కారు జోరు తేలే రోజు వచ్చేసింది!

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈరోజు విడుదలకానున్న ఫలితంతో కారు జోరు ఎంతో, కాంగ్రెస్ సత్తా ఏంటో తెలిసిపోతుంది. హుజూర్ నగర్ లో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని అధికార టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా రావడంతో ఆ శ్రేణులు ఉత్సహంగా ఉన్నాయి.

ఇక తమకు కంచుకోటగా భావిస్తున్న ఈ సెగ్మెంట్ లో మరోసారి గెలిచి, టీఆర్ఎస్ కు పోటీగా నిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ అంచనాల్ని తిరగరాస్తా కాంగ్రెస్ కనుక హుజూర్ నగర్ లో గెలిస్తే, తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తప్పకపోవచ్చు. మరోవైపు ఎన్నికల్లో బీజేపీ ప్రభావంపైన కూడా జోరుగా చర్చ సాగుతోంది. అధికారంలోకి రాకపోయినా, ఈ పార్టీ ఓట్లు చీల్చడంలో సక్సెస్ అయిందంటున్నారు విశ్లేషకులు. కానీ అలాంటిదేం జరగదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 22 రౌండ్లలో జరిగే ఈ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట బందోబస్త్ ఏర్పాటుచేశారు. ఈసీ నియమించిన ముగ్గురు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని సీసీ టీవీ నిఘాలో నిర్వహించబోతున్నారు.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తారు. ఈవీఎంలో ఓట్లు, వీవీ ప్యాట్స్ లో స్లిప్పులు సమానంగా ఉన్నాయో లేదో సరిచూస్తారు. ఒకవేళ తేడా వస్తే స్థానిక నాయకులు, పరిశీలకుల ఆధ్వర్యంలో మళ్లీ లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికలో 2 లక్షల 754 మంది ఓటర్లు ఓటేశారు. 84.76 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ స్పీడ్ కు బ్రేక్ లు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అంటున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం సైలెంట్ ఓటింగ్ జరిగిందని, తాము మరోసారి హుజూర్ నగర్ లో గెలుస్తామంటున్నారు. ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments