ఎమ్బీయస్‌: కొత్త ఏడాదిలో ఎదురు చూసేందుకు ఏముంది?

కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాలలోను కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రెండున్నరేళ్లు గడిచాయి. అంటే పదవీకాలంలో సగకాలం. చివరి ఆర్నెల్లలో ఎన్నికల హడావుడి వుంటుంది. పరిస్థితి బాగుందని పాలకులకు తోస్తే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లవచ్చు. అందువలన వాళ్ల తడాఖా చూపించేందుకు 2017, 2018 సంవత్సరాలే వున్నాయి. ఇప్పటిదాకా జరిగినది ఒకసారి చూసుకుంటే 2017పై ఏ మేరకు ఆశలు పెట్టుకోవచ్చో ఒక అంచనా వస్తుంది. వీళ్లేదో సాధిస్తారని ఆశ పెట్టుకున్నవాళ్లకి గత రెండున్నరేళ్లలో జరిగినది కచ్చితంగా ఆశాభంగం కలిగించింది. ఈ ముగ్గురూ భారీగా వాగ్దానాలు చేశారు, ప్రజల్లో ఆశలు పెంచారు. ఆ మేరకు పనితీరు కనబరచలేక పోయారు. ఎందుకిలా అని అడిగితే 70 లేదా 60 ఏళ్లగా పేరుకున్న కుళ్లు కడుగుతున్నాం అంటున్నారు. ఎన్నికలకు ముందు మాత్రం తాము అధికారం చేపట్టిన నెలల్లోనే అద్భుతాలు చూపిస్తామన్నారు. ఇప్పుడిలా మాట్లాడుతున్నారు. ముగ్గురిలోనూ కనబడే సామాన్య (కామన్‌) లక్షణం ప్రచారార్భాటం. చేసినది గోరంతైతే, కొండంత చెప్పుకుంటారు. మీడియాను బాగా వాడుకుంటారు. కేంద్రస్థాయిలో ప్రతిపక్షాలను బతకనిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రతిపక్షాలకు, వ్యతిరేక మీడియాకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు. మోదీ, కెసియార్‌, బాబు - ముగ్గురికీ వీరాభిమానులున్నారు. వాళ్ల మీద యీగ వాలనివ్వరు. వాళ్లు చేసిన ప్రతి పనిలో ఏదో మహోద్దేశ్యం కనబడుతుంది వాళ్లకు. జనరల్‌ పబ్లిక్‌కు మాత్రం అంత వెర్రి లేదు.

తెలంగాణ సంగతి చూస్తే - కెసియార్‌ ఎవరి మాటా లెక్క చేయటం లేదు. తన నమ్మకాలు, తన విలాసాలు తనవే. ఎదురాడినవారిని సహించే పరిస్థితి లేదు. ప్రజాభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి పూచికపుల్ల విలువ లేదు. తన మాట కాదంటే తెలంగాణ ద్రోహి ముద్ర కొట్టేస్తారు. సర్వాధికారాలు ఆయనవీ, ఆయన కుటుంబసభ్యులవీ. ఎప్పటి కెయ్యది సమయానుకూలంగా మాట్లాడి, ప్రజల్ని సమ్మోహితులను చేస్తూనే వున్నాడు. తెలంగాణ సాధనకై ఉద్యమించిన వర్గాలెన్నో తాము కలలు కన్న తెలంగాణ యిది కాదని మొత్తుకుంటున్నాయి. అయినా కెసియార్‌ చెవి కెక్కటం లేదు. ఎన్నో తిక్కపనులు, దేనికీ శాస్త్రీయత లేదు. అన్నీ ఫ్యూడల్‌ విధానాలు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ తొక్కేస్తారోనన్న భయం. అంతర్జాతీయ నగరం అంటూ కాన్వాస్‌ చేసిన హైదరాబాదు వర్షాలకు ఎలా నాశనమైందో కళ్లారా కనబడుతోంది. దాన్ని సరిచేయడం చాతకాదు. అక్రమ నిర్మాణాలు ఆగలేదు, మెట్రో ముందుకు సాగటం లేదు, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన కాలేదు, మిషన్‌ కాకతీయ వలన కొంత మేలు జరిగింది కానీ చిత్తశుద్ధితో బాగా చేసి వుంటే శాశ్వతంగా లాభం జరిగేది. అనేక పథకాలకు డబ్బు లేదంటారు కానీ తన నివాసానికి కోట్లు ఖర్చు పెట్టారు. దోపిడీదారులతో చెలిమి సాగిస్తూనే, కొత్తగా శాటిలైట్‌ నగరాలు, కొత్త జిల్లాలు, కొత్త యాదాద్రి అంటూ ఏదో సందడి చేస్తూ ప్రజల దృష్టిని మరలిస్తూనే వున్నారు.

ఎన్నో దశాబ్దాలుగా యితరులు డెవలప్‌ చేసి యిచ్చిన హైదరాబాదు, యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వున్నాయి కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. దాన్ని తమ ఘనతగా చెప్పుకునే లాఘవం ఆయనకూ, ఆయన కుటుంబసభ్యులకూ వుంది. నిజానికి కెసియార్‌ తనకు అనుకూలంగా చెప్పుకోదగ్గ అంశమంటూ ఏదైనా వుందంటే అది తెలంగాణలో ఘర్షణవాతావరణం రాకుండా చూడడం. పదవి అందుకున్నాక కొన్నాళ్లు ఆ మార్గం ప్రయత్నించారు కానీ తర్వాత ఏ బేరాలు కుదిరాయో ఏమో చల్లబడ్డారు. అందువలన పరిశ్రమలు తరలి వెళ్లలేదు. కుంటుకుంటూ బండి నడిచిపోతోంది. కొత్త సంవత్సరం యింతకంటె బాగా వుండే అవకాశమైతే తోచటం లేదు. నోట్లరద్దు వలన దెబ్బతిన్న వ్యాపారాలు కోలుకోవడానికి యింకో ఆర్నెల్లు కనీసం పడుతుంది, అదైనా ప్రభుత్వం తీసుకునే దిద్దుబాటు చర్యలపై ఆధారపడి వుంటుంది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో టిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి నిధులు కురుస్తాయనుకున్నారు. పరిపాలనాదక్షుడైన బాబు సారథ్యంలో ఆ నిధులు శాశ్వతనిర్మాణాలుగా రూపొంది, విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షిస్తాయనుకున్నారు. కానీ అనుకున్నదేమీ జరగలేదు. ప్రత్యేక హోదా లేదు, తక్కిన రాష్ట్రాల కిచ్చినట్లు గానే విద్యాసంస్థలు, నిధులూ యిచ్చి అదే ప్రత్యేక ప్యాకేజీ అనుకోమన్నారు. ప్రత్యేక రైల్వే జోను లేదు, మెట్రో లేదు, కొత్త రాష్ట్రం కదాని ఆదుకున్నదీ లేదు. పోలవరం బాధ్యత మాదే అని కేంద్రం ఎప్పుడో చెప్పినా నిధులు విదిల్చినప్పుడల్లా హంగామా చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లవుతాయంటే, వేల కోట్లతో సరిపెట్టుకోమంటున్నారు. కేంద్రం ఆంధ్రపై సవతితల్లి ప్రేమ కాదు, పగబట్టింది. బాబు నిస్సహాయంగా చూస్తూ, గట్టిగా నోరెత్తలేకుండా వున్నారు. ఏమీ చేయలేకపోతున్నాం కదాని ఉన్నంతలో సర్దుకుందామని అనుకోకుండా ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. పాలనంటే పండగలు చేయడమే అనే ఫిలాసఫీ పెట్టుకున్నారు. సింగపూరు జపం వదలటం లేదు. తెలంగాణ నుండే కాక యితర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు తరలి వస్తారని, యింటికో ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు కల్పించారు. ఏదీ జరగలేదు, ఎవరూ రాలేదు. ఆంధ్రలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనబడటం లేదు. ఆశలు అడుగంటి, ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు.

