ఉక్కు సంకల్పానికి మరో చారిత్రక నిదర్శనం

ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు..
చెదరని ఆత్మవిశ్వానికి ప్రతీకగా నిలిచింది
చెక్కుచెదరని సంకల్పానికి నిలువెత్తు ఉదాహరణగా మారింది

అప్రతిహతంగా సాగిపోతున్న ప్రజా సంకల్పయాత్ర మరో అద్భుత ఘట్టానికి చేరువైంది. అవును.. ఒక్క అడుగుతో తన పాదయాత్రను ప్రారంభించిన జగన్, ఈరోజు 3000 కిలోమీటర్ల మైలురాయిని అందుకున్నారు. ఇదే కేవలం పాదయాత్ర కాదు. దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్ర. జననేత ఉక్కు సంకల్పానికి సిసలైన ప్రతీక.

గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో చిన్న పాయలా ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర, నేడు జనసంద్రాన్ని తలపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత జనం. మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఇది ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న స్పందన. ఇది కోట్లాది మంది ఆంధ్రుల హృదయస్పందన.

పది రోజులకే పక్కకెళ్లిపోతాడని విమర్శించారు. నెల రోజులు దాటితే ఇంటికెళ్లిపోతాడన్నారు. ఎండలకు తట్టుకోలేక చతికిలపడిపోతాడని, వర్షాలకు భయపడి వెనుతిరుగుతాడని.. ఇలా రోజుకో విమర్శ, సీజన్ కో కామెంట్ చేశారు గిట్టనివాళ్లు. అలాంటి విమర్శలన్నింటినీ ఛాలెంజింగ్ గా తీసుకొని, మడమతిప్పని అసలైన ప్రజానాయకుడు అనిపించుకున్నారు జగన్.

విశాఖ జిల్లాలో దిగ్విజయంగా ప్రజాసంకల్ప పాదయాత్రను ముగించి, నూతనోత్సాహంతో  విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన జగన్.. 3వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని దేశపాత్రునిపాలెం అనే చిన్న గ్రామం.. జగన్ సాధించిన ఈ మైలురాయికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఈ సందర్భంగా దేశపాత్రునిపాలెంలో పైలాన్ ను ఆవిష్కరించడంతో పాటు.. ఓ మొక్కను నాటారు జగన్.

నెల్లూరుజిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అందుకున్న జగన్.. పశ్చిమ గోదావరి జిలాల్ మాదేపల్లి వద్ద 2వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు. ఇప్పుడు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో 3వేల కిలోమీటర్ల చారిత్రక మైలురాయిని అందుకున్నారు.

విజయనగరంలోకి ప్రవేశించిన జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. జననేను అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా తర్వాత శ్రీకాకుళంలో అడుగుపెడతారు జగన్. శ్రీకాకుళంలో చేయబోయే పాదయాత్రతో మహాసంకల్పయాత్ర పూర్తవుతుంది. 

Show comments