ఎమ్బీయస్‌: కశ్మీరీయులకు తెలిసి వచ్చేదెలా...?

కశ్మీరుపై యిది నా ఆఖరి వ్యాసం. దీనిలో నేను సూచించబోయే పరిష్కారమార్గం చదివాక నాకు యిన్నాళ్లూ వస్తున్న 20-25% లైక్స్‌ కూడా రావు. నాకు దేశభక్తి లేదని తీర్మానించబోయే ముందు దీని కంటె ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ ఏమైనా ఉందేమో చెప్పండి ప్లీజ్‌. 'బలప్రదర్శనతో యింతకుముందు జరిగినవన్నీ విఫలమయ్యాయి కాబట్టి యిదీ విఫలమౌతుందనే బెంగ వద్దు. మోదీ అద్భుతాలు చేయగలడు' అనే ఆశాభావంతో కొందరు మెయిల్స్‌ రాస్తున్నారు. ఉపకరణాలు అవే, ఉపాయాలు అవే. అవతలి పక్షం మనస్తత్వంలో మార్పు లేదు. క్షేత్రస్థాయి వాస్తవాల్లో మార్పు లేదు. ఫలితంలో మార్పెందుకు వస్తుంది? ఇది రాజకీయక్రీడ కాదు, ఫిరాయింపులతో అధికారం చేజిక్కించుకోవడానికి! మనుషులు, మనస్తత్వాలతో కూడిన క్లిష్టమైన ప్రక్రియ. దేశమంతా అక్బరుకు సాహో అన్నా రాణా ప్రతాప్‌ అనలేదు. నష్టపోయినా, కష్టపడినా పట్టుదల సడలలేదు. అతనితో పాటు అతని సహచరులూ అంతే! కోరి కష్టాలు వరించినట్లయింది. అందరికీ లౌక్యం అబ్బదు. ఒక్కోరూ ఒక్కోలా రియాక్టవుతారు. భారత్‌ తమకెంతో చేస్తోందన్న భావన కశ్మీరీయులకు ఉండి ఉంటే, యీ సమస్య వచ్చేదే కాదు.

భారత్‌ ఒక ఉమ్మడి కుటుంబం అనుకుంటే దానిలో కశ్మీర్‌ ఒక దారి తప్పిన కొడుకు అనుకుందాం. ఇంట్లో తక్కిన వారందరి కడుపు మాడ్చి వాడికి మెక్కబెట్టినా ఎప్పుడూ సణుగుడే - 'బయటకు వెళితే యింతకంటె  మెరుగ్గా బతుకుతాను. ఇక్కడ బందీ చేసి పెట్టేశారు' అంటూ. బయటకు వెళితే కష్టంరా. నీకు స్వతంత్రంగా నిలబడే శక్తి లేదురా, ఇరుగుపొరుగూ నిన్ను వేపుకు తింటార్రా, నీ మానాన నిన్ను బతకనివ్వర్రా అని చెప్పి చూసినా వాడు వినడు. లోకం పోకడ తెలియదు. 'నన్నెవరూ ఏమీ చేయలేరు, నేను చాలా గొప్పవాణ్ని, నీ నీడన బతకాల్సిన అవసరం లేదు' అని మొండికేశాడు. 'నా కాళ్లు మీరే విరక్కొట్టి, చంకకర్రలిచ్చి సంతోషపడమంటున్నారు' అని నింద కూడా వేశాడు. చూస్చూసి, మాటలు పడిపడి. కుటుంబపెద్ద ఏం చేస్తాడు? ఓ శుభముహూర్తాన 'సరేరా, నువ్వు బయటకు వెళ్లి నీ బతుకు నువ్వు బతుకు. లోకం ఏమిటో తెలుస్తుంది. నీకు బుద్ధి వచ్చి, మళ్లీ వెనక్కి వద్దామనుకుంటే మాత్రం లెంపలేసుకుని యింటికి రావాలి.' అని పంపేస్తాడు.

కశ్మీరు విషయంలో మనం అదే చేయాలంటాను. కోట్లు కోట్లు వాళ్ల పేరు మీద ఖర్చవుతున్నాయి. వాళ్ల పేర అని ఎందుకు అంటున్నానంటే ఆ సాకు చెప్పి మధ్యలో దళారులు - రాజకీయ నాయకులు, సైన్యాధికారులు వగైరా - ఎంత తినేస్తున్నారో తెలియదు. ప్రజలకు ఎంత శాతం చేరుతోందో ఎవరూ చెప్పరు. ఏడు దశాబ్దాలుగా వాళ్లను దువ్వుతూనే ఉన్నా, వాళ్లు దువ్వబడటం లేదు. కుటుంబంలో భాగం అనుకోవటం లేదు. అందువలన జమ్మూ మా దగ్గరే ఉంటుంది. మీరు స్వతంత్ర దేశంగా బతికి చూడండి అని కొన్ని విషయాల్లో ద్వైపాక్షిక ఒప్పందం రాసుకుని వదిలించుకోవడం ఉత్తమం. 'గోర్డియన్‌ నాట్‌' కథ విని వుంటారు. ఒక దేశంలో రాజు లేకుండా పోయాడు. 'ఎద్దులబండి ఎక్కి ఎవరైతే వస్తారో వాళ్లనే రాజుగా చెయ్యండి' అని ఆకాశవాణి చెప్పింది.

ఓ పల్లెటూరి రైతు అలాగే వచ్చాడు, రాజుని చేశారు. కృతజ్ఞతాపూర్వకంగా రైతు కొడుకు ఆ ఎడ్లబండిని దేవుడి గుడిలో బలిపీఠానికి కట్టేశాడు. ఎవరూ తీసుకుని పోకుండా ముళ్ల మీద ముళ్లు వేసేసి, పీటముడికి బాబులా చేశాడు. ఇది ఎవరైతే విప్పుతారో వాళ్లు ఆసియాకు చక్రవర్తులవుతారు అని ఆకాశవాణి చెప్పిందని ఐతిహ్యం వ్యాపించింది. గ్రీసు నుంచి అలెగ్జాండరు పర్షియాకు వచ్చేసరికి యీ నగరం ఎదురైంది. ఆ ముడి విప్పి తన ఘనత చాటుదామనుకున్నాడు అలెగ్జాండర్‌. ఎంత ప్రయత్నించినా ముడి విడలేదు. చివరకు 'ఎలా విప్పినా ఒకటే' అంటూ కత్తి తీసి ఒక్కవేటుతో ముడిని తెంపిపడేశాడు. జోస్యం మాట ఎలా ఉన్నా అలెగ్జాండరు ఆసియాలో కొంతమేర గెలిచాడు.

ఇప్పుడీ కశ్మీరు కూడా గోర్డియన్‌ నాట్‌ లాటిదే. ఇన్నేళ్ల ముళ్లు విప్పలేం. ఖండనం తప్ప వేరు గతి లేదు. అలా అనగానే రెండు సందేహాలు వస్తాయి. వాళ్లు స్వతంత్రంగా నిలబడగలరా? పాకిస్తాన్‌ కశ్మీర్‌ను కబళించి, అక్కణ్నుంచి మనపై దాడి చేస్తే ఏం చేయాలి? మనం విడిగా వెళ్లవచ్చని అనగానే పాక్‌ ఆక్రమిత ఆజాద్‌ కశ్మీర్‌లో కూడా కలకలం ప్రారంభమవుతుంది. పాక్‌ పరోక్ష నియంత్రణ పోవాలి, మేమూ, మేమూ కలిసిపోతామని గొడవ చేస్తారు. పాక్‌కు కూడా గత్యంతరం లేక ఔననాలి. లేకపోతే కశ్మీర్‌ దృష్టిలో అది విలన్‌ అయిపోతుంది. రెండు కశ్మీర్‌లు ఏకమవుతాయి. కోటి జనాభా ఉన్నా, వాళ్లకు భౌగోళికంగా చాలా పరిమితులున్నాయి. అందరితో సఖ్యంగా ఉంటే తప్ప రోజు గడవదు. భారత్‌ సాయం చేయదు, భారత్‌ను దెబ్బ కొట్టాలని పాక్‌ యిన్నాళ్లూ చేస్తూన్న సాయమూ ఆగిపోతుంది. టూరిజం, ఏగ్రి యిండస్ట్రీస్‌ యిలాటివాటిపై బతకాలి. భారత్‌ వ్యతిరేకత కొనసాగిస్తే ఆదాయం పోతుంది. అందువలన అవసరమైన దాని కంటె ఎక్కువ మర్యాద ఒలకపోస్తారు. ఎందుకంటే భారత్‌ అనేది పెద్ద మార్కెట్‌. పైగా ప్రపంచంతో లింకు పెట్టుకోవడానికి దానితో సఖ్యత అత్యవసరం.

ఇక రెండో సందేహం - మనం ఖాళీ చేయగానే పాక్‌ వచ్చేసి, కశ్మీరును ఆక్రమించేస్తే ఎలా? అంతటితో ఆగకుండా అక్కణ్నుంచి మనపై దాడి చేస్తే ఎలా? ఒకవేళ పాక్‌ కశ్మీరును ఆక్రమించిందనుకోండి, ఏమవుతుంది? చైనా టిబెట్‌ను ఆక్రమించింది. ఏమైంది? ఇప్పటికీ దలైలామాతో అవస్థ పడుతోంది. అలాగే కశ్మీరు సమస్య అప్పుడు పూర్తిగా పాక్‌దే అవుతుంది. దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి యిప్పుడు మనం పెట్టే ఖర్చు వాళ్లు పెట్టాల్సి వస్తుంది. మనమైతే తట్టుకున్నాం, వాళ్లయితే త్వరలో దివాళా తీస్తారు కూడా. వాళ్లూ, వాళ్లూ ముస్లింలు, అంతా కలిసిపోతారనుకుంటున్నారా? అదేం లేదు, పాక్‌లో బెలూచిస్తాన్‌ వంటి అనేక ప్రాంతాలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాయి. మరి వాళ్లూ ముస్లిములే.

కశ్మీరులో ముస్లిములు ఉన్నారు కాబట్టి వేర్పాటువాదం అంటున్నారని ఒక పాఠకుడు అన్నారు. మతపరమైన సమస్య వలన వేర్పాటు వాదం రాలేదు. మీ జాతి వేరే, మా జాతి వేరే అనుకోవడం వలన వచ్చింది. మిజోరాం, నాగాలాండ్‌.. వంటి ప్రాంతాల్లో కూడా యిదే సమస్య. శ్రీలంకలో తమిళులు, తాము వేరే జాతి అనుకునే పోరుబాట పట్టారు. పాక్‌లో బెలూచిస్తాన్‌దీ అదే సమస్య. ఇప్పుడు కశ్మీర్‌ను ఆక్రమిస్తే అక్కడా అదే సమస్య వస్తుంది. అందువలన ఓపెన్‌గా ఆక్రమించకుండా పరోక్షంగా తనకు అనుకూలంగా ఉన్నవారి చేత పాలించడానికి చూస్తుంది. సహజంగా దానికి ప్రజల్లో ప్రతిఘటన వస్తుంది. ఎందుకంటే పాక్‌లో సింధీలకు, పంజాబీలకే పడదు. వేర్వేరు పార్టీలకు మద్దతు యిస్తారు. కశ్మీరీయులు మాత్రం తాము అచ్చమైన పాకిస్తానీయులు అనుకుంటారా? నెవర్‌.

ఇక కశ్మీరు ద్వారా పాక్‌ మనపై దాడి చేస్తే...? దాడి చేయాలనుకుంటే అక్కణ్నుంచే చేయాలా? రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌లలో సరిహద్దులు లేవా? అక్కణ్నుంచి రాలేరా? నిజానికి కశ్మీర్‌, జమ్మూను కలిపే రోడ్లు రెండే ఉన్నాయనుకుంటా. అవి మూసేస్తే అటునుంచి శత్రుసైన్యం రాలేదు. నేను గమనిస్తూ వస్తున్నదేమిటంటే, ఇండియా, పాక్‌ పాలకులు అప్పుడప్పుడు యుద్ధవాతావరణం సృష్టించి తమ ప్రజల్లో పలుకుబడి పెంచుకుంటారు తప్ప పూర్తి స్థాయి యుద్ధం చేయరు. ఎందుకంటే ఓడిపోయిన దేశ పాలకుడు తన ప్రజల ముందు తలవంచుకోవాల్సి వస్తుంది. కార్గిల్‌ ఓటమి తర్వాత, యుద్ధప్రకటనలో అతని ప్రమేయం లేకపోయినా నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక గెలిచిన దేశంలో కూడా తృప్తి ఉండదు. 'ఇంకా ముందుకు దూసుకుపోయి, వాళ్ల రాజధానిని కొట్టి పడేయాల్సింది. మళ్లీ ఎప్పుడూ తల ఎత్తడానికి వీల్లేకుండా, మొత్తం తుడిచిపెట్టేసి, మన దేశంలో కలుపుకోవాల్సింది' అని పాలకులపై రుసరుస ఉంటుంది.

పాతకాలంలో తప్ప, యీ రోజుల్లో ఒక దేశం మరో దేశాన్ని పూర్తిగా ఆక్రమించడం జరగటం లేదు. యుద్ధం లాజికల్‌ కన్‌క్లూజన్‌కు రాకుండా యుఎన్‌ఓ, అగ్రరాజ్యాలు అడ్డుపడతాయి, రాజీ చేస్తామంటూ దిగుతాయి. ఇండియాది పైచేయి అవుతోందనుకోండి, యుద్ధవిరమణ ప్రతిపాదిస్తాయి. ఇండియా సూపర్‌ పవర్‌ కావడం వాళ్లకు యిష్టం లేదు. ఈనాడు అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోంది. మనవాళ్లు అమెరికాలో ఉపద్రవంగా ఎదుగుతున్న కారణంగా, అమెరికన్‌ సమాజంలో ఇండియన్స్‌పై అసూయ ఉంది, పాక్‌ పై జాలి ఉంది. ఆసియాలో నమ్మదగ్గ మిత్రుడు అనే అభిమానం ఉంది. పైగా అమెరికన్‌ సైనిక స్థావరాలు పాక్‌లో ఉన్నాయి. 1971లో కూడా అమెరికా పాక్‌కు సాయపడబోయింది. పాక్‌ను ఇండియాకు పక్కలో పాములా ఉంచాలనేదే అమెరికాతో సహా, అగ్ర దేశాలన్నిటి ఆశ. అందువలన ఒకవేళ యుద్ధం వచ్చినా అది 10, 15 రోజులు మించి సాగనివ్వరు.

యుద్ధమంటూ జరిగితే భారత్‌దే గెలుపవుతుంది. పాక్‌కి అంత శక్తి లేదు. అందువలననే అది దొంగదెబ్బలు తీద్దామని చూస్తూ ఉంటుంది. అయినా పాక్‌ మనపై ప్రత్యక్షంగా దాడి చేస్తే తిప్పికొట్టలేని చవటలం కాదు మనం. ఇక ఉగ్రవాద చర్యలంటారా, ప్రపంచమంతా ఆ సమస్యతో అవస్థ పడుతోంది. మనం దానికి అతీతం కాదు. ఇది కాకపోతే మరో రూపేణా అది పీడిస్తుంది. పాక్‌ కూడా ఒక కాన్సర్‌ లాటిది, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. అందువలన పాక్‌ దాడి చేస్తుందేమోనని భయపడి, కశ్మీరు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఉండకూడదు. నా దృష్టిలో కశ్మీరును విడిగా పంపించేసి, జమ్మూను విపరీతంగా అభివృద్ధి చేయడమే మందు. అప్పుడు కశ్మీరీయులకు బుద్ధి వచ్చి, మేం మళ్లీ కలుస్తాం, లేదా కాన్ఫడెరేషన్‌లా ఉంటాం అని బతిమాలితే సరే అని ఒప్పుకోవచ్చు. ఇలా చేస్తే అంతర్జాతీయ సమాజంలో మన ప్రతిష్ఠ పెరుగుతుంది. మనం కశ్మీరుపై పెడుతున్న బోల్డు ఖర్చు మిగులుతుంది. ఆ డబ్బును యితర ప్రాంతాలకు మళ్లిస్తే అవైనా బాగుపడతాయి.

ఈ సూచన ఏ రాజకీయ పార్టీ చేయదు, ఓట్లు పోతాయన్న భయం. ఇది అనివార్యమని తెలిసినా, దేశద్రోహి అనే ముద్ర పడుతుందన్న భయంతో ఏ నాయకుడూ చేయడు. మరి ప్రత్యామ్నాయం ఏమిటని అడిగితే ప్రతిపక్షాలు 'అధికార పార్టీ విధానం తప్పు' అని విమర్శించి ఊరుకుంటాయి. అవి అధికారంలోకి రాగానే మళ్లీ అదే విధానాన్ని అవలంబిస్తాయి. కటింగ్‌ ద లాసెస్‌ అన్నట్లు, యీ దండగమారి ఖర్చుకి యింతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలి అనే ధైర్యవంతుడు ఉంటే తప్ప, ఈ నిప్పు ఎప్పటికీ చల్లారదు. గతకాలపు నాయకుల్లో అలాటి వాళ్లు ఉండేవారు, 'ప్రస్తుత పరిస్థితుల్లో దేశవిభజన తప్పదు' అని రాజాజీ, ఆంబేడ్కర్‌ లాటి వాళ్లు బాహాటంగా చెప్పారు. దేశవిభజనను అడ్డుకుంటాం అని గంభీరంగా అంటూనే అడ్డుకోలేక పోయినవారు ఎందరో!

భారత్‌కు స్వాతంత్య్రం యిచ్చే విషయంలో ఇంగ్లండు చచ్చేటంత చర్చ జరిగింది. వందలాది ఏళ్లు కష్టపడి సంపాదించుకున్నది వదులుకోవడమా అని వాళ్ల బాధ. బ్రిటన్‌ రాణి కిరీటంలో మణిమాణిక్యం ఇండియా, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చర్చిల్‌ వంటి మహా నాయకుడు చాలా గట్టిగా పట్టుబట్టాడు. లేబర్‌ పార్టీ నాయకుడు అట్లీ అన్ని వర్గాల వారినీ ఒప్పించి, స్వాతంత్య్రం యిప్పించాడు. మనకైతే కశ్మీరు వచ్చి ఒళ్లో పడింది. వందలాది ఏళ్లు యుద్ధాలు చేయలేదు. తాయిలాలు యిచ్చి వశపరచుకుందామని దశాబ్దాల పాటు ప్రయత్నించాం. కుదరకపోగా, పెద్ద తలనొప్పిగా దాపురించింది. తక్కిన రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులివ్వలేక పోతున్నాం. 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు, యిప్పటిదాకా అవస్థపడ్డది చాలు, ఈ దండగమారి కశ్మీరును వదిలేసి చూద్దాం' అని అనగలిగిన నాయకుడు తెరపైకి రావాలని ఆశిస్తాను. (సమాప్తం) (ఫోటో - కశ్మీరులో తాజాగా నిరసన ప్రదర్శనలు)
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)
mbsprasad@gmail.com

Show comments