ఇండియా పాకిస్తాన్ మ్యాచ్.. ఏమిటీ ద్వంద్వ‌నీతి?

పాకిస్తాన్ రాజ‌కీయ విధానాల‌ను, ఆ దేశం ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న తీరును నిర‌సిస్తూ ఆ దేశంతో దాదాపు అన్ని క్రీడా సంబంధాల‌నూ తెంచుకుంది భార‌త‌దేశం. అయితే ఇక్క‌డ అధికారికంగా నిషేధం ఏమీ లేదు! ప్ర‌త్యేకించి ఇండియాలో క్రీడ అంటే క్రికెట్ మాత్ర‌మే అనే ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి... పాక్ జ‌ట్టుతో ఇండియా జ‌ట్టు క్రికెట్ మ్యాచ్ లు ఆడ‌క‌పోవ‌డం ప్ర‌ముఖ‌మైన అంశం! అయితే ఇక్క‌డో ద్వంద్వ నీతి ఉంది. 

టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ల మ‌ధ్య‌న ద్వైపాక్షిక సీరిస్ లు మాత్ర‌మే జ‌ర‌గ‌వు! వేరే త‌ర‌హా సీరిస్ ల‌లో మాత్రం భారత్, పాక్ లు ముఖాముఖీ త‌ల‌ప‌డ‌తాయి! అంటే.. వ‌ర‌ల్డ్ క‌ప్, ఛాంపియ‌న్స్ ట్రోఫీ, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వంటి ఐసీసీ నిర్వ‌హించే సీరిస్ ల‌లో ఇండియా- పాక్ ల మ‌ధ్య మ్యాచ్ లు జ‌రుగుతాయి. అయితే ఇండియా వేదిక‌గా కానీ, పాక్ వేదిక‌గా కానీ.. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య‌నా.. సీరిస్ లు జ‌ర‌గ‌వంతే! ఇది 2008 నుంచి కొన‌సాగుతూ ఉంది. 

ఆ సంవ‌త్స‌రం ముంబై లో తాజ్ హోట‌ల్ పై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డంతో.. బీసీసీఐ అప్ప‌టి నుంచి పాక్ క్రికెట్ జ‌ట్టుతో మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ‌ప‌ట్ల అనాస‌క్తిని వ్య‌క్తం చేస్తూ ఉంది. ఇప్ప‌టికీ అదే ప‌ద్ధ‌తి కొన‌సాగుతూ ఉంది.

ఇదేమంత న‌ష్టం క‌లిగించే అంశం కాదు. పాక్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడ‌క‌పోయినంత మాత్రానా.. బీసీసీఐకి ఆర్థికంగా న‌ష్టం ఏమీ లేదు! న‌ష్ట‌మంతా పాక్ బోర్డుకే! ఒక‌వేళ టీమిండియాతో మ్యాచ్ లు జ‌రిగే ప‌రిస్థితే ఉంటే.. రెండేళ్ల‌కు ఒక మారు అయినా ఒక సీరిస్ పెట్టి పీసీబీ కూడా ప్ర‌సార హ‌క్కుల రూపంలో భారీ డ‌బ్బు పొందేది. అందుకే ప‌లు సార్లు పాక్ మాజీ క్రికెట‌ర్లు, పీసీబీ చీఫ్ లు.. ఇండియా, పాక్ ల మ‌ధ్య ద్వైపాక్షిక సీరిస్ లు జ‌ర‌గాలంటూ ఉంటారు. అయితే బీసీసీఐ ఈ వ్య‌వ‌హారాన్ని ప‌ట్టించుకోదు.

మ‌రి ఇప్పుడు ఆసియా క‌ప్ లో ఇండియా, పాక్ ల మ‌ధ్య‌న ఒక మ్యాచ్ షెడ్యూల్ అయ్యింది. ఇదే ఇక్క‌డ ద్వంద్వ నీతిగా ఉంది! ఐసీసీ ఈవెంట్స్ లో అయినా, ఆసియా క‌ప్ లో అయినా.. పాక్ తో మ్యాచ్ ల‌ను ఇండియా ర‌ద్దు చేసుకోవ‌చ్చు! 

ఇందుకు ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే..2003 ప్ర‌పంచ‌క‌ప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జ‌ట్లు.. జింబాబ్వేతో మ్యాచ్ ల‌ను ర‌ద్దు చేసుకున్నాయి! సౌతాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఆ ప్ర‌పంచ‌క‌ప్ లో జింబాబ్వేతో ఆ పాశ్చాత్య జ‌ట్లు మ్యాచ్ ల‌ను ర‌ద్దు చేసుకున్నాయి. 

ఎందుకంటే.. జింబాబ్వేలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని! అక్క‌డ అప్ప‌టి నియంత రాబ‌ర్ట్ ముగాబే తీరును వెస్ట్ర‌న్ వ‌ర‌ల్డ్ నిర‌సించింది. ఆ రాజ‌కీయ వ్య‌వ‌హ‌రానికి జింబాబ్వేతో క్రికెట్ మ్యాచ్ ల‌కు ముడిపెట్టాయి ప్ర‌ధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు. జింబాబ్వేతో మ్యాచ్ ల‌ను ర‌ద్దు చేసుకున్నాయి. అయితే ఐసీసీ అందుకు స‌మ్మ‌తించ‌లేదు. దీంతో ఆ జ‌ట్లు పాయింట్ల‌ను కోల్పోయాయి! జింబాబ్వే ఆడ‌టానికి రెడీగా ఉన్న‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు దానితో మ్యాచ్ కు ముందుకు రాక‌పోవ‌డంతో.. ఆ మ్యాచ్ పాయింట్ల‌ను జింబాబ్వే ఖాతాలోకి క‌లిపేసింది ఐసీసీ. 

ప్రపంచ‌క‌ప్ లో పాయింట్లు చాలా కీల‌కం. అందులోనూ జింబాబ్వేపై విజ‌యం తేలిక‌. అయిన‌ప్ప‌టికీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు అప్ప‌ట్లో త‌మ‌కు న‌చ్చ‌ని రాజ‌కీయ విధానాన్ని పాటిస్తున్న జింబాబ్వేతో మ్యాచ్ ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పాయి. పాయింట్ల‌ను న‌ష్ట‌పోయాయి. మ‌రి పాక్ తీరును పూర్తిగా ఎండ‌గ‌ట్టాలంటే.. ఇండియా గ‌ట్టిగా నిల‌బెట్టాలి. మ‌రి వీర‌భ‌క్త దేశ‌భ‌క్త పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీ ముఖ్య‌నేత అమిత్ షా త‌న‌యుడు జై షా బీసీసీఐకి అంతా తాన‌య్యాడు! మ‌రి ఎందుకు ఈ ద్వంద్వ నీతి?

Show comments