తమకు నోరెలా వస్తోంది చిన్నమ్మా?

చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడి... వారితో పొత్తు పెట్టుకున్న నిర్ణయంతో ఎంతగా దిగజారారో.. తెలుగుదేశం పార్టీని తొలినుంచి అభిమానిస్తున్న వారందరికీ స్పష్టంగా తెలుసు. పార్టీని ఎంతగా దిగజార్చారో, కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఎన్టీఆర్ మౌలిక స్ఫూర్తిని ఎలా మంటగలిపేశారో అందరికీ తెలుసు. కానీ ఈ విషయం గురించి కొందరు మాట్లాడినప్పుడు మాత్రం చిత్రంగా అనిపిస్తుంది. అలాంటిదే ఇది కూడా! కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం గురించి.. ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ తో తెదేపా జతకట్టడం సిగ్గుచేటు అని పురందేశ్వరి అంటున్నారు. నిజమే కావొచ్చు. తెదేపా సిగ్గుచేటు అయిన పనిచేసిందనే అంతా అనుకుంటున్నారు కూడా... అయితే ఆ విమర్శలు చేసే అర్హత నందమూరి తారక రామారావు తనయ అయిన దగ్గుబాటి పురందేశ్వరికి ఉన్నదా అనేది పలువురికి కలుగుతున్న సందేహం.

కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే తన జీవితాశయంగా పెట్టుకున్న ఎన్టీఆర్ కూతురు అయినప్పటికీ... ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు అనుభవించారు. ప్రత్యేకించి.. రాష్ట్ర విభజన గురించి పోరాటం జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ వారసులు హరికృష్ణ, బాలకృష్ణ లాంటివారు సమైక్య రాష్ట్రానికి ఓటు వేసినప్పటికీ.. పురందేశ్వరి చాలా నాటకాలు ఆడారు.

ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక మంత్రుల్లో ఒకరిగా అధికారం వెలగబెడుతున్న పురందేశ్వరి కనీసం రాష్ట్రం నుంచి వచ్చిన సమైక్య నాయకుల వినతుల్ని ఆలకించకుండా చిన్నచూపు చూశారు.

ఆరోజుల్లో కాంగ్రెస్ పంచన ఆశ్రయం పొందుతూ... పదవులకోసం ఆరాటపడ్డారే తప్ప.. వాస్తవంలో తెలుగు రాష్ట్ర ప్రజల వినతుల గురించి పట్టించుకోలేదు. తీరా విభజన తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో సర్వభ్రష్టత్వం చెందినట్లేనని గుర్తించిన ఆమె.. విభజనకు జైకొట్టిన భాజపా తీర్థం పుచ్చుకుని.. మళ్లీ రాజకీయ అందలాలు ఎక్కడానికి అర్రులు చాచినప్పటికీ.. ఫలితం దక్కలేదు.

ఆమెను రాజంపేట ఎంపీగా ప్రజలు తిరస్కరించారు. ఇన్ని రకాలుగా ఎన్టీఆర్ స్ఫూర్తిని తాను స్వయంగా తుంగలో తొక్కిన ఆమె.. ఇవాళ భాజపా చెట్టు నీడన ఉన్నది గనుక.. కాంగ్రెస్ తెదేపా పొత్తు పెట్టుకోవడాన్ని ఈసడించుకోవడం చిత్రమే మరి!

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments