దానం ఫిరాయిస్తే 100 శాతం కరెక్టే!

మిగిలి ఉన్న 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం తెరాస అధిష్టానం తలమునకలై ఉంది. ఈ 14లోనూ అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తున్నది దానం నాగేందర్ వ్యవహారమే. రెండున్నర నెలల కిందట కాంగ్రెస్ నుంచి తెరాసలోకి ఫిరాయించిన మాజీమంత్రి దానం నాగేందర్ కు తొలిజాబితాలో టికెట్ ఇవ్వకపోవడమే అప్పట్లో చర్చనీయాంశం అయింది. భాజపా సీట్లను ఆపిన నేపథ్యంలో ఆయన అడుగుతున్నట్లు ఖైరతాబాద్ ఇవ్వడానికి ఆపారేమో అనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం దానం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

దానం గట్టిగా పట్టుపడుతున్న ఖైరతాబాద్ ను మాత్రం ఇవ్వడానికి తెరాస అధిష్టానం ససేమిరా అంటున్నట్లు సమాచారం. మహా అయితే చాలా క్లిష్టమైన పోటీ కాగల భాజపా కిషన్ రెడ్డి నియోజకవర్గం అంబర్ పేట్ ను ఇవ్వవచ్చు. దానికి కూడా చాలా పోటీ ఉంది. ఇక పోటీ లేని సీటు గోషామహల్ ఉంది. కేసీఆర్ మాత్రం దానంను గోషామహల్ నుంచే పోటీచేయించాలని పట్టుదలగా ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే తనకు టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీలోనే ఉంటాను గానీ.. గోషామహల్ నుంచి పోటీచేయను అని దానం మొండికేస్తున్నారట.

దానం అలా మొండికేయడంలో అర్థముంది. గోషామహల్ లో 2014లో భాజపా రాజాసింగ్ గెలిచినప్పటికీ.. అది కాంగ్రెస్ తరఫున మరో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ సీటు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే అవుతారనడంలో సందేహంలేదు. దానం, ముఖేష్ ఇద్దరూ చాలా దగ్గరి స్నేహితులు. వీరిని హైదరాబాద్ బ్రదర్స్ గా రాజకీయాల్లో వ్యవహరించేవారు. అలాంటి స్నేహితుడి మీద పోటీకి దానం ఒప్పుకోకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ, తెరాస చాలా పట్టుదలగా అదే ఇస్తామని అంటున్నారని తెలుస్తోంది.

అయితే దానం కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. దానం పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను కలిసినట్లూ వార్తలొచ్చాయి. అలా కలిస్తే తప్పేంటంటూ.. ఉత్తమ్ ఎదురు ప్రశ్నించారు కూడా! తెరాసలో ఇలా తన పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న సమయంలో దానం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయినా కూడా తప్పేమీ కాదని ఆయన అభిమానులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు