జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ఉద్యమం ముగిసింది. వాళ్ల కోరిక మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్సు, చట్టం కూడా చేసేశారు. అంటే ఉద్యమం విజయం సాధించినట్లేగా! అంటే 'అబ్బే కాదుగా, 'పేటా' (పీపుల్ ఫర్ ఎతికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) సంస్థను ఇండియాలో లేకుండా చేయమన్నాం, అది యింకా వుండిపోయిందిగా' అని బాధపడతారు ఉద్యమకారులు.
వాళ్ల ఘోష ఎలా వున్నా యీ ఉద్యమం ద్వారా తమిళ ప్రజలు లోకానికి ఏం చెప్పదలచుకున్నారు? మా ఎద్దులను మేం ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి, అనా? ఉద్యమానికి మద్దతిచ్చిన కొందరు మేధావులు 'జల్లికట్టు ను స్పెయిన్‌లోని బుల్‌ఫైట్‌తో పోలుస్తున్నారేమో, అక్కడ ఎద్దును చంపుతారు. ఇక్కడ ఎద్దును ఆలింగనం చేసుకుంటారు. అసలు యీ క్రీడ పేరు అదే...'' అని వాదిస్తున్నారు.
ఏ వీడియో చూసినా ఆలింగనాలు కనబడటం లేదు, కుమ్ముకోవడాలు, దొమ్మీలు కనబడుతున్నాయి. ఎద్దు కొమ్ములతో విసిరి కొడుతూంటే వీళ్లంతా ఎక్కడో వెళ్లి పడుతున్నారు. జంతువుకు వీళ్ల మీద ప్రేమ, వీళ్లకు జంతువు మీద ప్రేమ మచ్చుకైనా కానరాదు. పగవాడిని లొంగదీసుకునే కచ్చ మాత్రమే గోచరిస్తోంది. 'అసలు పేటాకు దీనితో ప్రమేయం లేదు, దీనిలో గాయపడేది ఆంబోతు కాదు, ఆ యువకులే..' అని మరో వాదన. పోనీ అలాగే అనుకోండి, ఆ యువకులకు మాత్రం రక్షణ అక్కరలేదా? ఎవడైనా హెల్మెట్ కానీ, క్రికెట్‌లోలా గార్డ్స్ కానీ పెట్టుకుంటున్నాడా? లేదే! ఆట అంటే పాల్గొన్నవారందరూ ఆనందించాలి. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. దెబ్బలు తగులుతున్నాయి. జల్లికట్టు అనుమతించాం అనగానే మర్నాడే వార్త - 'ఇద్దరు మృత్యువు కౌగిలిలో చిక్కుకున్నారు (యిదన్నమాట 'ఆలింగనం'!) , 120 మంది గాయపడ్డారు' అని. గాయపడినవారిలో ఎంతమంది పోయారో తెలియదు. గతవారంలో ఎంతమంది పోయారో తెలియదు. విమర్శలు వస్తాయని వార్తలు తొక్కిపెట్టారేమో తెలియదు.
జల్లికట్టు ఉద్యమకారు లెవరైనా పోయినవారి ప్రాణాలు తేగలరా? ఆ ముక్కే అడిగితే కమలహాసన్ 'రోడ్డు, రైలు యాక్సిడెంట్లలో యింకా బోల్డుమంది పోతున్నారు' అంటున్నాడు. మరి యీయన సినిమాల్లో నటించినపుడు కొన్ని సందర్భాల్లో డూప్‌లను వాడతాడేం? తను స్వయంగా ఫైట్స్ చేసినప్పుడు కూడా వైర్లు కట్టుకుని, వలలు వేయించుకుని, పాడ్‌లు పెట్టుకుని జాగ్రత్త పడతాడేం? రోడ్డు యాక్సిడెంటులో పోయేవాళ్లలో నేనూ ఒకణ్ని అనుకుని అవేమీ లేకుండా నటించవచ్చుగా! రోడ్డు మీద వెళుతూంటేనే ప్రమాదాలు జరుగుతాయని హెల్మెట్ పెట్టుకోమంటోంది ప్రభుత్వం. పెట్టుకోకపోతే దండిస్తోంది.
