నిర్దోషిగా కన్నుమూసిన తమిళ ‘సుప్రీం’...!

తమిళ ప్రజల ఆరాధ్య దేవత, అశేష ప్రజానీకానికి ‘అమ్మ’, భారత రాజకీయాల్లో ధీర వనిత, ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం’ అన్నట్లుగా జీవించి విజయాలు సాధించిన జయలలిత విజేతగానే కన్ను మూశారు. చాలామంది రాజకీయ నాయకులతో పోల్చి చూసుకున్నప్పుడు జయలలితది అకాల మరణమనే చెప్పొచ్చు. ఆమె మరో పదేళ్లు జీవించివుంటే ప్రధాని పీఠం అలంకరించి ఉండేవారేమో...! ఆ పదవి సాధించాలని ఆమె కోరిక. సార్వత్రిక ఎన్నికలొచ్చినప్పుడల్లా ప్రధాని పదవి రేసులో జయ పేరు కూడా తప్పనిసరిగా వినిపించేది. ఆమె సినిమా జీవితంలోనే కాదు రాజకీయ జీవితంలోనూ తిరుగులేని విజేత అనడంలో  సందేహం లేదు.  రాజకీయ జీవితంలో ఆమెకు కలిగిన అవమానాలు, వాటిని అధిగమించి పోరాటాలు చేసి విజయాలు సాధించిన తీరు, పరిపాలనా దక్షత తదితర విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏమిటది? ఆమె ‘నిర్దోషి’గా కన్నుమూయడం. జన హృదయాల్లో మచ్చ లేని నాయకురాలిగా నిలిచిపోవడం. దేశ రాజకీయాల్లో ధీరోదాత్తురాలిగా గుర్తుండిపోవడం.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జయను దోషిగా నిర్ధారించి శిక్ష విధించగా, కర్నాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. ఈ తీర్పు తరువాతే ఆమె ఉప ఎన్నికలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రయ్యారు. పులుకడిగిన ముత్యంలా ప్రకాశించారు. కాని కర్నాటక ప్రభుత్వం, డీఎంకే, ప్రస్తుత బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అక్కడ విచారణ పూర్తయిదని, తీర్పు త్వరలోనే వస్తుందని అనుకుంటున్న తరుణంలోనే జయలలిత తుది శ్వాస విడిచారు. బహుశా సుప్రీం కోర్టు తీర్పు ఇక రాకపోవచ్చు....! అంటే హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ  సుప్రీం కోర్టు జయను నిర్దోషిగానే భావించిందా? లేదా సీబీఐ కోర్టు తీర్పే సరైందని అనుకుందా?...ఇక ఈ విషయం ప్రజలకు తెలిసే అవకాశం లేదనుకోవచ్చు. అందువల్ల చివరి తీర్పు హైకోర్టుదే అవుతుంది కాబట్టి జయలలిత నిర్దోషిగా ప్రజల హృదయాల్లో, చరిత్రలో నిలిచిపోయారు. అక్రమాస్తుల కేసులో జయలలిత నిర్దోషి అంటూ కర్నాటక హైకోర్టు తీర్పు ఇవ్వగానే సామాజిక మీడియాలో అనేక వ్యంగ్య వ్యాఖ్యానాలు, జోకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. ‘ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి’ అని అనేకమంది వ్యాఖ్యానించారు. గమ్మత్తయిన కథలు పోస్టు చేశారు. కేవలం సామాన్య జనమే కాదు, పెద్ద పదవుల్లో ఉన్నవారు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో నిపుణులు సామాజిక మీడియాలో  కామెంట్లు చేశారు.  న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం వ్యక్తం చేశారు.

కోర్టులు ధనికులకు, రాజకీయ పలుకుబడిగలవారికి, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘నిన్న భాయ్ (సల్మాన్ ఖాన్), నేడు అమ్మ...తరువాత ఎవరు బాపూ‘ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఫుల్ మార్క్స్ టు ఇండియన్ జ్యుడీషియల్ సిస్టం. మేరా భారత్ మహాన్’ అని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. ‘కర్నాటక హైకోర్టు పన్నీరుశెల్వంను విజయవంతంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది’ అని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా కామెంట్ చేశారు. ఓ నెటిజన్  ‘జయ నిర్దోషి, సల్మాన్‌కు బెయిల్, ఈ దేశంలో బలవంతులు, ధనవంతులు గ్రేట్ అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని వ్యాఖ్యానించాడు. జయలలిత విజయవంతమైన నాయకురాలు, బలమైన ముఖ్యమంత్రి కావొచ్చు. కాని అవినీతికి అతీతం కాదనే అభిప్రాయాన్ని కలిగించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖులపై అవినీతి ఆరోపణలు రావడం సహజం. జయ విషయంలోనూ అదే జరిగింది. అంతమాత్రాన ఆమెలోని ఇతర సుగుణాలను, బలాలను తక్కువ చేసినట్లు కాదు. జయ కన్ను మూశాక అక్రమాస్తుల ప్రస్తావన తేవడం సమంజసమా? అని కొందరు అనుకోవచ్చు. కాని ఇది చరిత్ర. అందులోనూ సుప్రీం కోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువడుతుందనుకుంటున్న సమయంలో జరగరానిది జరిగింది. కాబట్టి సింహావలోకనం చేసుకోవడం అవసరం.

