ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే!

మంచిమాట:
గతవారంలో వెబ్‌లో రెండు వార్తలు బాగా ఆకర్షించాయి. అందులో ఒకటి అమెరికన్‌ పిల్లాడి వార్త. ఏడేళ్ల వయసున్న పిల్లాడు అతడు. మరొకరు గుడివాడకు చెందిన మస్తానమ్మ. నూటా ఆరేళ్ల వయసులో ఆమె మరణించారు. రెండు వార్తలకూ ఒక సంబంధం ఉంది. అదే యూట్యూబ్‌. వీళ్లిద్దరూ యూట్యూబ్‌లో సంచలనాలు రేపినవాళ్లు. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఆకట్టుకోవడానికి అద్భుతాలు చేయడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు వీరిద్దరూ.

మస్తానమ్మ అత్యంత వయసును కలిగిన యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకురాలిగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అత్యంత వృద్ధురాలైన యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకురాలు మరణించిందని బీబీసీ కూడా వార్తా కథనాన్ని ఇచ్చింది. మామూలుగా అయితే మస్తానమ్మ ఎవరికీ పట్టేది కాదేమో. ఆమె యూట్యూబ్‌ చానల్‌కు ఉన్న ఆదరణ.. ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది.

యూట్యూబ్‌లో ఆమె వంటలు చానల్‌కు లభించిన ఆదరణ ఆమెను ఒక సెలబ్రిటీని చేసింది. గుడివాడకు చెందిన మస్తానమ్మ ఇలా యూట్యూబ్‌ ద్వారా ఒక సెలబ్రిటీ స్టేటస్‌ సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ఆమె మరణాన్ని ప్రముఖమైన అంశంగా పేర్కొన్నాయి. ఇదీ ఇంటర్నెట్‌ ద్వారా మస్తానమ్మ సంపాదించుకున్న గుర్తింపు.

పెద్ద పెద్ద చదువులు చదవలేదు, టెక్నాలజీ గురించి అధ్యయనం చేసి పండిపోలేదు. తనకున్న నేర్పుతో మస్తానమ్మ ఆ స్థాయికి ఎదిగిది. ల్యాప్‌టాప్‌లు ముందు పెట్టుకుని వల్గర్‌ కామెంట్స్‌ చేయడమే పనిగా పెట్టుకున్న నేటి యువతరం.. మస్తానమ్మ నుంచి ఏం నేర్చుకోవాలో అర్థం చేసుకోవాలి.

ఇక ర్యాన్‌ అనే అమెరికన్‌ పిల్లాడు కూడా మస్తానమ్మ లాంటి వాడే. ఇతడూ ఇంకా ఏమీ చదువుకోలేదు, టెక్నాలజీలో పండిపోలేదు, కనీసం ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేయడం కూడా ఈ పిల్లాడికి రాకపోవచ్చు. అయితేనేం.. ఫోర్బ్స్‌ జాబితాలోకి ఎక్కాడు. యూట్యూబ్‌ ద్వారా అత్యధిక మొత్తాన్ని ఆర్జించిన ధనికుడిగా ఈ ఏడేళ్ల బాలుడు ఫోర్బ్స్‌ లిస్టులో స్థానం సంపాదించాడు.

ర్యాన్‌ గత ఏడాదిలో తన యూట్యూబ్‌ చానల్‌లో బొమ్మలను, పిల్లల ఫుడ్‌ను రివ్యూ చేసి సంపాదించిన మొత్తం అక్షరాలా నూటాయాభై కోట్ల రూపాయలకు పైనే! ఇంటర్నెట్‌ను మాధ్యమంగా చేసుకుని దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ పాయింట్‌.

సవ్యంగా వాడుకుంటే.. మస్తానమ్మ, ర్యాన్‌లా స్థాయిలో పదోవంతు స్థాయికి ఎదిగినా.. గొప్పోళ్లే అవుతారు. లేకపోతే వెబ్‌సైట్లలో కామెంట్లు రాసుకొంటూ బతకాల్సి ఉంటుంది. ఛాయిస్‌ ఎవరికి వారిదే!

-ఎల్‌.విజయలక్ష్మి

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments