మంత్రిగారు ముందే ఓటమి ఒప్పుకున్నట్టేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. తర్వాత.. అధికారం అండకోసం తెదేపాలోకి ఫిరాయించిన అనైతిక మంత్రుల్లో అమరనాధరెడ్డి కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గెలిపించిన పార్టీని కాదనుకుని, అనైతికంగా ఫిరాయించినందుకు ఆయన మీద నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఉన్నదని స్థానికంగా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి మరోమారు విజయం సాధించడం కూడా కష్టమే అని స్థానికంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు ఇంకా ఆమడ దూరంలో ఉన్నాయనగానే... మంత్రి అమరనాధరెడ్డి.. పలమనేరు నియోజకవర్గం నుంచి పలాయనం చిత్తగించేస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది. పలమనేరులో తనకున్న చెడ్డపేరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదని క్లారిటీ రావడంతో.. అమరనాధరెడ్డి.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మార్చుకుని పుంగనూరు నుంచి పోటీచేయవచ్చునని పలువురు అనుకుంటున్నారు.

చంద్రబాబు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు కూడా దీనికి సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు సిటింగు స్థానాల్లో ఉండే ప్రజాప్రతినిధులకు మళ్లీ టికెట్లు ఇస్తాయి. ఎంతో ప్రతికూల వాతావరణం ఉంటే తప్ప అభ్యర్థిని మార్చడం జరగదు. ఇది ఒకఎత్తు అయితే.. పుంగనూరులో ప్రస్తుతం తెలుగుదేశానికి అమరనాధరెడ్డి భార్య అనూషా రెడ్డిని పార్టీ ఇన్చార్జిగా  చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నిర్ణయంతో ముడిపడి జిల్లాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అనూషా రెడ్డికి పుంగనూరు టికెట్ ఇచ్చినట్లయితే... ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇచ్చినట్లు అవుతుందని.. అమరనాధరెడ్డి మీద చంద్రబాబుకు అంత ప్రేమలేదని అంటున్నారు. అమరనాధరెడ్డి.. పలమనేరులో తాను మళ్లీ గెలిచే అవకాశం లేదని అర్థమైపోవడంతో... ఇక ఆ నియోజకవర్గం వద్దనుకుని.. పుంగనూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.

మధ్యలో అక్కడ మరొకరు ఇన్చార్జిగా వస్తే.. ఎన్నికల సమయానికి టికెట్ కోసం గొడవ చేస్తారు గనుక.. ప్రస్తుతం తన భార్యనే అక్కడ ఇన్చార్జి చేసి.. ఆ తర్వాత.. ఎన్నికల సమయానికి ఆయన పలమనేరును వదలిపెట్టి పుంగనూరు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. ఎన్నికల గంట మోగక ముందే.. మంత్రిగారు పలాయనం చిత్తగిస్తున్నారన్నమాట.  

Show comments