ఇది ఏ విధంగా నైతికం బాబూ?

టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవాలనుకున్న తన ఆశలను కేంద్రంలోని భాజపా అడియాసలు చేసిందని, కేసీఆర్ కు తనకు మధ్య తగవులు పెట్టిందని చెప్పుకు వచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తగవుల సంగతి అలా వుంచితే తెరాసతో కలిసిపోయి పోటీ చేయాలని బాబు బలంగా అనుకున్నారని ఇప్పుడు ఆయన మాటలతోనే స్ఫష్టమైంది.

ఏ విధంగా అసలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందామనుకున్నారు చంద్రబాబు?

గతంలో ఓసారి టీఆర్ఎస్ పొత్తు పెట్టకున్నారు. తరువాత విడిపోయి, వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు నానా తిట్లు తిట్టుకున్నారు.

విభజన ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు చంద్రబాబును అనని మాటలు లేవు.

విడిపోయిన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ ఫై పోటీచేసి చిత్తుగా ఓడిపోయింది తెలుగుదేశమే. గెలిచిన అరకొర మందిని లాగేసుకుంది టీఆర్ఎస్. దానిమీద నానా యాగీ చేసింది తెలుగుదేశమే.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఎరచూపి, నానా బీభత్సం జరిగింది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి, ఆంధ్రలో బోలెడు కేసులు, కోర్టు వ్యవహారాలు నడిచాయి.

కేసీఆర్ చంద్రబాబును ఏం చేయాలో అది చేస్తా అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడారు.

కేసీఆర్ కారణంగానే పదేళ్ల పాటు అనుభవ హక్కు వున్న హైదరాబాద్ ను చటుక్కున వదిలేసి, అమరావతికి పరుగున వెళ్లిపోయారు చంద్రబాబు.

ఇన్ని అనుభవాలు, వ్యతిరేకతల నేపథ్యంలో, టీఆర్ఎస్ తో పెట్టుకుని తెలంగాణలో అధికారం పంచుకోవాలని ఎలా అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు?

ఓటుకు నోటు కేసు మళ్లీ ఎప్పుడూ తలెత్తకుండా వుండడానికా?

తెలంగాణలో వున్న తనవి, తన అనునాయుల వ్యాపారాల రక్షణకా?

టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే తెలుగుదేశం తమ్ముళ్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికా?

సరే, ఇవన్నీ అలావుంచితే ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్నారు. అంటే టీఆర్ఎస్ తో కుదరలేదు కాబట్టి కాంగ్రెస్ కావాల్సి వచ్చిందా? అంటే అది అవకాశ వాదం కాదా?

ఇవన్నీ ఏ విధంగా నైతిక రాజకీయాలు అనిపించుకుంటాయో? చంద్రబాబే చెప్పాలి. ఆ తరువాత మోడీని, భాజపాను తిట్టిపోయచ్చు.

Show comments