చిన్నమ్మను ఎంత 'పెద్దమ్మ'ను చేస్తారో....!

    కేవలం జయలలిత స్నేహితురాలైనందుకు 'చిన్నమ్మ' శశికళా నటరాజన్‌కు రాజయోగం పట్టింది. చిన్నమ్మను జయలలిత తన రాజకీయ వారసురాలిగా ప్రకటించలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. పార్టీలో కీలక పదవి కట్టబెట్టలేదు. ఏవిధంగానూ రాజకీయంగా అందలమెక్కించలేదు. అయినప్పటికీ అన్నాడీఎంకే నాయకులు ఆమెకు గొప్ప యోగం పట్టించారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవి కోసం శాసనసభ్యులు వారిలో వారు కొట్టుకొని రచ్చరచ్చ చేస్తారు. కాని తమిళనాడులో అంత పెద్ద పదవి కోసం ఏ సీనియర్‌ నాయకుడూ పోటీ పడకుండా (పన్నీరు శెల్వంను తొలగించాలనుకుంటే) కనీసం పార్టీలో పూర్తిస్థాయి సభ్యురాలు కూడా కాని శశికళకు ఉమ్మడిగా బ్రహ్మరథం  (మెజారిటీ నాయకులు) పడుతుండటం విచిత్రం. ఇక్కడ ఇంకో విచిత్రమూ జరుగుతోంది.

     జయలలిత కన్నుమూసే వరకు ఆమె భక్తాగ్రేసరులైన, పాదాక్రాంతమైన నాయకులంతా ఆమె ప్రాణం పోయిందని తెలియగానే చిన్నమ్మకు దాసానుదాసులైపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకముందే భజన ప్రారంభించారు. భజన ప్రారంభమే 'హైపీచ్‌'లో ఉంది. ఆమె ముఖ్యమంత్రి అయితే ఇంకెంత పతాకస్థాయికి వెళుతుందో. పిచ్చి ముదిరి పాకాన పడుతుందనడంలో సందేహంలేదు. శశికళపట్ల అన్నాడీఎంకే నాయకులు 'అతి భక్తి' ఆమె వ్యతిరేకులకు అసహ్యం కలిగిస్తోంది. 'నాయకులు జయను అప్పుడే మర్చిపోయారు' అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. నాయకులు జయలలిత దగ్గరకు వెళ్లినప్పుడు చొక్క జేబులో ఆమె ఫోటో పెట్టుకొని వెళ్లేవారు. వీరు పల్చటి తెల్లచొక్కాలు వేసుకుంటారు కాబట్టి జేబులోని ఫొటో బయటకు కనబడుతూ ఉంటుంది. జయను ఇంప్రెస్‌ చేయడంలో ఇదొక భాగం. ఇప్పుడు చొక్కా జేబులో శశికళ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇదీ వీరి తీరు.     
    నాయకులు, అభిమానులు జయలలితకు అనేక బిరుదులు ఇచ్చారు. సాధారణంగా ఆమెను 'అమ్మ' అంటారు. 'పురట్చి తలైవి' (విప్లవ నాయకి) అని పిలుస్తారు. ఇవి చాలామందికి తెలుసు. కాని ఇంకా చాలా బిరుదులు న్నాయి. రాజుల కాలంలో వారికి అనేక బిరుదులుండేవి.  వారిని ఆ బిరుదులతోనే సంబోధించేవారు తప్ప నేరుగా పేరు పెట్టి పిలిచేవారు కాదు. జయ పట్ల కూడా ఇదే తీరు. జయకున్న బిరుదుల్లో  'పురట్చి తలైవి'  పాపులర్‌. ఇక ఆమె మానవ జన్మ ఎత్తిన దేవత అన్నారు. 'తెన్నగత్తు అరసి' (దక్షిణ ప్రాంత రాణి) అని కీర్తించారు. తమిళంలో 'తెన్‌' అంటే దక్షిణం అని అర్థం. 'కావల్‌ దైవం' (రక్షించే దేవత) అని స్తోత్రం చేశారు. 'కావల్‌' అంటే రక్షణ అని అర్థం. జయను నడిచే దేవతగా భావిస్తూ 'నడమాడుం దైవం' అని ఆరాధించారు. ఆమె మామూలు నాయకురాలు కాదని అన్నాడిఎంకె నాయకుల అభిప్రాయం. అందుకే 'తంగ తలైవి' (బంగారు నాయకురాలు) అని బిరుదు ప్రదానం చేశారు.

     జయను దేవతగా ఆరాధించే  నాయకులు ఆమె ఎల్లప్పుడూ తమ హృదయంలోనే ఉంటారని,  తల్లివంటిదని ప్రశంసించారు. అందుకే ఆమెను 'ఇదయతాయి' (హృదయంలోని తల్లి) అని భక్తిగా కొలిచారు. అలాగే 'ఇదయ దేవతై' (హృదయంలోని దేవత) అని కూడా భక్తిగా పిలిచారు. అన్నాడిఎంకె నాయకులు, కార్యకర్తలు జయలలితే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునేవారు. అందుకే ఆమెను 'తమిళ్‌నాట్టిన్‌ నిరందర ముదలవర్‌' (ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి) అని అన్నారు. కొందరు నాయకులు జయను మదర్‌ థెరిస్సాతో పోల్చి 'తెన్నగత్తిన్‌ థెరిసా' (దక్షిణ భారత థెరిసా) అని వినయవిధేయతలు చాటుకున్నారు.

     తమిళనాడులో ప్రాచీన వీరవనిత అయిన కణ్ణగితోనూ జయను పోల్చారు. తెలుగువారికి రుద్రమ దేవి ఎలాగో తమిళులకు కణ్ణగి అలా. చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి అయితే ఆమెకు ఎన్ని బిరదులు ఇస్తారో....! ఆమెను ఏవిధంగా కీర్తిస్తారో...! జయకున్న బిరుదులు చదివాక ఇంతకు మించి కీర్తించే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కీర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది కదా. జయలలిత విషయంలో ఆ హద్దులు దాటేశారు. శశికళ విషయంలో ఏం చేస్తారో చూడాలి. జయలలిత చనిపోగానే ఓ నాయకుడు శశికళను ఉద్దేశించి 'తాయి తంద వరం' (అమ్మ ఇచ్చిన వరం) అన్నాడు. అమ్మ ఇచ్చిన ఈ చిన్నమ్మను ఎంత 'పెద్దమ్మ'ను (జయను మించి) చేస్తారో...! 

Show comments