జగన్‌కు పరీక్షలు ప్రారంభం..!

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు ఇక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాలన చేపట్టాక వచ్చే పరీక్షల సంగతి తరువాత. ముందైతే పార్టీలో అంతర్గతంగా వచ్చే పరీక్షలు విజయవతంగా రాసి పాస్‌ కావల్సివుంటుంది. పార్టీలో అప్పుడే పరీక్షలు ఏమున్నాయి అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోయే ఏ నాయకుడికైనా ఎదురయ్యే తొలి పరీక్ష అదే. ఆ పరీక్ష 'మంత్రివర్గం కూర్పు'. వైకాపా 151 సీట్లు సాధించి బండ మెజారిటీ తెచ్చుకుంది. నిబంధనల ప్రకారం మంత్రులు పాతికమందికి మించకూడదు. ఈ పాతికమంది ఎవరనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఫలానవారు మంత్రులు కావొచ్చంటూ మీడియాలో పేర్లు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే ఫలాన వారు మంత్రులు అవుతారని, వారికి ఫలాన ఫోర్టుపోలియోలు ఇస్తారని జాబితాలు హల్‌చల్‌ చేశాయి. ఇవి వాట్సప్‌లోకి చేరుకొని చక్కెర్లు కొట్టాయి. సోషల్‌ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు జాబితాలు పెట్టేశారు. ఇది ఒక విధమైన ఎగ్జిట్‌పోల్సే అనుకోవచ్చు. ఈ జాబితాలోని ముగ్గురో నలుగురో మంత్రులు కావొచ్చేమో. దీన్నే తెలంగాణలో 'అడ్దీ మార్‌ గుడ్డీ దెబ్బ' అని అంటుంటారు. కాని వారికి సోషల్‌ మీడియాలో పేర్కొన్న పదవులే వస్తాయని నమ్మకమేంటి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవులు కోరుకునేవారు చాలామంది ఉంటారు. ఇందుకు వైకాపా కూడా అతీతం కాదు కదా. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు నలుగురు ఉన్నారు.

వైకాపాలో పలు కేటగిరీలున్నాయి. రాజకీయ అనుభవంలో జగన్‌కు మించినవారున్నారు. జగన్‌ పార్టీ పెట్టగానే అందులో చేరి ఇప్పటివరకు ఆయన్నే అంటిపెట్టుకున్నవారున్నారు. ఆయనతో కలిసి పోరాటాల్లో, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నవారున్నారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారున్నారు. బలమైన సామాజికవర్గాలవారున్నారు. 'జెయింట్‌ కిల్లర్స్‌' ఉన్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్తవారై, తొలిసారి పోటీచేసి గెలిచినవారున్నారు.ఇవన్నీ ఇలా ఉంచితే ముఖ్యంగా జగన్‌ కేటగిరీ ఒకటుంది. ఆయన కేటగిరీ ఏమిటి అనుకుంటున్నారా? పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారంలో ఆయన 'పార్టీ అధికారంలోకి వస్తే ఈయన్ని మంత్రి చేస్తాను' అంటూ వాగ్దానం చేశారు.

అలాంటివారు ముగ్గురో నలుగురో ఉన్నారు. 'మాట తప్పను.. మడమ తిప్పను' అనేది జగన్‌ స్లోగన్‌ కాబట్టి అలాంటివారికి పదవులు ఇవ్వాల్సిందే కదా. జగన్‌ ఆలోచించే వాగ్దానం చేశారో, ఆవేశంతో మాట ఇచ్చారో చెప్పలేం. ఇన్ని కేటగిరీలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేయాల్సిందే కదా. ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే మొదటిసారిగా లుకలుకలు మంత్రివర్గం కూర్పులోనే మొదలవుతాయి. అలకలు, కోపతాపాలు, తిరుగుబాట్లు, మా సామాజికవర్గానికి అన్యాయం జరిగిందనే రుసరుసలు.... ఇలాంటవన్నీ బయటపడతాయి. కులాలను, జిల్లాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రివర్గాన్ని ఎంపిక చేయడం సాధ్యంకాదు. ఫలితాలు వెలువడేవరకు 'జై జగన్‌' అని నినాదాలు చేసినవారు కూడా మంత్రిపదవి ఇవ్వకపోతే 'ఛీ జగన్‌' అంటారు.

మంత్రి పదవులు ఇవ్వనివారికి వేరే పదవులు (నామినేటెడ్‌) ఏవో ఇవ్వాలి. వాటి కోసం కూడా అనేకమంది కాచుకుని కూర్చుంటారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌ వెంట ఉన్నవారు ఈ పదేళ్లలో ఎన్నో కష్టాలు పడివుంటారు. ఆర్థికంగా కూడా బాగాలేకపోయివుండొచ్చు. అలాంటివారు పదవులు వస్తాయని తప్పక ఆశిస్తారు. రాకపోతే కుతకుత ఉడికిపోతారు. కాబట్టి ప్రస్తుతం జగన్‌ అనుభవిస్తున్న విజయానందం ప్రమాణస్వీకారం తరువాత ఉండదు. ఇక జగన్‌ అగ్రస్థానం ఇచ్చిన మొదటి వాగ్దానం 'ఏపీకి ప్రత్యేకహోదా'. దీనిపై రాజకీయ పార్టీల్లో , మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. కేంద్రంలో భారీ మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్‌ కూడా అనుకోలేదు. అందుకే 'ప్రత్యేకహోదా ఇస్తామనే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తాం' అని జగన్‌ అనేకసార్లు చెప్పారు.

కాని బీజేపీకి ఒంటరిగానే బండ మెజారిటీ రావడంతో జగన్‌ పార్టీ మద్దతు తీసుకోవల్సిన అవసరం లేదు. టీవీ చర్చల్లోనూ బీజేపీ నేతలు హోదా ఇచ్చేది లేదన్నట్లుగానే మాట్లాడుతున్నారు. హోదా ముగిసిపోయిన అధ్యాయమని ఇదివరకే చెప్పిన కేంద్ర నాయకులు జగన్‌ అడిగితే ఇస్తారా? పరిపాలన అనుభవం లేని జగన్‌ హోదా కోసం ఎలాంటి లాబీయింగ్‌ చేస్తారు? హోదా కోసం పోరాటాలు చేసిన జగన్‌ కేంద్రంతో ఎలా వ్యవహరిస్తారు? ఇప్పుడు ఇవన్నీ ప్రజల ముందు  ఉన్న ప్రశ్నలు. మోదీకి జగన్‌ సన్నిహితుడని, మోదీతో అంటకాగుతున్నాడని మొన్నటివరకు చంద్రబాబు నాయుడు అదేపనిగా ప్రచారం చేశారు. ఇద్దరూ అధికారంలోకి వచ్చారు కాబట్టి సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన అంశం. 

సినిమా రివ్యూ: సీత