ఎమ్బీయస్‌: జగన్‌ కూటమి?

ఆంధ్రుల 'జన్మహ్క'యిన ప్రత్యేక హోదా కోసం తాము బిజెపితో పోరాడుతూండగా ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ బిజెపి, జనసేనలతో కుమ్మక్కయి రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని టిడిపి గత కొద్ది నెలలుగా తీవ్రంగా ప్రచారం చేస్తోంది. తాను బిజెపితో కలిసి పయనించినంత కాలం అది గొప్పదే కానీ, తాను బయటకు వచ్చేయడంతో పాతకి అయిపోయిందని ముద్ర కొట్టింది. ఇక రాష్ట్రంలో ప్రధాన శత్రువు జగనే కాబట్టి శత్రువులిద్దరినీ ఒకే కాడికి కట్టేసి, తనను తాను మార్టియర్‌ (అమరవీరుడు)గా చూపించుకుంటోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును, దానితో విభేదించి, దాన్ని చీల్చి బయటకు వచ్చేసిన వైసిపిని తల్లి కాంగ్రెసు-పిల్ల కాంగ్రెసు పేర జోడీ కట్టి అల్లరిపాలు చేసింది. .. నెలల జైలువాసం తర్వాత జగన్‌కు కేసుల్లోంచి బెయిలు రావడానికి కారణం కాంగ్రెసుతో కుమ్మక్కు కావడమే అని ఆరోపించింది. ఆ కేసుల్లో తర్వాత చాలామందికి బెయిళ్లు వచ్చాయి, కొందరు ఐఏఎస్‌లపై కేసులు కొట్టేశారు కూడా. మరి వాళ్లంతా ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదు. బయటకు వచ్చాక జగన్‌ కాంగ్రెసుతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పొత్తు పెట్టుకోలేదు. 2014 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెసును చీలుస్తూ దాన్నుంచి నాయకులను లాక్కుంటూనే వచ్చాడు. 2019 ఎన్నికలలో కూడా కాంగ్రెసుతో పొత్తుకు టిడిపి సిద్ధపడుతోంది కానీ వైసిపి కాదు. ఇలాటి పరిస్థితుల్లో వాళ్లిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందా లేదా అన్నది అభిజ్ఞవర్గాలే తేల్చాలి.

2014లో రాష్ట్రానికి ద్రోహం చేసినది కాంగ్రెసు. అందుకని దానికి వైసిపినిచ్చి పెళ్లి చేశారు. 2019లో ద్రోహం చేసినది బిజెపి. అందుకని యిప్పుడు దానికీ వైసిపికి పెళ్లి చేస్తున్నారు. నిజానికి కేంద్రంలో ఉన్న పార్టీతో వైసిపి సఖ్యంగా ఉంటుందని సులభంగా నమ్మించవచ్చు. ఎందుకంటే జగన్‌ నెత్తిన కేసుల కత్తి వేళ్లాడుతోంది. కొన్నేళ్ల క్రితం తన వెనక్కాల నాయకుల బలం చూసుకుని 'సోనియా ఏం చేయగలదు?' అని అహంకరించాడు. దెబ్బకి సోనియా తన తడాఖా చూపించింది. జగన్‌కు తత్త్వం బోధపడింది. కేంద్రం తలచుకుంటే ఏమైనా చేయగలదని గ్రహించాడు. అందువలన వాళ్లతో కావాలని వైరం పెట్టుకోడని అనుకోవాలి. ''సాక్షి'' టిడిపిపై విరుచుకు పడిన దానిలో పదో వంతు కూడా బిజెపిపై పడదు. తెరాసపై సరేసరి, ఆ జోలికి పోదు. ఇప్పుడు కూడా 'కేంద్రంలో ఎవరికి మద్దతిస్తార'ని అడిగితే 'ప్రత్యేక హోదా ఎవరిస్తారంటే వాళ్లకే..' అంటున్నాడు. అలా భవిష్యత్తు గురించి మాట్లాడడం దేనికి? 'హోదా యివ్వగలిగి కూడా యివ్వనందుకు, అలా యివ్వకపోవడానికి ఫైనాన్సు కమిషన్‌ను అడ్డు వేసుకున్నందుకు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాను' అనవచ్చుగా! అనటం లేదు. పైగా వైసిపి నాయకుడు విజయసాయిరెడ్డి ద్వారా మోదీతో తెగ మంతనాలు జరుపుతున్నాడు.

బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు దూరమై పోతారు కాబట్టి జగన్‌ ఎన్నటికీ బిజెపితో పెట్టుకోడు అని కొందరు వాదిస్తారు. ఎవరితో పెట్టుకున్నా మా వాడేగా అంటూ క్రైస్తవులు ఎలాగూ వేస్తారు.  ఇక ముస్లిములు, నంద్యాలలో బిజెపికి దూరం పెట్టిన వైసిపిని కాదని, బిజెపితో పొత్తున్న టిడిపినే ఆదరించారు. అందువలన అది ఒక ఫ్యాక్టర్‌ కానే కాదు. శత్రువు శత్రువు మిత్రుడు అనే లెక్కలో బిజెపికి చేరువవ్వాలి. అయితే బిజెపి టిడిపితో వైరం పెట్టుకునేది - తన ప్రయోజనం గురించి కానీ, వైసిపిని బలోపేతం చేయడానికి కాదు. అందువలన ఎవరు ఎవర్ని వాడుకుంటున్నారో కొన్నాళ్లకు తెలుస్తుంది. ఈలోగా జగన్‌ భార్యపై కేసులు పెట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌  ప్రతిపాదించింది. తను బిజెపితో రహస్యబంధం పెట్టుకుంటే యిలా జరిగేదా అని జగన్‌ అడుగుతున్నారు. బిజెపి తలచుకుంటే ఎవరైనా లోపలకు వెళ్లగలరు, ఎవరైనా బయటకు రాగలరు. ఇప్పుడు జగన్‌ భార్య తల మీద కూడా కత్తి వేళ్లాడదీయడానికి కారణం, అతను తమ అదుపు తప్పిపోకుండా చూడడం కాబోలు. వాళ్లు ఏం చేసినా జగన్‌ బిజెపి నాయకులపై విరుచుకు పడతాడని, తన మీడియా సాయంతో బిజెపి వ్యతిరేక ప్రచారం చేస్తాడని నమ్మలేము.

టిడిపి వాళ్లు జగన్‌కు పవన్‌తో కూడా లింకు పెట్టారు. మొన్నటివరకు తమ పలుకులే పలికిన పవన్‌ హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడంతో అతని వెనక్కాల బిజెపి ఉందని టిడిపి ఆరోపించింది. ఆ ఆరోపణ నమ్మేట్టుగానే ఉంది. ఎందుకంటే పవన్‌ బాబు, లోకేశ్‌లను అంటున్నట్లు మోదీని అనడం లేదు. హోదా యివ్వనందుకు, హామీలు నెరవేర్చనందుకు బిజెపిపై నిప్పుల వర్షం కురిపించటం లేదు. మెత్తమెత్తటి దెప్పుళ్లతో సరిపెడుతున్నాడు. అయితే టిడిపి పవన్‌ను ఒకవైపు బిజెపితో మరో వైపు జగన్‌తో కూడా ముడిపెట్టింది. అదే కాస్త అర్థం కావటం లేదు. పవన్‌ మొదట్నుంచి జగన్‌ అంటే మండిపడుతూ వచ్చాడు. కెసియార్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట అనడు అని ఎత్తి చూపించాడు, తండ్రి శవం ఉండగానే సంతకాలు సేకరించిన అత్యాశాపరుడన్నాడు, రాష్ట్రాన్ని దోచుకుంటాడన్న భయం ఉందన్నాడు. రాష్ట్రంలో జరిగే తప్పులకు బాబుని విమర్శించడం కంటె ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? అని మాటిమాటికి అనేవాడు. ఇన్ని తిట్లు పడ్డాక జగన్‌ పవన్‌కు మర్యాద యిచ్చి, అక్కున చేరతాడా? తండ్రి స్నేహితుడైన మైసూరా రెడ్డి లాటి వాళ్లే చనువుతో తనను ఏకవచనంతో సంబోధిస్తే 'పార్టీ అధ్యక్షుణ్ని ఎలా గౌరవించాలో తెలియదా?' అని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అలాటివాడు పవన్‌ తనను అంతలేసి మాటలంటే తుడిచేసుకుని స్నేహం చేస్తాడా?