జల్లికట్టు వంటి ప్రమాదకరమైన ఆట ఆడేటప్పుడు రక్షణకై ఏమైనా ధరించవద్దా? ఈ మేధావులు, సినిమావాళ్లు, విద్యార్థులు ఆ క్రీడాకారులను హెచ్చరించవద్దా? అదేమీ లేదు, అది మా సంస్కృతి, మా సంప్రదాయం, మా జోలికి వస్తే ఖబడ్దార్! ఎంతసేపూ యివే నినాదాలు. ఏమిటీ తమిళ సంస్కృతి? లోకల్ రైల్వే స్టేషన్లో ఒకడు వచ్చి ఒక ఆడపిల్లను కసాబిసా నరికేస్తే కళ్లప్పగించి చూస్తూ వుండడమా? వాడు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి రక్షణకు వెళ్లకపోవడమా? ఆంబులెన్సుకై ఫోన్ చేయకపోవడమా? తమిళనాడులో కులాల పేర పార్టీలు వెలుస్తున్నాయి. కులాంతర వివాహాలు జరిగినప్పుడు భీకరమైన పోరాటాలు జరుగుతున్నాయి. జల్లికట్టులో కూడా దళిత వివక్షత వుందట. దళిత యువకుడెవరైనా వచ్చి ఆటలో పాల్గొని తన వీరత్వం చూపుతానంటే ఆట ఆపేస్తారట. దళితుడు పెంచిన ఎద్దును ఆటలో పాల్గొననివ్వరట. మరి యివన్నీ తమిళ సంప్రదాయంలో భాగమా?
ఈ ఉద్యమంలో చాలా వింతలున్నాయి. ఆట ఆడేది మధురై, కోయంబత్తూరులలోని గ్రామీణ ప్రాంతాల్లో, ఉద్యమం చేసినది చెన్నయ్‌లోని నగర యువత. వీరిలో చాలామంది వీడియో గేముల్లో, మొబైల్ యాప్స్‌లో తప్ప అసలైన ఎద్దు జోలికి కూడా వెళ్లి వుండరు. మామూలుగా జల్లికట్టు ఆడేది సంక్రాంతి సమయంలో. కనుమ, ముక్కనుమ రోజుల్లో. వీళ్లు ఉద్యమం చేసినది ఆ పుణ్యకాలం గడిచిపోయాక! జనవరి 16 అంటే ముక్కనుమ నాడు మధురై జిల్లాలోని అలంగనల్లూరులో కోర్టు ఆదేశాన్ని ధిక్కరించి జల్లికట్టు కోసం నిరసన ప్రదర్శన చేశారు. రోజంతా అది జరిగాక పోలీసులు 200 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. అరెస్టయినవారికి మద్దతుగా 17 నుంచి చెన్నయ్ మెరీనా బీచ్‌లో విద్యార్థులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. క్రమేపీ వారి సంఖ్య పెరుగుతూ పోయింది. సేలం, ఈరోడు, కోయంబత్తూరు, నాగర్ కోయిల్, తిరుచ్చి, పుదుచ్చేరి యిలా చాలచోట్లకి విస్తరించింది. విస్తరించడంలో ఆశ్చర్యం లేదు. అందరూ వారికి మద్దతిచ్చేవారే! విద్యాధికులు, ఉద్యోగులు, మేధావులనబడేవారు, ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు అందరూ 'తమిళ సంస్కృతిని కాపాడుతున్నాం' అనే నినాదంతో పోటీలు పడి వారిని సమర్థించారు. సందట్లో సడేమియాలాగ సినిమావాళ్లూ రెచ్చిపోయారు. వాళ్ల కసలే పేటా వాళ్ల మీద కసి - సినిమాల్లో జంతువులను చూపించడానికి వీల్లేకుండా చేశారని. జల్లికట్టు మీద ప్రేమో, పేటా మీద కోపమో తెలియదు కానీ వీరంగం ఆడేశారు. ఇక కమలహాసన్ మరీనూ. 'సంప్రదాయాన్ని దేన్నీ బ్యాన్ చేయకూడదు, రెగ్యులేట్ చేయాలంతే..' అని గొప్ప స్టేటుమెంటు యిచ్చాడు. 'రాజస్థాన్‌లో సతీసహగమనం సంప్రదాయంగా వుండేది, దాన్నీ బ్యాన్ చేయకూడదంటారా?' అని అడిగితే ఏమీ చెప్పలేక నీళ్లు నమిలి, గొంతులో ఏదో గరగరలాడించాడు.