పరిస్థితి యిలాగే కొనసాగితే ఫలానాది చేసి చూపించానని 2019లో చెప్పుకోవటానికి బాబుకి ఏమీ వుండదు. 2017, 18లలో ఆయన ఏదైనా గట్టిగా చేసి చూపించాలి. దానికై కేంద్రంతో తలపడగలగాలి. ఆ ధైర్యం లేదు. నోట్ల రద్దు చిన్న పరిశ్రమలను బాగా దెబ్బ తీసింది. ఆంధ్రలో వున్న చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలకు గట్టి దెబ్బ తగిలింది. ఎలా కోలుకుంటారో తెలియదు. కెసియార్‌కు సమర్థులైన తన కుటుంబసభ్యుల మద్దతు వుంది. బాబుకి లోకేశ్‌ నుండి అలాటి మద్దతు వూహించలేం. పార్టీ, ప్రభుత్వం అన్నీ తనే చూసుకోవాల్సి వస్తోంది. గతంలో వున్న దృఢత్వమూ లేదు, దృక్పథమూ లేదు.

ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ము కాస్తూ వుండడంతో మధ్యతరగతి ప్రజల ఆశలు నెలనెలకూ దిగజారుతున్నాయి. పెట్రోలు ధరలు ఎందుకు తగ్గించరో, స్వచ్ఛభారత్‌ పేరుతో వసూలు చేస్తున్న సెస్‌ ఏమౌతోందో, ధరలు ఎందుకు పెరుగుతూ పోతున్నాయో ఏమీ అర్థం కావటం లేదు. కాంగ్రెసు తరహా రాజకీయాలే మోదీ చేస్తున్నారని నికరంగా తెలిపోయింది. వాజపేయిలో వున్న ఉదారత్వం మోదీలో లేదు సరికదా, విమర్శలు జవాబు చెప్పడం కానీ, పార్లమెంటును పట్టించుకునే లక్షణం కానీ లేవని నిరూపితమైంది. అసంఖ్యాకంగా జరిపిన విదేశీ పర్యటనల వలన విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠ ఏమీ పెరగలేదు. పాకిస్తాన్‌, చైనాలతో సంబంధాలలో మెరుగుదల లేదు. మిలటరీ ద్వారా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించి ప్రజామోదాన్ని సంపాదించినది తాత్కాలిక విజయమే అయింది. పాకిస్తాన్‌ను అదుపులో పెట్టడం యిప్పటికీ సాధ్యపడటం లేదు.  ప్రత్యామ్నాయం ఎవరూ కనబడక ప్రజలు మోదీనే నమ్ముకుని వుండగా, ఎందుకు బుద్ధి పుట్టిందో ఏమో మోదీ హఠాత్తుగా నోట్ల రద్దుకు దిగి ఆర్థిక విలయానికి తెరతీశారు. సరైన సైన్యం లేకుండా, ప్రణాళిక లేకుండా యుద్ధానికి దిగినట్లయింది. సామాజిక వ్యవస్థలో లోపాలన్నీ బయటపడ్డాయి. ఆయన పెట్టిన 50 రోజుల గడువు పూర్తయినా ప్రజల కష్టాలు తీరలేదు. అనేకమంది ప్రజలకు మోదీపై విశ్వాసం సడలింది. అడుగు వెనక్కి తీసుకోవడానికి మోదీ అహం అడ్డు వస్తోంది. ఈ సంకటంలోంచి బయటపడడానికి 2017 మొత్తం పట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు.

ఈ పరిస్థితుల్లో 2017పై ఆశలు పెట్టుకునే వ్యక్తి ఊహాలోకవాసి అయి వుండాలి, లేదా భ్రమానందస్వామి అయి వుండాలి. నేను రెండూ కాదు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

Show comments