డోస్ పడింది.. ఇక హాయిగా నిద్రపో పవన్

పసలేని విమర్శలు చేయడం, వితండవాదం చేయడం, పనిగట్టుకుని కెలుక్కోవడం.. ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ కి బాగా అలవాటైన విద్య. చంద్రబాబుని చూసి నేర్చుకున్నారో లేక, ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఇలాంటి అస్త్రాలు వాడాలని ఎవరైనా చెప్పారో తెలియదు కానీ పవన్ కల్యాణ్ మాత్రం దీన్ని బాగా ఫాలో అవుతున్నారు. అందులోనూ పదే పదే జగన్ ని కెలకందే పవన్ కి నిద్రపట్టడం లేదు. జగన్ తో ఆ ఒక్కమాటా అనిపించుకోకపోతే పవన్ కి అసలు మనసు మనసులో ఉండేలా లేదు.

గతంలో ఓసారి ఇలాగే వాగుతుంటే, పవన్ పెళ్లిళ్ల విషయంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు జగన్. పవన్ విమర్శల్ని పూచిక పుల్ల తీసిపారేసినట్టు తీసిపారేశారు. ఇప్పుడు మరోసారి పవన్ నోటికి పెళ్లిళ్ల తాళం వేశారు జగన్. తెలుగు భాషపై ప్రేమ పొంగిపొర్లిస్తూ పవన్ సాగిస్తున్న వాగుడుకు ఘాటుగా జవాబిచ్చారు.  ఎంతమంది భార్యలు, వారికెంతమంది పిల్లలు, వారు చదివేది ఏ మీడియం అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబుని కూడా జగన్ ఇంత తీవ్రంగా విమర్శించలేదు. కానీ పవన్ కల్యాణ్ కి బుద్ధి చెప్పాలంటే కాస్త గట్టిగానే జవాబివ్వాలని అనుకున్నారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ పవన్ పరువు తీస్తున్నారు జగన్.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అలా ఎందుకనేది బహిరంగ రహస్యం. దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం. వైసీపీ నేతలు అన్నట్టు పవన్ కి జగన్ అంటే జలసీ అనుకోవాలి. ఇప్పటివరకూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కి కౌంటర్లు ఇస్తూ వచ్చారు కానీ ఎవరూ ఇంత ఘాటుగా తగులుకోలేదు. ఒక దశలో చిరంజీవిని సైతం తమ కామెంట్లలోకి తీసుకొచ్చారు కన్నబాబు, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ లాంటి నేతలు. కానీ పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తేలేదు.

కానీ పవన్, ఏకంగా జగన్ ఇగోను హర్ట్ చేశారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో కేసీఆర్ తో పోలిక తెచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. ఇలాగే వదిలేస్తే ఇంకా చెలరేగే ప్రమాదం ఉందని కాబోలు సీఎం జగన్, టైమ్ చూసి పవన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అయితే జనసైనికులు అంతలోనే ఫీలయిపోతున్నారు. మేమూ మీ కుటుంబాల గురించి మాట్లాడాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక్కడ సమస్య కుటుంబ వ్యవహారం కాదు, తెలుగు భాషది. ముందు పవన్ కల్యాణ్ తన భార్యలు, వారి పిల్లలు, వారి విద్యా వ్యవహారాలపై స్టేట్ మెంట్ ఇచ్చి అప్పుడు తెలుగు భాషపై ప్రేమ కురిపించాలి. లేకపోతే ముందు ముందు మరింత ఘాటు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తమ్మీద పవన్ కు పడాల్సిన డోస్ పడిపోయింది. ఇన్నాళ్లూ ఈ డోస్ కోసమే అన్నట్టు విమర్శలు చేసిన జనసేనాని ఇక హాయిగా నిద్రపోవచ్చు.

Show comments