అయినా టిడిపి తన పాట వదిలిపెట్టలేదు. తామొక్కళ్లే ఆంధ్రుల హక్కుల రక్షణకు కంకణం కట్టుకున్నామని, అలా కట్టుకున్నందుకు గాను జగన్‌-బిజెపి-పవన్‌ ఏకమై కుట్ర చేస్తూ తమను అనరాని మాటలంటూ, అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని వాపోసాగింది. దెబ్బకు ఓ సుమూహర్తం చూసుకుని జగన్‌ 'పవన్‌ మాటలకు కూడా వివరణ యివ్వాలా? కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు' అంటూ పవన్‌పై ఘాటు విమర్శ చేశారు. నిజానికి రాజకీయాల్లో అలాటివి ఎవరూ మాట్లాడరు. పవన్‌ ముగ్గురు భార్యల సంగతి ఆరోపణ కాదు, వాస్తవం. ఒకరి తర్వాత మరొకర్ని కట్టుకున్నాడు కానీ ఇద్దర్ని ఒకసారి కట్టుకోలేదు. ఎంత నిజమైనా, ఒక పార్టీ అధ్యక్షుడు మరో పార్టీ అధ్యక్షుణ్ని యిలా వ్యక్తిగతమైన విషయాలపై విరుచుకుపడడం అరుదైన విషయం. చాలా ఎబ్బెట్టయిన సంగతి. రాజకీయాల గురించి విమర్శలు గుప్పించినా, 'ఇదంతా పైపైనే' అని టిడిపి వాళ్లు కొట్టిపారేస్తాడనుకున్నాడో ఏమో, పర్శనల్‌గా వెళ్లాడు.

జగన్‌ పవన్‌పై వ్యాఖ్య చేశాక ''ఆంధ్రజ్యోతి'' రాధాకృష్ణ '..జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోలేదని మరోసారి అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పవన్‌ను తిట్టిపోయడం ద్వారా సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా కాపుల ఆగ్రహానికి గురయ్యారు. అనుభవానికి, అనుభవరాహిత్యానికి తేడా ఏమిటో బాబు, జగన్‌ను చూస్తే తెలుస్తుంది..' అని అభిప్రాయ పడ్డారు. ఇది రాసి 15 రోజులు దాటింది. జగన్‌ పాదయాత్రలో కాపులు పాల్గొనడం మానేశారా? ఈ విషయంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారా? పార్టీలోంచి కాపు నాయకులు బయటకు వెళ్లిపోయారా? - ఆయనే చెప్పాలి. పవన్‌ను అంటే యావన్మంది కాపులను అన్నట్టే అనీ, కాపులను మాత్రమే అన్నట్టని అర్థం తీయడం ఏం సమంజసం? 'అందరివాడిని' అంటూ వచ్చిన చిరంజీవికీ యిలాగే కాపు ముద్ర కొట్టి కొందరివాణ్ని చేయబోయారు. ఇంతకీ జగన్‌  అనుభవరాహిత్యంతో, అనాలోచితంగా అప్పటికప్పుడు పవన్‌పై అనేశాడని అనుకోవడానికి లేదు. పవన్‌కు, తనకు చాలా ఎడం ఉందని చూపించవలసిన రాజకీయ అవసరం ఉంది.

పవన్‌ కళ్యాణ్‌ ఎంత పెద్ద లీడరో ఎవరికీ తెలియటం లేదు. మీటింగులకు జనం బాగానే వస్తారు. కానీ యీ విషయంలో జనాల్ని నమ్మడానికి లేదు. ఎన్టీయార్‌ పోయాక లక్ష్మీపార్వతి మీటింగులకూ బాగానే వచ్చారు,  చిరంజీవికీ వచ్చారు, జూ.ఎన్టీయార్‌కూ వచ్చారు. ఓట్లు మాత్రం వేయలేదు. ఓట్లు పడాలంటే ప్రతి నియోజకవర్గంలో పార్టీకి నిర్మాణవ్యవస్థ ఉండాలి. బూత్‌ స్థాయిలో వాలంటీర్లు ఉండాలి. జనసేన విషయంలో అది ఉన్న దాఖలాలు కనబడటం లేదు. కార్యకర్తలు జాతరకు వచ్చినట్లు మీటింగుకి వచ్చి, యింటికి వెళ్లిపోతే ఎలా? ఊళ్లల్లో పార్టీ ఆఫీసులున్నాయా? వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పే వాళ్లున్నారా? అసలు టీవీ చర్చల్లో వాళ్ల పార్టీ విధానం గురించి, సిద్ధాంతాల గురించి, జాతీయ అంతర్జాతీయ సమస్యలపై వారి వైఖరి గురించి మాట్లాడి తటస్థ ఓటర్లను ఆకట్టుకునే స్పోక్స్‌మెన్‌ ఉన్నారా? నాకైతే తెలియదు. పవన్‌ పార్టీ అంటే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే పార్టీయే అనిపిస్తోంది. రాజకీయ పార్టీ నడపడం మాటలు కాదు. థింక్‌ట్యాంక్‌ ఉండాలి, ఆలోచనలను బలంగా జనంలోకి తీసుకెళ్ల గలిగిన 10, 15 మంది నాయకులుండాలి. జనసేనలో ఎటునుంచి లెక్కెట్టినా పవన్‌ ఒక్కడే కనబడుతున్నాడు. వేరెవరూ కనబడటం లేదు.

జనసేనలో ''ఆంధ్రప్రభ'' యజమానులు చేరారని, పార్టీ టీవీ 99 ఛానెల్‌ కొన్నదని వార్తలు చూశాను. పవన్‌ వెనక పెద్ద పారిశ్రామిక వేత్తలెవరూ లేనట్లున్నారు. అందుకే కాబోలు వీటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. నిర్మొగమాటంగా చెప్పాలంటే - టూ లేట్‌ అండ్‌ టూ లిటిల్‌. ఎన్నికలు వచ్చి మీద పడుతున్నాయి. ఇప్పుడు మొదలుపెడితే ఎప్పటికి అందుకుంటారు? ఇన్ని లోటుపాట్లు ఉన్నా ఏదో అద్భుతం చేస్తాడనే ఆశతో యువత పవన్‌ వైపు చూస్తున్నారనే రిపోర్టులు వచ్చి ఉంటాయి. దాంతో టిడిపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడడానికి జగన్‌ పవన్‌ పట్ల తన వైషమ్యాన్ని బహిరంగ పరచాడని అనుకోవాలి. టిడిపి పరిపాలనలో కమ్మ డామినేషన్‌ ఎక్కువై పోయిందనే అభిప్రాయంతో ఉన్న యితర కులస్తులు, దాన్ని తగ్గించడానికి వైసిపి, జనసేనల మధ్య ఎవరో ఒకర్ని ఎంచుకునే పరిస్థితిని యీ ప్రకటనతో కల్పించాడు జగన్‌. తనైతే సీరియస్‌ పొలిటిషియన్‌ అని, 'పవన్‌ కాజువల్‌ పొలిటిషియన్‌, అతన్ని నమ్ముకుంటే టిడిపి దాష్టీకాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు' అనే భావం కలిగించడానికి అతని గురించి తేలికగా మాట్లాడి వుంటాడు.

బిజెపి, జనసేనలతో పొత్తు కుదుర్చుకుంటే వైసిపి అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయలేదు. కొన్నయినా వాళ్లకు వదలాల్సి వుంటుంది. పవన్‌ కాపులపై ఎక్కువ ప్రభావం చూపుతాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాపు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి నాయకులు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. వారికి ధైర్యం చెప్పడానికైనా యిలా అని వుండవచ్చు. ఏది ఏమైనా దీని తర్వాత పవన్‌, జగన్‌ కలిసి పనిచేస్తారని ఎవడూ నమ్మడు. ఒకవేళ రాజకీయ కారణాలపై బిజెపి ఒత్తిడి వలన పవన్‌ సిద్ధపడినా అతని అభిమానులు ఛస్తే ఒప్పుకోరు.

నిజానికి పవన్‌ అభిమానులు అతనికి బలమో, బలహీనతో తెలియకుండా పోయింది. రేణు దేశాయి విషయంలో వాళ్లు చాలా తలకాయనొప్పి తెచ్చిపెట్టారు. ఆమె వెనక్కాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా, ఆమె స్వయంగా చేస్తోందా అనేది చెప్పలేం. కానీ పవన్‌ రాజకీయాల్లోకి రావడం వలన వాళ్లిద్దరికి సంబంధించిన ప్రతీది హైలైట్‌ అవుతోంది. పాలిటిక్స్‌ అంటే అంతే మరి. చిరంజీవి తను పుట్టిన ఊరికి ఏమైనా చేశాడా, తన సొంత జిల్లా పశ్చిమ గోదావరికి ఏమైనా చేశాడా లేదా అన్నది మెగాస్టార్‌గా ఉన్నంత కాలం ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రజారాజ్యం పెట్టగానే అప్పుడు యీ ప్రశ్నలన్నీ వచ్చాయి. చివరకు సొంత జిల్లాలో ఓడిపోవల్సి వచ్చింది. పవన్‌ పొలిటికల్‌ ఫోర్స్‌గా ఎదుగుతున్న కొద్దీ అతని కవచంలో బీటలకోసం వెతుకుతారు ప్రత్యర్థులు. అది తెలిసి రేణు దేశాయిని ఊరడించో, బుజ్జగించో ఊరుకోబెట్టాలి. కానీ రెచ్చగొట్టకూడదు. పవన్‌ అభిమానులు ఆ పని చేశారు. దాంతో ఆమె 'నాతో కాపురం చేస్తూనే యింకో అమ్మాయికి కడుపు చేశాడు, అది భరించలేకపోయాను' అంది.

ఈ మాటతో సాధారణ పౌరుడికి రేణుపై సింపతీ పెరిగింది. పాశ్చాత్య దేశాల్లో కూడా తనతో పెళ్లికి ముందు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు, ఎంతమందితో పడుక్కున్నారు అనేది పట్టించుకోరు. పెళ్లయ్యాక నాతో విశ్వాసంగా ఉన్నావా లేదా అన్నదే పాయింటు. టూటైమింగ్‌ చేస్తున్నారంటే క్షమించరు. రేణుకి విడాకులు యిచ్చిన తర్వాత పవన్‌ మరొకరితో తిరిగాడంటే ఎవరికీ ఫిర్యాదు ఉండదు. కానీ యిప్పుడు గుట్టుగా ఉండవలసిన ఆ విషయం బయటకు వచ్చి పబ్లిక్‌ మైండ్‌లో పవన్‌కు నెగటివ్‌ మార్క్‌ పడింది. ఈ పరిస్థితి రావడానికి కారణం రెచ్చిపోయిన పవన్‌ అభిమానులు! జగన్‌ పవన్‌పై వ్యాఖ్యానించగానే వాళ్లే జగన్‌ కుటుంబసభ్యులపై విరుచుకు పడిపోయారు. జగన్‌ చెప్పినది యదార్థం కాగా వీళ్లు చేసినవి ఆరోపణలు. ఈ సందర్భంలో పవన్‌ చాలా హుందాతనం ప్రదర్శించి తను స్వయంగా జగన్‌ని ఏమీ విమర్శించకపోవడమే కాక, వాళ్ల కుటుంబసభ్యులను ఏమీ అనవద్దని అభిమానులకు బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు. ఇదే పని రేణు విషయంలో కూడా చేసి ఉంటే బాగుండేది.

ఏది ఏమైతేనేం, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. జగన్‌ కూటమిలో పవన్‌ అయితే లేడు. ఇక బిజెపి ఉందా లేదా అన్నది తేలాలి. బాబు కాంగ్రెసుతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే, జగన్‌ బిజెపితో పెట్టుకోవడానికి సాకు దొరుకుతుంది. ఎందుకంటే కాంగ్రెసు అంటే జగన్‌కు నిలువునా ద్వేషం, తనపై కేసులు పెట్టిందని! బెయిలులో బయటకు రావడానికి రాజీ పడి ఉంటాడని ఊహించినా, అది తాత్కాలికమే. స్నేహమైతే కచ్చితంగా లేదు. ఇక ముందు కూడా టిడిపితో పొత్తు యిష్టం లేని కాంగ్రెసు వారిని తనవైపు లాగడానికి ప్రయత్నించి జగన్‌ కాంగ్రెసుకు మరింత శత్రువవుతాడు. ఇక హోదాయే సర్వస్వమంటూ చెపుతూ వచ్చిన జగన్‌ హోదా విషయంలో దగా చేసిన బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గుకు రాగలడా? పొత్తును ఏ విధంగా సమర్థించుకో గలడు? పొత్తు కుదరదని చెప్పేసినందునే బిజెపి జగన్‌ నెత్తిపై అతని భార్య కేసుల కత్తి వేళ్లాడదీసిందా? లేకపోతే యిన్నాళ్లకు ఇడి మేల్కొనడమేమిటి!

ఇవన్నీ తరచిచూస్తే టిడిపి చేసే జగన్‌-బిజెపి-పవన్‌ రహస్య కూటమి ప్రచారంలో పస లేదని తెలుస్తుంది. కనీసం ప్రస్తుతానికి లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

Show comments