ఆట మొదలైనప్పుడు ఎలా వుండేదో కానీ, పోనుపోను వికృత సంస్కృతి పెరిగింది. ఎద్దును మామూలుగా వదలటం లేదట. సారా తాగించి, కళ్లల్లో కారం కొట్టి, గిచ్చి, కొరికి, రెచ్చగొట్టి మరీ జనంలోకి వదులుతున్నారు, కేకలు వేసి, గోల చేసి కంగారు పెడుతున్నారు, ఇది హింసే కదా అంటుంది పేటా. అబ్బే యివేం చేయం, పశువులను మా కన్నబిడ్డల్లా చూసుకుంటాం అంటారు జల్లికట్టు నిర్వాహకులు. ఎద్దులకు కూడా బ్రెత్ ఎనలైజర్లను పెడితే తప్ప నిజానిజాలు తెలియవు. నియంత్రించే చట్టం ఎలా పెట్టినా అమలు కావడం కష్టం. ఎవరైనా అధికారి పల్లెటూళ్లో జనం మధ్యకు వెళ్లి ఆ టెస్టు చేసి, యీ ఎద్దుకు పూటుగా పట్టించేశారు, ఆట రద్దు చేస్తున్నాను అని అంటే, అతన్ని ఎద్దు కాళ్ల కింద వేసి కుమ్మేస్తారు. అడిగే దిక్కు కూడా వుండదు. అయినా 2014లో జల్లికట్టు నిషేధిస్తూ తీర్పు యిచ్చిన సుప్రీం కోర్టు జడ్జి జంతుహింస అనే దాని కంటె వ్యక్తులకు హాని జరుగుతోందన్న కారణమే చూపించారు. సంస్కృతి సంప్రదాయం అంటూ లాయర్లు ఏదో చెప్పబోతే వాటి కంటె ప్రాణాలు ముఖ్యం అన్నారు.
'ఇక్కడ జంతుప్రేమ కంటె శాడిజం, పెర్వర్షన్ ఎక్కువగా కనబడుతోంది. నిర్వాహకుల, ప్రేక్షకుల ఆనందం కోసం ఆడే వికృత క్రీడలా తోస్తోంది' అన్నారు. 2016 జనవరి 8 న కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేసి కొన్ని నిబంధనలతో జల్లికట్టును అనుమతించింది. దాన్ని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తే వాళ్లు జనవరి 16 న స్టే యిచ్చారు. ఆ స్టే విషయం అక్కడ పెండింగులో వుండగానే యిదంతా జరిగింది. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌లో తీర్పు యిచ్చినపుడు న్యాయమూర్తులు 'ఆహారం కోసం ఎద్దుల్ని చంపగాలేనిది, జల్లిట్టులో హింస గురించి యింత చర్చ ఎందుకు?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ 'జంతువుకు అనవసరంగా బాధ కలిగిస్తున్నారు' అనే అంశాన్ని పరిగణించింది. ఇక్కడే కమలహాసన్ 'జల్లికట్టును నిషేధిస్తే బిర్యానీని నిషేధించాలి' అనే వితండవాదానికి సమాధానం దొరుకుతుంది. జంతువును చంపి బిర్యానీ చేసుకుంటున్నావంటే దానికో ప్రయోజనం వుంది. నీ కడుపు నింపుకుంటున్నావు. కానీ జల్లికట్టులో జంతువును అనవసరంగా హింసిస్తున్నావు. అనవసరంన్నరగా నిన్ను నీవు హింసించుకుంటున్నావు.
