగన్ ప్లాన్ చేసిన ఎపిసోడ్ అంటూ సోషల్ మీడియాలో విషం కక్కాలని చూసింది కానీ అది సాధ్యపడలేదు.

జగన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆటోకి దారి ఇప్పించడం వల్లే సకాలంలో ఆస్పత్రికి చేరామని, తల్లీపిల్ల క్షేమంగా ఉండటానికి ఆ మహానుభావుడే కారణమంటూ ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్ మెంట్ బాబు ప్రభుత్వానికి పుండుమీద కారం చల్లినట్టుగా మారింది.

దీంతో పచ్చదళం మరో కుటిల పన్నాగం పన్నింది. 108 వ్యవస్థ ఇంకా బతికిఉందని చెప్పడానికి రుజువుగా ఈసారి అవసరం లేకపోయినా ఓ అంబులెన్స్ ను జగన్ బహిరంగ సభ మధ్యలోకి పంపించింది. పక్కనే ఖాళీగా వేరే రోడ్డు ఉన్నప్పటికీ జగన్ ప్రసంగం ఊపు మీదున్న సమయంలో సరిగ్గా 108 వాహనం కుయ్ కుయ్ మంటూ అటువైపు వచ్చింది.

ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్నో చూసిన జగన్ కి ఈ కుటిల పన్నాగం అర్థమైంది. వెంటనే ప్రసంగాన్ని అటు మళ్లించి, చంద్రబాబు వికృత చర్యకు నిదర్శనం మీరే చూడండి అంటూ 108 వాహనానికి దారివ్వండి అని కార్యకర్తలకు సూచించాడు జగన్. మొన్న జరిగిన గర్భిణి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కావాలనే చంద్రబాబు ఈరోజు మనమధ్యలో నుంచి 108ని పంపించాడని, అందులో పేషెంట్లు ఎవరూ లేకపోయినా దారివ్వడం మన బాధ్యత అంటూ గుర్తుచేశారు.

వైసీపీ శ్రేణులు కూడా వెంటనే వాహనానికి దారివ్వడంతో అంబులెన్స్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంబులెన్స్ కి దారివ్వకపోతే దాన్ని రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ కాలేదు. 108 వ్యవస్థ ఇంకా బతికే ఉందని చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్ ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ తో పూర్తిగా అభాసుపాలైంది. ఈ ఎపిసోడ్ తో మరోసారి చంద్రబాబు పరువు పూర్తిగా మంటగలిసింది.

కేవలం జగన్ పై పంతంతో, 108పై వచ్చిన వ్యతిరేక ప్రచారాన్ని కప్పి పుచ్చుకోడానికే ఆ వాహనాన్ని అక్కడికి తీసుకొచ్చారని అందరికీ అర్థమైంది. బాబుకి సిగ్గులేదని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనలో పడేశాయి. జగన్ ని టార్గెట్ చేద్దామనుకున్న చంద్రబాబు తాను తీసిన గోతిలో తానేపడ్డాడు.

 

చదవండి : నిండు గర్భిణి అన్నా... దారివ్వండి

Show comments