దేవేగౌడ, మనవడు.. ఇద్దరికీ ఎదురుగాలేనా?

కర్ణాటకలో ఈసారి తన ఇద్దరి మనవళ్లను ఎంపీలుగా పోటీ చేయించడంతో పాటు, తను కూడా ఎంపీగా పోటీచేస్తూ ఉన్నారు దేవేగౌడ. తుమకూరు నుంచి దేవేగౌడ ఎంపీగా పోటీలో ఉన్నారు. రేపు తుమకూరులో పోలింగ్ జరగనుంది. అలాగే మండ్య నియోజకవర్గానికి కూడా రేపే పోలింగ్ జరగనుంది. మండ్యలో దేవేగౌడ మనవడు నిఖిల్ ఎంపీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ సుమలత వర్సెస్ నిఖిల్ గౌడ పోరాటం సాగుతూ ఉంది.

పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే.. అటు తుమకూరులో దేవేగౌడకు అంత సులభం కాదు, ఇటు మండ్యలో నిఖిల్ గౌడ కూ అంత ఈజీకాదని అంటున్నారు. సుమలత మీద సానుభూతి ఉంది. అంబరీష్ పేరకు ఆ ప్రాంతంలో క్రేజ్ ఉంది. కుల సమీకరణాలు కూడా అంబరీష్ సతీమణికే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో జేడీఎస్ కు తిరుగులేని పట్టుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో జేడీఎస్ స్వీప్ చేసింది. అదే నిఖిల్ కు సానుకూలమైన అంశం.

బీజేపీ బాహాటంగానే సుమలతకు సపోర్ట్ ప్రకటించింది. జేడీఎస్ కోసం పనిచేయడానికి కాంగ్రెస్  సానుకూలంగా లేదు. సుమలత మీద జేడీఎస్ జనాలు సానుభూతి చూపారంటే నిఖిల్ గౌడకు కష్టమే అని చెప్పకతప్పదు. ఇక లేటు వయసులో తుమకూరులో పోటీకిదిగారు దేవేగౌడ. అక్కడ ఈయనకు విజయం అంత సులభం కాదనేమాట వినిపిస్తోంది. దానికి పలు కారణాలున్నాయి. ఇక్కడ జేడీఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వాస్తవానికి అయితే జేడీఎస్ – కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో ఉన్నాయి. కానీ.. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ పోరు గట్టిగా సాగుతూ వచ్చింది.

క్రేత్రస్థాయిలో తుమకూరు పరిధిలో కాంగ్రెస్- జేడీఎస్ లకు రాజకీయ వైరం గట్టిగా ఉంది. బీజేపీ ఇన్నేళ్లూ ఇక్కడ నామమాత్రమే. ఇప్పుడు పొత్తులో భాగంగా కాంగ్రెస్ వాళ్లు ఈ సీటును దేవేగౌడకు ఇచ్చారు. ఇన్నాళ్లూ రచ్చలను మరిచిపోయి జేడీఎస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు సపోర్ట్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తుమకూరు పరిధిలో ఇన్నేళ్లూ బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి పోటాపోటీగా మారింది.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?