అక్కడ గులాబీ ఓడితే, బొంతు పుణ్యమేనా?

ఒక పార్టీకి చెందిన అభ్యర్థులు ఓడిపోయారంటే.. కేవలం వారి మీద ఉండే ప్రజావ్యతిరేకత మాత్రమే కాకుండా.. ఇంకా అనేక కారణాలు తెరవెనుక నుంచి ప్రభావం చూపిస్తుంటాయి. అందులో అదేస్థానంలో టికెట్ ఆశించి భంగపడి ఉండే.. ఇతర నాయకులు నెగటివ్ గా, ఓడించడానికి పనిచేయడం కూడా ఒక కీలకమైన కారణం. ఈ ఎన్నికల్లో ప్రధానంగా తలపడిన ఉభయ పక్షాలకూ అలాంటి ప్రమాదం ఉంది. అలాంటి వాటిలో ఉప్పల్ నియోజకవర్గం కూడా ఒకటి అవుతుందేమో అనిపిస్తోంది.

స్థానికంగా అందుతున్న విశ్లేషణలను బట్టి అక్కడ తెరాస అభ్యర్థి ఓడిపోతే గనుక.. స్థానికంగానే బలమైన మరో నాయకుడే కారణం కావొచ్చునని పలువురు అనుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉప్పల్ నియోజక వర్గం ఫలితం ఉత్కంఠ ను రేపుతోంది. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఉప్పల్ నియోజకవర్గం, ఇప్పుడు పారిశ్రామికంగాను, ఐటీ పరంగాను అభివృద్దిలో దూసుకుపోతుండటంతో ఈ నియోజక వర్గంలో గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారింది.

2014 లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉప్పల్ నుండి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి, ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ గెలుపొందడం జరిగింది. అప్పుడు టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన బేతి సుభాష్ రెడ్డి మూడవ స్ధానంలో నిలిచారు. తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ, ఉప్పల్ లోని అన్ని డివిజన్లను గెల్చుకోవడంతో, ఇదే నియోజక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ ను నగర మేయర్ గా నియమించడం జరిగింది.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో తిరిగి టిఆర్ఎస్ నుండి బేతి సుభాష్ రెడ్డి టికెట్ దక్కించుకున్నాడు. మేయర్ రామ్మోహన్ కూడా ఉప్పల్ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడినా ఫలం దక్కలేదు. కేసిఆర్, కేటిఆర్ లతో ఉన్న సంబంధాల దృష్ట్యా రామ్మోహన్ కే టికెట్ ఖాయమైందని ఆయన వర్గం భావించినప్పటికీ, బేతి సుభాష్ రెడ్డి అనూహ్యంగా తిరిగి టికెట్ దక్కించుకున్నారు. సుభాష్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఉప్పల్ టిఆర్ఎస్ లో అసమ్మతి బాగా పెరిగిపోయింది.

ఉప్పల్ లోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు ఆయన అభ్యర్ధిత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, వారికి మేయర్ బొంతు అండదండలున్నాయని బహిరంగంగానే ప్రచారం జరిగింది. టిఆర్ఎస్ అధిష్టానం పరిస్ధితిని చక్కదిద్దేందుకు సీనియర్ నేతలను పంపినప్పటికీ, పరిష్కారం దొరకకపోవడంతో, కేసిఆర్ ఆదేశాలతో నేరుగా కేటిఆర్ రంగంలోనికి దిగి రెండురోజులు సమయం కేటాయించి, బొంతుతో చర్చలు జరిపడంతో, అసమ్మతి తాత్కాలికంగా సద్దుమణిగింది.

అయినప్పటికీ మేయర్ రామ్మోహన్ వర్గం, పార్టీ అధికారిక అభ్యర్ధికి పూర్తిగా సహకరించలేదనే ప్రచారం స్థానికంగా ఉంది. సుభాష్ రెడ్డి ఓడిపోతే మాత్రం, బొంతు మీదనే అపవాదుపడే అవకాశం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 2009లో గెలిచి, 2014 ఎన్నికలలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధి బండారి రాజిరెడ్డి ఈ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ, ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించలేకపోతే, అధిష్టానం తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.

ఉప్పల్ సిటింగ్ సీటు కాకపోయినప్పటికీ, మొదటనే అభ్యర్ధిని ప్రకటించిన టిఆర్ఎస్ పార్టీ, తరువాత చెలరేగిన అసమ్మతితో గుర్రుగా ఉండటంతో, సుభాష్ రెడ్డి ఓడితే మాత్రం, అది బొంతు మెడకు చుట్టుకోవడం ఖాయమని పరిశీలకుల భావన.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments