ఎమ్బీయస్‌: తెలంగాణ ఫలితాల ప్రభావం

ఎన్నికలల్లో తెరాస దుమ్ము దులిపింది. కారణాల గురించి పూర్తి ఫలితాలు వచ్చాక విశ్లేషించుకోవచ్చు కానీ యీ లోపున మనం అనుకోవలసినది జాతీయ సర్వేలు దక్షిణాదిన ఫెయిలవుతాయన్న రాజగోపాల్‌ మాట తప్పిపోయింది. అవే నిజమయ్యాయి. రాజగోపాల్‌ ఘోరంగా తప్పిపోయారు. ఇప్పుడు చేసుకోవాల్సిన విశ్లేషణ ఏమిటంటే రాజగోపాల్‌ జోస్యం ఎందుకు చెప్పారు? అని. తన ప్రతిష్ఠను ఎందుకు పణంగా పెట్టారు, ఏం సాధించారు? అని. వెంటనే తట్టే సమాధానం ఏమిటంటే హంగ్‌ ఏర్పడుతుందనే భావన కాబోయే ఎమ్మెల్యేలలో ఉన్నపుడు అంతర్ధానమై పోయి, అవతలి క్యాంపుల్లో ప్రత్యక్షమౌతూంటారు కాబట్టి మహా కూటమి తరఫు గెలుపుగుఱ్ఱాలన్నీ సొంత శాలలోనే ఉండేందుకై 'మనం గెలిచేస్తున్నాం, ఎక్కడికీ పోకండి' అని చెప్పడానికి ఎన్నికలు అయిపోయాక జోస్యం చెప్పివుంటారు.

రాజగోపాల్‌ ఏ సర్వే చేయించలేదని, ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేయడానికి యివన్నీ చెప్పారనే మాట కూడా ప్రబలంగా వినబడుతోంది. ఇది ఆయన నిజాయితీనే ప్రశ్నించే ఆరోపణ. కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనదే. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఆయన ఎన్నికలకు ముందే తెరాస పరిస్థితి బాగా లేదని చెప్పనారంభించాడు. అలా చెప్పి కూటమి సభ్యుల్లో నైతిక స్థయిర్యం పెంచాలనా లేక తెరాసను హెచ్చరించి, అన్ని రకాల వనరులను వెచ్చించేట్లా చేయాలనా, ఏమిటి ఆయన ఉద్దేశం? మొదటిది జరగలేదు, రెండోది జరిగిందంటున్నారు. అలా అయితే యీయన జోస్యం వలన లాభపడింది తెరాసయే. ఏ మేరకు అనేది చెప్పలేం. కానీ సాధారణ పరిశీలకులందరూ సరైన ప్రతిపక్షం లేదు కాబట్టి తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంటూ వచ్చారు. ఎన్ని సీట్లు వస్తాయన్న దాని దగ్గరే పేచీ. 60 నుంచి 75 వరకు అనేక అంకెలు వినబడ్డాయి.

నా కదేమిటో ముందు నుంచీ తెరాసకు 85 వస్తాయని అనిపిస్తూనే ఉంది. 'కెసియార్‌ ప్రభ తగ్గిందా?' పేర టాబ్లాయిడ్‌కు కవర్‌ స్టోరీ రాయమన్నపుడు ఎందుకైనా మంచిదని 'కాస్త టెక్నికల్‌గా ఉంటుందని 80 సీట్లకు ఐదు అటూయిటూగా రావచ్చనిపిస్తోంది' అని రాశాను. రాజగోపాల్‌ సర్వే ఫలితాలు వచ్చాక వెలువడిన 'కూటమికి 65 వస్తాయా?' ఆర్టికల్‌ రాసేటప్పుడు 'గతంలో తెరాసకు 80కు అటూ, యిటూ అనుకున్నాను. ఇటీవల కెసియార్‌ స్వరంలో మార్పు గమనించాక 70కి 5 అటూ, యిటూ అనుకుంటున్నాను' అని రాశాను. నిజానికి 75 కి 5 అటూ, యిటూ అనే మొదట్లో రాశాను. కానీ ఫైనల్‌గా అప్‌లోడ్‌ చేసేటప్పుడు ఎందుకైనా మంచిదని 75ని 70 చేశాను. ఎందుకంటే రాజగోపాల్‌ సర్వే వలన ఆ మేరకు ప్రభావితుణ్నయ్యాను. ఆయన మరీ అంత తప్పుతాడా? స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వుందని గట్టిగా చెపుతున్నాడు కదా అని ఊగిసలాడి, అలా రాశాను. ఇప్పుడు చూడబోతే 88 వచ్చాయి. మజ్లిస్‌పై ఆధారపడవలసిన అవసరం పడనందుకు చాలా సంతోషంగా ఉంది.

