ఈ వ్యూహాలతో పవన్ చతికిలపడాల్సిందేనా?

పవన్ కల్యాణ్ సభలకు యూత్ వెల్లువలా వచ్చేస్తుంటారు. ఆయన సీరియస్ కంటెంట్ మాట్లాడేప్పుడు శ్రద్ధాంజలి ఘటించినట్లుగా మౌనం పాటిస్తూ... ఆయన రెచ్చిపోయి అర్థంపర్థంలేని ఆవేశకావేషాలు ప్రదర్శించేప్పుడు విజిల్స్ కొడుతూ నానా హంగామా చేస్తుంటారు. అవన్నీ చూసుకుని పవన్ కల్యాణ్ మురిసిపోతూ ఉంటారు.

కానీ పవన్ నిజంగా.. ఒక ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలాగా వ్యవహరిస్తున్నారా? అంటే అనుమానమే. పార్టీ తరఫున మీడియాను పద్ధతిగా మేనేజిచేయడం సంగతి దేవుడెరుగు... కనీసం పార్టీ కార్యక్రమాల పరంగా ముఖ్యమైన ఘట్టాలున్నప్పుడైనా వాటికి తగిన ప్రచారాన్ని పొందడంలో జనసేన దారుణంగా విఫలం అవుతోంది.

పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ కు చేతకాలేదు. పార్టీ కార్యక్రమాలు గట్రా.. పార్టీకి అదనపు మైలేజీ కాగల రీతిలో పద్ధతిగా సాగుతున్నాయని అనుకోవడానికి కూడా తగినంత కసరత్తు కనిపిండం లేదు.

కనీసం నాదెండ్ల మనోహర్ లాంటి కీలక రాజకీయ నాయకులు పార్టీలో చేరినప్పుడు కూడా.. తమ పార్టీకి  పాజిటివ్ ప్రచారం రాబట్టుకోవడంలో జనసేన చాలా ఘోరంగా విఫలం అవుతోంది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్ తో కలిసి తిరుపతికి వెళ్లిన ఘట్టానికి, ఇద్దరూ కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఘట్టానికి దక్కినంత ప్రచారం కూడా ఈ చేరికకు దక్కలేదు.

కాస్త నిక్కచ్చిగా చెప్పాలంటే.. అయిదేళ్ల వయసున్నా.. ఇంకా బొడ్డూడని పార్టీ జనసేనలోకి ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద నాయకుడు నాదెండ్ల మనోహర్ అని చెప్పాలి. ఇదేస్థాయి నాయకుడు మరో పార్టీలో చేరి ఉంటే గనుక... ఆ చేరికనే ఓ భారీ బహిరంగ సభగా నిర్వహించి.. తద్వారా పార్టీకి చాలా మైలేజీ సాధించుకోవడానికి ప్రయత్నించేవారు.

ఖర్చుకు కక్కుర్తి పడే నాయకులే అయితే గనుక... కనీసం సదరు నాయకుడి సొంత నియోజకవర్గంలో గానీ, పార్టీ కార్యాలయంలో భారీగా కార్యక్రమం ఏర్పాటుచేసి.. మీడియా వాళ్లందరినీ ఆహ్వానించి నానా హంగామా చేసేసి ఉండేవాళ్లు.

కానీ పవన్ కల్యాణ్ పార్టీ – జనసేన, అదేం చిత్రమో గానీ.. మీడియాకు ఆహ్వానాలు కూడా పంపలేదు. ఒక్క చానెల్ లో కూడా (99ను పక్కన పెట్టండి) లైవ్ లేదు. ప్రతిరోజూ జరిగే మొక్కుబడి తంతులాగా ఒక ప్రెస్ మీట్ పంపి... అక్కడితో చేతులు దులుపుకున్నారు.

ఇలాంటి కనీస విచక్షణ లేని వ్యూహాలతో సాగుతోంటే.. జనసేన చతికిలపడకుండా ఏమౌతుంది? అని పార్టీ వర్గాలే విస్తుపోతున్నాయి. 

Show comments