పాపం చంద్రబాబు.. మళ్లీ ఫుల్ డోస్ పడింది

ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరిగిన చర్చ మరోసారి తీవ్ర ఆగ్రహావేశాలకు వేదికైంది. బుద్దీ, జ్ఞానం ఉందా చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు సీఎం జగన్. దమ్ము, ధైర్యం, నిజాయితీ, సిగ్గు ఉంటే నిజాలు మాట్లాడు, అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీ పరువు తీయొద్దంటూ ఫుల్లుగా కోటింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడిపోతామా అంటూ మరోసారి పాత సీన్ రిపీట్ చేశారు.

ఇంగ్లిష్ మీడియం చదువులపై ఉదయం నుంచి అసెంబ్లీలో చర్చ వాడివేడిగా జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం తాము గతంలో ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియం వ్యవస్థనే ఇప్పుడు జగన్ తన గొప్పతనంగా క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించారని, ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం తెస్తున్నారని అన్నారు. గతంలో సాక్షి పేపర్ కటింగ్ లను ప్రస్తావించారు బాబు.

వెంటనే సీఎం జగన్ అందుకుని, పేపర్లో వచ్చిందని చెప్పడం కాదు, నేను మాట్లాడానని ఆధారాలుంటే చూపించు బాబు అని ప్రశ్నించారు. న్యూస్ పేపర్ల గురించి మాట్లాడితే, తాను ఈనాడు విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందని గుర్తు చేశారు.

ఈనాడు చంద్రబాబుకి కరపత్రంగా మారిందని, ఈనాడులో వచ్చేవన్నీ తాము చెప్పదలుచుకుంటే చర్చ ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు బాబూ అంటూ సూటిగా ప్రశ్నించారు జగన్. అప్పుడు నువ్వు చేయలేకపోయావు, ఇప్పుడు మేం చేస్తున్నాం దట్సాల్ అన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 34శాతం స్కూల్స్ లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నించారని, ఆ విధంగా నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ స్కూల్స్ కి పరోక్షంగా మద్దతు ఇచ్చారని విమర్శించారు.

నాలుగు రోజులుగా అసెంబ్లీ జరుగుతున్నా..ఈరోజు మాత్రం చంద్రబాబుకి మరోసారి జగన్ చేతిలో ఫుల్ కోటింగ్ పడింది. జగన్ ఆవేశం చూసి వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆయనకు మద్దతుగా నిలబడి మాట్లాడారు. అటు చంద్రబాబు కూడా పైకి లేచి ఎదురు దాడికి దిగాలని చూసినా, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పైకి లేచినా.. జగన్ విమర్శల ధాటికి బాబు పూర్తిగా కార్నర్ అయిపోయారు. .  

Show comments