మీడియా ప్రభావం మనపై అలా ఉంటుంది. పంచతంత్రంలో కథ ఉంది కదా, నలుగురు వరుసగా కుక్క అంటే మేకను కూడా దాని యజమాని కుక్క అనుకున్నాడని! నిజానికి నాలుగు గోడల మధ్య కూర్చుని రాసే నాకు, చదివే మీకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకపోవచ్చు కానీ ఊరూరా రిపోర్టర్లు వుండే పత్రికల వాళ్లకు, టీవీ ఛానెల్‌ వాళ్లకు ఎవరు గెలుస్తారో తెలియకుండా ఉంటుందా? లేదా పక్షపాతంతో కళ్లు మూసుకుపోతాయా? నా అనుమానం పత్రిక/టీవీ యాజమాన్యం రిపోర్టర్లు పంపిన రిపోర్టులన్నీ చదివి నిజం తెలిసినా, తమకున్న 'విశ్వసనీయత'తో ఓటరును ప్రభావితం చేయడానికి అంకెలను మార్చేస్తుందని. 119 సీట్లలో 2 సీట్లు, అదీ సొంతంగా కాదు, పొత్తు పెట్టుకుని గెలిచిన టిడిపి పార్టీతో చేతులు కలిపి వుంటే తెరాసది 'వన్‌ సైడ్‌ వార్‌' అయి వుండేదని, పెట్టుకోలేదు కాబట్టి 'కారు కూలబడింది' 'కారు కింద నేల కదిలింది' అని ఎలా రాయ/చెప్పగలరు? ఇంత స్వీప్‌ వచ్చిన సందర్భంలో కూడా వాళ్లకు వేవ్‌ కనబడలేదంటే ప్రజల నాడిని పట్టుకోవడం వాళ్లకు తెలియలేదని దాని అర్థం! ఇక తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, అంతర్వాణి, ఆత్మసాక్షి వంటి స్లోగన్లు పెట్టుకోవడం మానేయాలి.

టిడిపితో చేతులు కలిపాక కాంగ్రెసు దూసుకుపోతోందని మీడియా అదరగొట్టేస్తే నాలాటి పడక్కుర్చీ మేధావులు కాబోలు అనుకున్నారు కానీ ఓటర్లు అనుకోలేదు. ఏడిశావులే అనుకుని వాళ్లు వేద్దామనుకున్నవాళ్లకు ఓట్లేశారు. నాలాటి అంటున్నాను కానీ నేను అనటం లేదు. ఎందుకంటే టిడిపితో పొత్తు తెలంగాణలో కాంగ్రెసుకు అనర్థదాయకం అని నేను ముందు నుంచీ నమ్మాను. మొదటి ఆర్టికల్‌లోనే 'కాంగ్రెసు టిడిపితో వెళ్లకుండా వుంటే తెరాసకు 70కు లోపులే వస్తాయనుకునేవాణ్ని' అని రాశాను. టిడిపి అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత అది చేస్తున్న తప్పుల గురించి కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించాను. కాంగ్రెసు ఓట్లు దానికి పడ్డాయో, టిడిపి ఓట్లు కాంగ్రెసుకు పడ్డాయో కానీ కూటమి పరువును ఖమ్మం జిల్లా ఒక్కటే కాసింది. కాంగ్రెసు హేమాహేమీలు, బాహుబలులు, భల్లాలదేవుళ్లూ అందరూ మట్టి కరిచారు. ఒక్క సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్‌ మాత్రమే గెలిచారు. గతంలో కంటె కాంగ్రెసుకు రెండు సీట్లు తగ్గాయి. ఇది కెసియార్‌ అహంకారాన్ని మరింత పెంచుతుందనే భయం కలుగుతోంది. ప్రతిపక్షం కూడా బలంగా, చురుగ్గా ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది.

తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే దాన్ని గెలిపించాయని అందరూ చెప్పేమాటే. అమలు కూడా బాగుందని అర్థమౌతోంది. కానీ అనేక చోట్ల లోపాలున్నాయి. వాటిని ఎండగట్టవలసిన కాంగ్రెసు, టిడిపి నాలుగేళ్లూ నిద్రపోయి యిప్పుడే లేచాయన్నదే నా ఫిర్యాదు. కాంగ్రెసు చురుగ్గా వుండి ఉంటే, మీడియాను కల్టివేట్‌ చేసుకుని ఉంటే 50 సీట్లు గెలిచి వుండేదేమో. టిడిపి వగైరాలతో పొత్తు పెట్టుకోకపోతే 40 గెలిచేదేమో అనిపిస్తుంది నాకు. ఎక్కువ సీట్ల కోసం చివరిదాకా బేరాలాడిన కోదండరాం పార్టీకి, సిపిఐకి ఒక్క సీటు రాలేదు చూడండి. నాయకులే ఓడిపోయారు. కోదండరాం పొన్నాలకు దణ్ణం పెట్టుకోవాలి, సీటు కోసం పేచీ పెట్టి, తన పరువు కాపాడినందుకు!

కెసియార్‌పై అనేక వర్గాలకు కోపం వున్నా ఎప్పుడైతే బాబు రంగంలోకి దిగారో, అప్పుడు వాళ్లు ధర్మరాజు సిద్ధాంతం (విడివిడిగా ఐదు, నూరు, ఎవరైనా బయటివారు వస్తే 105 మందిమి) అవలంబించారు. తెలంగాణను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి బాబు డబ్బు సంచులతో దిగారు అనే తెరాస ప్రచారాన్ని ప్రజలు నమ్మడానికి ఆస్కారం దొరికింది. లేకపోతే కోదండరాం పార్టీ అభ్యర్థుల దగ్గర కూడా డబ్బు దొరకడమేమిటి!? సిటీలో అంతా తమ ఓటర్లే అంటూ టిడిపి కాంగ్రెసు నుంచి సీట్లు తీసుకుని అంతటా ఓడిపోయి కూర్చుంది. తెలంగాణ అంతా కాంగ్రెసు, టిడిపిల మధ్య ఓట్ల బదిలీ చక్కగా జరిగింది అని వాళ్ల అనుకూల మీడియా రాసేసింది. బదిలీ చేయడానికి బాలన్సు వుందో లేదో తెలియదు. విడివిడిగా పోటీ చేసి వుంటే తెలిసేది.

బయట వున్న మనమే ఇలా అనుకుంటూ ఉంటే యిక కాంగ్రెసు వాళ్లకు ఎంత కడుపుమంటగా ఉంటుందో ఊహించండి. రేపణ్నుంచి వాళ్లు మొదలెడతారు - టిడిపియే మా కొంప ముంచింది అని. డిసిప్లిన్‌ అనేది కాంగ్రెసు వాళ్లకు నచ్చని పదం. అధిష్టానం చెపితే ఓ నాలుగు రోజులు ఆగినా, తర్వాత సన్నాయి నొక్కులు మొదలెడతారు. ముఖ్యంగా ఆంధ్ర కాంగ్రెసు నాయకులు 'ప్రభుత్వ వ్యతిరేకత మనకు కలిసి వచ్చే సమయంలో టిడిపితో పొత్తు అవసరమా?' అనవచ్చు. అసలే యిప్పుడు కాంగ్రెస్‌ అప్‌బీట్‌ మూడ్‌లో ఉంది. ఇది రాస్తున్న సమయానికి, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెసు విజయం సాధించింది, మధ్యప్రదేశ్‌ యిద్దరి మధ్య దోబూచులాట నడుస్తోంది. గెలిచిన ఇతరుల్లో బిజెపి రెబెల్స్‌ చాలామంది ఉన్నారు కాబట్టి, అమిత్‌ షాకు చాకచక్యం ఎక్కువ కాబట్టి, అంతిమంగా అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెసు అధ్యక్షుడైన సరిగ్గా ఏడాదికి రాహుల్‌కి యీ విజయాలు  చాలా ఆత్మస్థయిర్యాన్ని యిస్తాయి. నిజానికి కాంగ్రెసు అక్కడ చేసిందేమీ లేదు, ప్రతిపక్షంలో ఉండి నిరసనలు తెలపడం తప్ప! అయినా విజయం విజయమే!

బిజెపి కంటున్న 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' కల కల్లయిందని, కాంగ్రెసు బలీయమైన శక్తి అని కాంగ్రెసు వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. టిడిపితో కలవకపోయి వుంటే తెలంగాణలో కూడా గౌరవప్రదమైన విజయం లభించేదని వాళ్లు గొప్పలు చెప్పుకోవడం ఖాయం. ఈ మూడ్‌లో ఉన్న కాంగ్రెసును ఒప్పించి, బిజెపి వ్యతిరేక కూటమికి చోదకశక్తిగా టిడిపి ఎలా ఎదగగలదు? నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఎన్టీయార్‌ ఎంతో చేశారు. చివరకు పార్లమెంటు ఎన్నికలలో దానికి విజయం సిద్ధించేసమయానికి, టిడిపికి సీట్లు పోయాయి. దాంతో వాళ్లు ఆయన్ని పక్కకు పడేశారు. ఇప్పుడు తెలంగాణలో టిడిపి పెర్‌ఫామెన్స్‌ చూశాక కాంగ్రెసు దానికి గౌరవప్రదమైన స్థానం యిస్తుందా? గతంలో 15 గెలుచుకున్న టిడిపి యీసారి దానిలో సగం తెచ్చుకున్నా ఆబోరు దక్కేది. బొత్తిగా రెండు, అదీ సిటీలో పూజ్యం! బాబు చేసిన రోడ్‌షోలు, ప్రచారం అంతా వ్యర్థమైంది. తెలంగాణ ఎన్నికలపై టిడిపి పెట్టిన పెట్టుబడంతా వ్యర్థమైంది. ఈ ఫలితం ఆంధ్రలో టిడిపి-కాంగ్రెసు పొత్తుపై ప్రభావం చూపిస్తుందని తప్పకుండా అనవచ్చు.

ఇక కెసియార్‌ ఆంధ్ర ఎన్నికలలో చేయి చేసుకుంటానని బాజాప్తా ప్రకటించారు. బాబుపై పీకలదాకా కోపం కాబట్టి జగన్‌, పవన్‌లకు సహాయసహకారాలు అందించవచ్చు. అది బాహాటంగా చేస్తే ఆంధ్ర ప్రజలు వారికి వ్యతిరేకం కావచ్చు. అందువలన టిడిపి బలంగా ఉన్న చోట ఓట్లు చీల్చడానికి తెరాస అభ్యర్థులను దింపి వైసిపి, జనసేనలకు పరోక్షంగా సాయపడవచ్చు. జాతీయస్థాయిలో ఎదగాలనుకున్న బాబుకి తెలంగాణ తీర్పు గుణపాఠాన్ని నేర్పి, ముందు యిల్లు చక్కబెట్టుకునే పనిలో పడవచ్చు. తెరాస విజయానికి సంక్షేమ పథకాలే కారణమంటున్నారు. ఆంధ్రలో కూడా చాలా పథకాలు నడుస్తున్నాయి. కానీ వాటిలో జన్మభూమి కమిటీల ప్రమేయం ఎక్కువగా ఉంటోందని ఆరోపణలున్నాయి. బహుశా బాబు ఎన్నికల వరకు ఆ కమిటీలకు కళ్లెం వేయవచ్చు.

ఇవాళ ఫలితాలు వచ్చిన రాష్ట్రాలలో బిజెపి పోగొట్టుకున్న స్థానాలను పార్లమెంటు ఎన్నికలకు అన్వయిస్తే 32 సీట్లు పోతాయని అంచనా వేశాను, ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి. ఇప్పుడు ఫలితాలు ఆల్మోస్ట్‌ వచ్చాక ఎన్‌డిటివి లెక్కవేసి ఆ అంకెను 44గా తేల్చింది. అందువలన ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బిజెపి కొత్త రాష్ట్రాలపై గట్టిగా దృష్టి పెడుతుంది. వాటిలో ఆంధ్ర ఒకటి. బాబుకి బిజెపి నుంచి పోటీ తప్పదు, యిప్పుడు కాంగ్రెసు కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తుందో లేదో తెలియదు. అందువలన ఒంటరి పోరాటానికి ఆయన సిద్ధపడాలి. తెలంగాణలోని ఆంధ్రమూలాల వారు తనను లక్ష్యపెట్టలేదని అర్థమై ఉంటుంది. ఏ మేరకు అనేది గణాంకాలు వచ్చాక తెలుస్తుంది. ఇక ఆంధ్రలో ఉన్నవారు ఎలా స్పందిస్తారో అనే బెదురు ఉండడం సహజం. ఇకనైనా బడాయి కబుర్లు కట్టిపెట్టి, పాలనలో లోపాలను సవరించుకోవాలి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
mbsprasad@gmail.com

Show comments