తమిళ సంప్రదాయం పేర వూపు వచ్చింది కదాని తమిళ ఈలం గురించి బ్యానర్లు కట్టేశారు. ఎల్‌టిటిఇ ప్రభాకరన్‌కు జై కొడుతూ నినాదాలు చేశారు. పనిలో పనిగా లాడెన్‌కూ జై కొట్టారు. మధ్యలో లాడెన్ ఎక్కణ్నుంచి వచ్చాడంటే, ఇది కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం, కేంద్రంలోని బిజెపి హిందూత్వకు ప్రతీక కాబట్టి దానికి ప్రతిగా జిహాదీల పేరు తీసుకున్నారు అని వ్యాఖ్యానం. నిషేధించినది కోర్టు కానీ కేంద్రం కాదు కదా అంటే 'అలా అయితే కావేరీ జలాల గురించి మా వాటా మాకిమ్మని కోర్టు ఎప్పుడో తీర్పు యిచ్చింది. అది అమలు చేయడానికి కేంద్రం ఏం చేసిందని అడుగుతున్నాం' అంటూ వేదికల మీద అడిగి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. పోనీ ఆ కావేరీ జలాల గురించి యిలాటి ఉద్యమం చేసినా అందంగా వుండేది. రైతుల కోసం చేశాం, కోర్టు తీర్పుకు అనుగుణంగా చేశాం అని చెప్పుకోవచ్చు. ఇదేమిటి, జంతువులను హింసించడానికి, మా వాళ్లను గాయపరచుకోవడానికీ హక్కు యివ్వండి అని పోరాడినట్లయింది.
రాజకీయ కారణాలనండి, మరోటనండి కేంద్రం దిగివచ్చింది. ఆర్డినెన్సు జారీ చేసింది. మళ్లీ అప్పుడూ గొడవే. 'ఇది తాత్కాలికం. పర్మనెంటుగా వుండేట్లు చట్టం చేయండి' అని. సరే చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నా ఆందోళన విరమించలేదు. తమాషా ఏమిటంటే చట్టం చేస్తూండగా కూడా ఆందోళన కొనసాగింది. ఈ కొనసాగింపు హింసాత్మకంగా సాగింది. చేసినవారు విద్యార్థులు కారు, సంఘవిద్రోహశక్తులు అన్నారు. 'శాంతియుత ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు చొరబడ్డా'యన్న మాట చిన్నప్పటినుంచి వింటున్నాను. అలా చొరబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఉద్యమకారులది కాదా? కేంద్రం దిగి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా డిఎంకె రైల్‌రోకో చేసింది - ఘనతంతా ఎడిఎంకెకు పోతుందేమోనన్న భయంతో కాబోలు! జనవరి 22న ప్రభుత్వం జల్లికట్టు నిర్వహిద్దామని చూసింది. కానీ ముఖ్యమంత్రి పన్నీరు శెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు యిచ్చి వెనక్కి పంపేశారు.
ఇదంతా చూస్తే ఆందోళన కారుల ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోంది. ముఖ్యమంత్రి చేసిన నేరమేముంది? కొందరు దీనికి మోదీ వ్యతిరేకత కలరు యివ్వబోయారు. జయలలిత చనిపోవడంతో తమిళ సంస్కృతిని కాపాడే పెద్దదిక్కు లేకుండా పోయిందనే భావనతో తమిళులు అనాథల్లా ఫీలవుతున్నారట. పన్నీరు శెల్వం మోదీకి ఆత్మీయుడు కావడం చేత అతని ద్వారా కేంద్రం తమని పాలిస్తుందనే భయంతోను, బిజెపి విధానాలపై నిరసనతోను యిలా తిరగబడుతున్నారట, ఉద్యమం చివరి దశలో 'మోదీ డౌన్‌డౌన్' నినాదాలు కూడా వినబడింది అందుకేట. ఈ థియరీ వింతగా వుంది. మధ్యలో మోదీ చేసినదేమిటి? కోర్టులో విషయం పెండింగులో వుండగానే ఆర్డినెన్సు జారీ చేయించి తమిళులను సంతృప్తి పరచాలని చూశాడుగా పాపం.