జయలలిత కేసులో కర్నాటక హైకోర్టు సరిగానే వ్యవహరించిందా? అనే అనుమానాలు అప్పట్లో కలిగాయి.  కొన్ని కీలకమైన ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ కుమారస్వామి వైఖరిపై కొందరు న్యాయవాదులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీర్పులో హేతుబద్ధతను ప్రశ్నించారు. న్యాయమూర్తి తప్పుడు లెక్కలు వేశారన్నారు. ‘అర్థమేటికల్ ఎర్రర్స్’ జరిగాయని ఈ కేసుకు ఆద్యుడైన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ కేసులో కీలకమైన విషయమేమిటంటే...స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించకముందే న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించే అవకాశం లేకుండాపోయింది.  స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఇదే విషయం చెప్పారు. ‘ఈ కేసులో కోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు వాదించే అవకాశమే కల్పించలేదన్నారు. అభ్యంతరాల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే గడువిచ్చారని చెప్పారు. ఈ చర్య ‘ఆందోళనకర దురభిప్రాయానికి’ (సీరియస్ ప్రిజుడిస్) తావిస్తోంది’ అని సీరియస్‌గా అన్నారు. 

అంటే కోర్టు జయకు అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉందనేది ఆచార్య వాదన.  అంతకుముందు తనకు అనుకూలుడైన భవానీ సింగ్ అనే ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించాలని జయ పట్టుబట్టారు. కాని సుప్రీం కోర్టు పడనివ్వలేదు. మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని ఆదేశించింది. అంటే ఆయన్ని నియమించాక, ఆయన వాదనలు విన్నాక ఏం తీర్పు ఇవ్వాలనేది నిర్ణయించాలి. కాని ప్రత్యేక పబ్లిక్ పాసిక్యూటర్ నియామకానికి ముందే తీర్పు రిజర్వు చేయడం, ఆయనకు వాదించే అవకాశం లేకుండా చేయడం ఈ కేసులో అనుమానాలకు తావిచ్చింది. జయలలిత కేసును పరిశీలిస్తే  ఇది పూర్తిగా గణాంకాల గందరగోళంగా ఉందని అప్పట్లో ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కోర్టు తప్పుడు లెక్కలు వేసిందని హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాదు...హైకోర్టే తప్పుడు లెక్కలు వేసిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు చెప్పారు.

‘హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడానికి తప్పుడు లెక్కలే ఆయుధంగా ఉపయోగపడతాయి’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య వ్యాఖ్యానించారు. ‘అర్థమేటక్ ఎర్రర్స్’ ఉన్నాయని చెప్పిన డాక్టర్ స్వామి ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామన్నారు.  ‘జయ అక్రమాస్తుల కేసు 1 ఏళ్లపాటు సరైన దారిలోనే సాగింది. ఎంతో కష్టపడి ప్రతి ఆరోపణకూ తగిన ఆధారాన్ని కోర్టుకు సమర్పించాం. అందుకే ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది’ అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాగా, హైకోర్టు న్యాయమూర్తి ‘ప్రత్యేక కోర్టు తీర్పులో పస లేదు’ అని ఒక్క ముక్కతో తేల్చిపారేశారు.  న్యాయమూర్తి కేవలం నాలుగు నిమిషాల్లోనే జయను, మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించి వెళ్లిపోయారు. అక్రమాస్తుల కేసులో జయ దోషి అని నిర్థారిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల  జైలు శిక్ష, రూ.100 కోట్ల భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.

నిర్దోషిగా విడుదలైన తరువాత ఉప ఎన్నికలో గెలిచి, మళ్లీ పీఠం అలంకరించి సంబరాలు జరుపుకున్న జయ సుప్రీంలో పిటిషన్ పడ్డ తరువాత తీవ్రంగా ఆగ్రహించారు. కర్నాటకకు సుప్రీంలో పిటిషన్ వేసే హక్కు సుప్రీంకు సమర్పించిన   అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించడం వరేక కర్నాటక పని అని, తమిళనాడు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ డిపార్టుమెంటుకు మాత్రమే పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉందని తెలిపారు. అయితే జయ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించడంతో   జయ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదని అర్థమైంది.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు వస్తుందని జయ ప్రత్యర్థులు భావించినా అలా జరగలేదు. అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘ కాలం జరగడం, దోషిగా తీర్పు వెలువడి కొంతకాలం జైలు శిక్ష అనుభవించడం మొదలైన ఘటనలన్నీ మానసికంగా ఆమెను కుంగదీశాయని, తన పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ బాధపడ్డారని మీడియాలో కథనాలొచ్చాయి. ఆమె ఆరోగ్యం దెబ్బ తినడానికి ఆ కేసు ప్రధాన కారణమంటున్నారు. ఎందుకంటే కేసు హైకోర్టు తీర్పుతో ఆగిపోకుండా సుప్రీం కోర్టుకు వెళ్లడం జయను తీవ్రంగా కలవరపెట్టిందని సమాచారం. 

నాగేందర్ మేడేపల్లి

Show comments