ఓటేసిన చరిత్ర లేదు.. సీఎం కుర్చీ కావాలంట!

ఇప్పటిదాకా జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేసిన చరిత్ర లేదు. ఎందుకంటే ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు.అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం మీద కొత్తగా విశ్వాసం పుట్టినట్టు ఉంది. దేశవ్యాప్తంగా... యువతకే రాజ్యాధికారం అంటూ వినిపిస్తున్న మాట పట్ల ఆయన ఆకర్షితులయ్యారట. అందుకే తొలిసారిగా ఓటు హక్కుకు తన పేరును కూడా నమోదు చేసుకున్నారట.

యువతకు రాజ్యాధికారం దక్కుతుంది అనే మాటలను విశ్వసించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో కి ఓటరుగా ప్రవేశించిన ఆయన యువతరాన్న గద్దెి ఎక్కించడానికి  ఈ పని చేశారని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే . ఇప్పుడు తాను రాజకీయాలలో దిగి ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన ఓటరుగా నమోదయ్యారుట. అవకాశం వస్తే ముఖ్యమంత్రిగా పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట.

ఇంతకు యువత రాజకీయాల్లోకి రావాలి అనే నినాదంతో ఉత్సాహపడి ప్రజాస్వామ్యం పట్ల ఎన్నికల వ్యవస్థ పట్ల మక్కువ చూపుతున్న ఆ వ్యక్తి వయసు 70 ఏళ్లు. ఆ వ్యక్తి పేరు గుమ్మడి విఠల్ రావు. అలియాస్ గద్దర్.

అవును. గద్దర్ గా అభిమానులందరూ పిలుచుకునే ఈ విప్లవకారుడు , ప్రజానాట్యమండలి కళాకారుడు, తన జీవితం అంతా పోరాటాలకు అర్పించిన నాయకుడు అయిన గద్దర్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని అభిలషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే పాతతరం ఉద్యమ నాయకుల్లో గద్దర్ కూడా ఒకరు. వామపక్ష అతివాద పోరాటాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్న గద్దర్.. ఇప్పటిదాకా ఎన్నడూ ఓటు వేసింది లేదు. కానీ... థాను ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఓటరుగా నమోదు చేయించుకున్నానని గద్దర్ అంటున్నారు.

తెలంగాణ కోసం చేసిన పోరాటం కేవలం కేసీఆర్  ఒక్కరిదే కాదనే సంగతి అందరికీ తెలుసు. కేసీఆర్ తో సమానంగానూ, కొన్ని సందర్భాల్లో వారికంటె ఎక్కువగానూ పోరాడిన తెలంగాణ ప్రముఖుల్లో కోదండరాం లాంటి వారిలాగే, గద్దర్ కూడా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే.. అప్పటికే వ్యవస్థీకృతంగా పార్టీ రూపంలో ఉన్న తెరాస పునాదుల మీద కేసీఆర్ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు.

కేసీఆర్ చాలా తెలివిగా.. తనతో సమానమైన తెలంగాణ పోరాట యోధులుగా పేరున్న వారందరినీ క్రమంగా సైడ్ లైన్ చేసి... ప్రజలు మరచిపోయేలా చేశారనే వాదన కూడా ఉంది. ఆ రకంగానే.. కోదండరాం సహా గద్దర్ కూడా కేసీఆర్ కు దూరం అయ్యారు. కాకపోతే గద్దర్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా చేపడతానని అంటున్నారు. మరి... ఆయన ఏ పార్టీ తరఫున బరిలోకి దిగదలచుకుంటున్నారో, ఆయనకు ఎవరు టికెట్ ఇస్తారో వేచిచూడాలి.

RELATED రీమేక్ కు త్రివిక్రమ్ బై..?