ఇప్పుడు ఉద్యమం చల్లార్చడానికి యిలా ఆర్డినెన్సు చేయడం ఒక దుష్టసంప్రదాయానికి తెర తీసినట్లే. ఎందుకంటే యిలాటి వికృత క్రీడలు యితర రాష్ట్రాలలోనూ వున్నాయి. ఆంధ్రలో కోళ్ల పందాలు, కర్ణాటకలో కంబాళ, మహారాష్ట్రలో బైల్‌గాడీ షరియత్ ..., యిలా. రక్తాలు వచ్చేట్లు కర్రలతో కొట్టుకోవడాలు, బూతులతో తిట్టుకోవడాలు వంటివి అనేక చోట్ల తరతరాలుగా వస్తున్నాయి. ప్రభుత్వం వద్దని అంటూ వుంటుంది. అయినా కొద్దో గొప్పో జరుగుతూంటాయి. ఇప్పుడు వాళ్లందరూ పుంజుకుంటారు. 'ఇది మా రాష్ట్రపు జల్లికట్టు' అంటారు. ఒప్పుకోకపోతే వివక్షత అంటారు.
ఇప్పటికే ఆంధ్రలో చర్చ ప్రారంభమైంది. పన్నీరు శెల్వం మోదీని ఒప్పించి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నాడు. బాబు ప్రత్యేక హోదా తెచ్చుకోలేక పోతున్నాడు అని. జల్లికట్టు విషయంలో లక్షలాది మంది యువతీయువకులు మెరీనా బీచ్‌లో రోజుల తరబడి - రైట్లీ ఆర్ రాంగ్లీ - ఉద్యమం చేశారు. ఏ రాజకీయ పార్టీని దగ్గరకు రానీయలేదు. ఆంధ్రలో ఆ వూపు ఏది? ఆ అంకితభావం ఏది? ఏదైనా రాజకీయ పార్టీ నడిపితే తప్ప అడుగు ముందుకు వేయరు. ఏ పార్టీ ప్రమేయం లేకుండా ప్రత్యేక హోదా గురించి నాలుగు రోజులు సామూహిక దీక్ష చేద్దాం అంటే లక్షల్లో కాదు కదా వేలల్లో కూడా రారు. ఆంధ్రులలో స్తబ్దత వుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో ఆక్కడ రావలసినంత ప్రతిస్పందన రాలేదు.
హైదరాబాదు తెలంగాణకు యివ్వరు, యుటీ చేస్తారు అని కాంగ్రెసు నాయకులు కల్లబొల్లి కబుర్లు చెపితే కాళ్లు చాచుకుని కూర్చున్నారు. ఇప్పుడూ అంతే, హోదా ఎవరైనా అప్పనంగా యిస్తే తీసుకుందాం అని తప్ప పోరాడాలన్న యింగితం లేదు. జల్లికట్టు ఉద్యమానికి తమిళ ప్రభుత్వం మద్దతు వుంది. ఇక్కడ టిడిపి ప్రభుత్వం హోదా ఉద్యమాన్ని అణచివేస్తోంది. అందువలన శాంతియుతంగా మొదలుపెట్టినా హింసాత్మకంగా మారడం తథ్యం. ఆ పేరు చెప్పి ఉద్యమాన్ని నీరు కార్చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ తట్టుకుని పోరాడే శక్తియుక్తులు హోదా ఉద్యమకారులకు వున్నాయా? నాకైతే నమ్మకం లేదు. అందువలన జల్లికట్టు జల్లికట్టే. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాయే! అది గెలిచింది కాబట్టి యిది గెలుస్తుందనుకోవడం పొరపాటు.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2017)