ఓట్లకు సీట్లకు గతిలేదు, ఫైట్లకు రెడీ!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న పసిపిల్లవాడిని అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తారు... ‘ఎవరో ఒకరు ఊపిరిపోయకుంటే పాడె మీద ఉన్నట్టే’నని! ఆ పార్టీకి నికరంగా రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలు వేసుకోవడానికి కూడా కార్యకర్తలు లేరు. ఆరకంగా ఓట్లు సంపాదించుకునే బలం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్న తర్వాత.. కనీసం 15 సీట్లకు మించి ఎన్ని సాధించుకోగలరో దిక్కులేదు... అయితే అప్పుడే ఆ పార్టీలో అంతర్గతంగా ఫైట్లు, కుమ్ములాటలు మాత్రం షురూ అయిపోయాయి.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా పార్టీ కీలక నాయకుల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కాకపోతే, ఆ సమావేశం ఆద్యంతమూ... హాట్ హాట్ గా కుమ్ములాటల మయంగా జరిగినట్లుగా సమాచారం. ప్రజాదరణకు గతిలేని పార్టీలో కుమ్ములాటలకు మాత్రం నాయకులు చాలా సీరియస్ గా ఎగబడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో తెదేపా పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో తెదేపా 15 స్థానాల్లో గెలిచినందున.. ఆ సీట్లు తప్పితే అదనంగా ఒక్కటి కూడా కేటాయించలేం అని కాంగ్రెస్ ఇప్పటికే ఆ పార్టీకి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. తెదేపా ఎంతగా నాశనం అయిపోయి ఉన్నప్పటికీ  కూడా.. 119 సీట్ల తెలంగాణలో కేవలం  15 సీట్లకు మాత్రం పోటీచేయడం అంటే.. చాలా అవమానకరమైన విషయం. కాకపోతే, ఇంతకు మించి తమకు కూడా గతి లేదు గనుక.. వారు కూడా అందుకు ఒప్పుకున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే కేవలం 15 సీట్లే దక్కుతాయని జరుగుతున్న ప్రచారంపై కొందరు సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే.. రాజధాని హైదరాబాద్ లో 2014లో  తెదేపా గెలిచిన సీట్లలో కొందరు తెరాసలోకి ఫిరాయించి ఉన్నారు. అలాంటి స్థానాల్లో ఈసారి లోకల్ లీడర్లకు  అవకాశం కల్పించడం కాకుండా, రాష్ట్రస్థాయి తెదేపా నాయకులు నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తన నియోజకవర్గం దక్కే అవకాశం లేని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రమణ శేరిలింగంపల్లి నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఇలాంటి పోకడల మీద కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, అందరూ దానికి కట్టుబడి ఉండాలని నాయకులు మాయ మాటలతో సమావేశంలో అభ్యంతరాల్ని దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments