ఇంత స్ట్రాంగుగా ఉంటే.. కాంగ్రెస్ కల తీరేదెలా?

పోలింగ్ జరిగే వరకు ఎన్నెన్ని రకాల వక్రమార్గాలు తొక్కవచ్చునో, ఎన్నెన్ని రకాల మాయోపాయాలు పన్నవచ్చునో అదంతా అయిపోయింది. ఇప్పుడిక పోలింగ్ ముగిసి, ఓటరు తీర్పు స్ట్రాంగు రూముల్లో ఉంది. పోస్ట్-పోల్ కుట్రలకు కాంగ్రెస్ తెరతీసినట్లుగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసను మాత్రం గద్దె ఎక్కనివ్వరాదనే వ్యూహంతో ఉన్న కాంగ్రెస్ అవసరమైతే.. ఈ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంను కూడా తమ జట్టులో కలుపుకోడానికి ఉత్సాహపడుతోంది. అయితే.. ఒవైసీ పోకడ గమనిస్తోంటే మాత్రం కాంగ్రెస్ కల తీరే సూచన కనిపించడం లేదు.

ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తమ పార్టీకి 75 నుంచి 80 సీట్లు వస్తాయంటూ కూటమిలోని ప్రతి పార్టీ డప్పుకొట్టుకుంటూనే ఉంది. కానీ లోలోన మాత్రం వారికి గుబులు తప్పడంలేదు. అందుకే తాము పరాజయం పాలైనా... వక్రమార్గాల్లో గద్దెమీదికి రావడానికి ఎన్నిదార్లు అవైలబుల్ గా ఉన్నాయో వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే.. 7 సీట్లు గెలవడం గ్యారంటీ అనే గుర్తింపుతో ఉన్న ఎంఐఎంను కూడా ప్రసన్నం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

నిజానికి ఎంఐఎం ఎన్నికలకు ముందునుంచి తెరాసకు సన్నిహితంగా ఉంది. వారు పోటీచేసే స్థానాల్లో కాకుండా.. రాష్ట్రంలో ఇతర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తెరాస తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయినాసరే, వారి ప్రాపకం కోసం ఇప్పుడు కాంగ్రెస్ తాయిలాలు ఎర వేస్తోంది. కానీ వర్తమానంలో పరిస్థితిని గమనిస్తే... తెరాస వెన్నంటి మాత్రమే ఉండాలని ఒవైసీ చాలా స్ట్రాంగు డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో సోమవారం మద్యాహ్నం భేటీ అయిన ఒవైసీ, భేటీకి వెళ్లడానికి ముందు ఓ ట్వీట్ పెట్టారు. ‘తెలంగాణ పెద్దదిక్కు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. దేవుడి దయవల్ల.. ఆయన తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, మజ్లిస్ ఆయన వెన్నంటి ఉంటుందని కూడా చెప్పారు. జాతి నిర్మాణం అనే విస్తృత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది తమ తొలిఅడుగు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.

మరి ఒవైసీ ఇంత బలంగా.. కేసీఆర్ జట్టులో మాత్రమే ఉండడానికి ఉత్సాహపడుతున్నారు. అందులో భిన్నాభిప్రాయం లేదనే సంకేతాలు కూడా స్పష్టంగా ఇస్తున్నారు. ఆయన ఇంత స్ట్రాంగుగా ఉన్నప్పుడు.. ఆయన మద్దతుపొంది అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ కల నెరవేరుతుందా అనేది సందేహంగానే ఉంది.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments