అలా జరిగుంటే.. బొత్స యిరగదీశావాడేమో?

ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టడం మీద ఇప్పుడు నానా రాద్ధాంతమూ జరుగుతోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ దాని గురించి రెచ్చిపోయి జగన్ ను తిడుతున్నారు.

అలాగే ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న వాళ్లంతా ప్రగతి నిరోధకులు పేదలు ఎదగడం ఇష్టం లేని వాళ్లు అన్నట్లుగా మరో ప్రచారం అంతే ముమ్మరంగా జరుగుతూ ఉంది.

ఇలాంటి మాటల దాడులు ముమ్మరం అవుతుండగా.. మంత్రి బొత్స సత్యనారాయణ తననే ఒక ఉదాహరణగా పేర్కొంటూ ఆసక్తికరమైన సంగతి చెప్పారు.

ఇంగ్లిషు మీడియం గురించి ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది గనుక.. అభిప్రాయ భేదం ఉంటే చెప్పాలే తప్ప.. మట్టికొట్టుకుపోతారు.. తోలుతీస్తాం వంటి మాటలు వాడడం సరికాదని అంటున్నారు.

‘‘తాను మూడుసార్లు మంత్రిగా పనిచేశానని, ఇంగ్లిషుపై పట్టులేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటో తనకు తెలుసునని’’ బొత్స అన్నారు.

బొత్స చిన్నతనంలో ఇంగ్లిషు మీడియం ఉండి ఉంటే గనుక.. మంత్రిగా తాను మరిన్ని అద్భుతాలు సృష్టించి ఉండేవాడిని అన్నట్లుగా ఈ మాటలు ఉన్నాయి.

నిజానికి భాష మీద పట్టు రావడానికి, బాల్యంలో ఇంగ్లిషు మీడియం చదవడానికి ఏమాత్రం సంబంధం లేదు.

పాపులర్ వ్యక్తుల్లోంచి ఉదాహరణ తీసుకోదలచుకుంటే గనుక.. అక్కినేని నాగేశ్వరరావూ అప్పట్లో మారుమూల పల్లెటూళ్లో తెలుగులో చదువుకున్నారు. హైస్కూలు కూడా పూర్తి చేయలేదు. కానీ.. ఆయన అద్భుతమైన ఇంగ్లిషు మాట్లాడతారు. ఇంగ్లిషును పట్టుదలగా నేర్చుకున్నారు. ఆయన భాష చాలా పొయెటిగ్గా కూడా.. నేటివ్ ఇంగ్లిష్ వ్యక్తి మాట్లాడినంత అందంగానూ ఉంటుంది.

అలాంటి ఉదాహరణలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. ఇప్పట్లో 55-60 ఏళ్ల వయసులో ఉండే అనేక మంది ప్రముఖులు, ఇంగ్లిషులో యిరగదీసే ఐఏఎస్ లు చాలా మంది చిన్నతనంలో తెలుగుమీడియంలో చదివిన వారే. భాష రావడానికి స్కూల్లో ‘మీడియం’ రుద్దడానికి సంబంధం లేదు.

బొత్సకు చదువుకునేప్పుడు ఇంగ్లిషు సరిగా అబ్బకపోయి ఉండొచ్చు. కానీ మంత్రి స్థాయికి వచ్చాక.. పట్టుదలగా నేర్చుకునే ప్రయత్నం చేసి ఉంటే అదేమీ బ్రహ్మవిద్య కాదు.

ఆయన ప్రభుత్వంలో మంత్రి  గనుక ప్రభుత్వ విధానాన్ని సమర్థించదలచుకుంటే ఓకే. అయితే.. తానేదో తెలుగుజాతికి రోల్ మోడల్ లాగా ఫీలైపోయి.. తనకు ఇంగ్లిషు సరిగా రాదు గనుక.. ఇంగ్లిషుమీడియం పెట్టేసి జాతిని ఉద్ధరించేస్తాం అన్నట్లుగా మాట్లాడడమే చిత్రంగా ఉంది.

Show comments