ఇస్మార్ట్ హిట్.. అవసరం.. అద్భుతం

ఇస్మార్ట్ శంకర్.. ఈ రోజు టాలీవుడ్ తలతిప్పి చూస్తున్న సినిమా. అదేదో బాహుబలి కాదు, అలా అని ఓ క్లాసిక్ గా నిలిచిపోయే సినిమా కాదు. జస్ట్ పూరి జగన్నాధ్ సినిమా. కానీ ఆ సినిమాకు ఓపెనింగ్ టికెట్ లు తెగుతున్న తీరుచూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. పూరి సినిమాకు ఇలా ఓపెనింగ్ వుంటుందని ఇండస్ట్రీ ఊహించలేదు.

అంతెందుకు ఈ సినిమాను కొనడానికి జనాలు ముందుకు వచ్చారు కానీ రేటు పెట్టడానికి రాలేదు. ఆఖరికి రీజనబుల్ రేట్లకు అమ్మేసారు. అది వేరే సంగతి. ఓపెనింగ్స్ చూసాక నైజాంలో లీడ్ బయ్యర్లు, నాలుక కరచుకుంటున్నారు, వదిలేసామే అని.

సినిమా ఎలా వుంటుంది? మార్నింగ్ షో పడిన తరువాత ఎలా వుంటుంది? అన్న సంగతులు పక్కనపెడితే ఓపెనింగ్స్ కనిపించడమే అద్భుతంగా ఫీలవుతున్నారు సినిమా జనాలు. ఎందుకంటే ఇటీవల కాలంలో హీరో రామ్ కు సరైన సినిమా లేదు. సరైన ఓపెనింగ్ లేదు. పూరి జగన్నాధ్ సంగతి తెలిసిందే. తను బ్యాడ్ ఫేజ్ లో వున్నానని ఆయనే చెబుతారు మొహమాట పడకుండా.

ఇక హీరోయిన్లు నభానటేష్, నిధి అగర్వాల్ పెద్ద సూపర్ హీరోయిన్లేమీ కాదు. వారి ఖాతాలో కూడా హిట్ లు ఏమీలేవు. మరి ఎలా సాధ్యమైంది ఈ బజ్, హడావుడి, ఓపెనింగ్.

దానికి రెండు మూడు కారణాలు వున్నాయి.
ఒకటి పక్కా మాస్ మసాలా సినిమా కోసం ఆ తరహా సినిమాలు చూసే జనాలు మొహం వాచిపోయి వున్నారు. మజిలీ, జెర్సీ, చిత్రలహరి, మహర్షి లాంటి సైలంట్ గా చూసే క్లాస్ సినిమాలు తప్ప, ఈలలు, పేపర్లు ఎగరేయడాల వంటి వ్యవహారాలు ఈ ఏడాది ఇప్పటివరకు కనిపించలేదు.

అమ్మాయిల వంటిపై ఎంత తక్కువ దుస్తులు వుండాలో అంతే వుంచి, ఎంత ఎక్కువ చూపించాలో అంతా చూపించి, హీరో భుజాల మీద, గుండెల మీద, ఇలా ఎక్కడపడితే అక్కడ అమ్మాయిని ఎక్కించేసిన సినిమా స్టిల్స్ ఇటీవల కనిపించలేదు.

ఇక మూడోది ఇక హీరో హీరోయిన్లు సినిమాలో పచ్చిగా మాట్లాడేసిన సినిమా. ఇవన్నీ సినిమాకు ముందే భయంకరంగా బయటకు వదిలేసారు. ఒకటి కాదు రెండు ట్రయిలర్లు కట్ చేసి వదిలారు. వాటిలో కథ ఎవరికీ పట్టలేదు. అది అవసరం అనిపించలేదు. అమ్మాయిల అందాలు, డబుల్ మీనింగ్ డైలాగులు అంతే.

ఇప్పుడు ఈ సినిమా హిట్ అవసరం
ఎవరికి? అందరికీ. నిర్మాతగా చార్మికి, డైరక్టర్ గా పూరికి, హీరోగా రామ్ కు, హీరోయిన్లుగా నభా, నిధిలకు. ఎందుకంటే వారందరికీ ఇది లైఫ్ అండ్ డెత్ అన్నంత సమస్య.

హిట్ అయితే అద్భుతమే.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే సెంటిమెంట్లమయం. లైనప్ బాగాలేని హీరోయిన్లను తీసుకోరు. డౌన్ లో వున్న డైరక్టర్ ను అయినా, హీరోను అయినా పక్కన పెడతారు. మరి అలాంటి వాళ్లు అందరూ కలిసి ఓ సినిమా చేస్తే, అది హిట్ అయితే అద్భుతమే కదా?

అన్నట్లు ఇటీవలి కాలంలో కాశీ పుణ్యక్షేత్రంలో షూట్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. హిట్ అయితే ఆ విధంగా కూడా అద్భుతమే. ఎందుకంటే కాశీ లోకేషన్ తెలుగు సినిమాలకు అంతగా అచ్చిరావడం లేదు మరి. అది పవన్ కళ్యాణ్ అయినా, బెల్లంకొండ అయినా, ఇంకా చాలామంది అయినా.

ఈ సెంటిమెంట్లు అన్నీ చటాల్న పక్కకు తోసి పూరి లాంటి డిఫరెంట్ డైరక్టర్ కోసం అయినా హిట్ అవ్వాలనే కోరుకుందాం.

Show comments