ఎమ్బీయస్‌: బిజెపికి ఎదురు లేని హరియాణా

హరియాణాలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాలన అద్భుతంగా ఉందని ఎవరూ గట్టిగా చెప్పలేరు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఖరీఫ్‌ పంట సేకరణ, దానికి చెల్లింపులు ఆలస్యంగా జరిగాయి. నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. విద్య, వైద్య రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సరిగ్గా లేదు. 2016 జాట్‌ రిజర్వేషన్‌ ఆందోళనలో జరిగిన హింసను, 2017లో డేరా బాబా అరెస్టయినప్పుడు జరిగిన హింసను ఆపలేకపోయినందుకు ఖట్టర్‌ అపఖ్యాతి పాలయ్యాడు. అయినా ప్రతిపక్షాలయిన కాంగ్రెస్‌, లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) పూర్తిగా చతికిలబడడంతో బిజెపి ప్రభ వెలుగుతోంది. హరియాణాలో యిప్పటిదాకా వచ్చిన ముఖ్యమంత్రు లందరిపై అవినీతి, బంధుప్రీతి మచ్చ ఉంది. కానీ మనోహరలాల్‌పై అలాటి ముద్ర లేదు. ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేసినపుడు బంధుప్రీతికి అవకాశం లేకుండా చేసి పేరు తెచ్చుకున్నాడు. అది ఒక ప్లస్‌ పాయింటు అయింది. 

2018 డిసెంబరులో 5 నగరాలలో పురపాలక ఎన్నికలు అన్నిటిలోనూ బిజెపియే గెలిచింది. కాంగ్రెసు వీటిలో పోటీయే చేయలేదు. 2019 జనవరిలో జింద్‌లో ఉపయెన్నిక జరిగితే దానిలోనూ బిజెపి నెగ్గింది. ఇక 2019 మే వచ్చేసరికి పార్లమెంటు ఎన్నికలలో 10కి 10 సీట్లు గెలుచుకుంది. ఈ అఖండ విజయానికి ప్రధాన కారణం జాతీయతా వాదమే. సైన్యంలో 10% మంది హరియాణా వారే. 16 లక్షల మంది సైనిక కుటుంబాలున్నాయి. అలాటప్పుడు ఫుల్‌వామా, బాలాకోట్‌ దాడుల తర్వాత సగటు హరియాణా ఓటరు బిజెపిని అభిమానించకుండా ఎలా ఉంటాడు? పార్లమెంటు ఎన్నికలలో దాన్ని వాడుకుని లబ్ధి పొందిన బిజెపి యీసారి ఆర్టికల్‌ 370 రద్దును, ఎన్‌ఆర్‌సి (పౌరసత్వ జాబితా) ప్రచారం చేసుకుంటోంది. జాతీయ కాంగ్రెసు నాయకులు వాటిని విమర్శించినా స్థానిక పరిస్థితుల దృష్ట్యా హరియాణా కాంగ్రెసు నాయకుడు  భూపీందర్‌ హూడా వాటిని స్వాగతించాడు. 

ఎందుకంటే గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు సార్లు ఎంపీగా పని చేసిన అతను మొన్న మే పార్లమెంటు ఎన్నికలలో ఘోరంగా 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడాడు. అతనే కాదు, మూడు సార్లు ఎంపీగా ఉన్న అతని కొడుకు దీపేందర్‌ కూడా ఓడిపోయాడు. కాంగ్రెసులో మరో వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ తన్వార్‌ అదే ఎన్నికలలో సిర్సా నియోజకవర్గంలో సిటింగ్‌ లోకదళ్‌ ఎంపీ చరణ్‌ సింగ్‌ రోరీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు కానీ యిద్దరూ బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెసుకు 28.4% ఓట్లు రాగా, 2014 పార్లమెంటు దాకా దాకా లోకదళ్‌కు జూనియర్‌ భాగస్వామిగా ఉంటూ వచ్చిన బిజెపికి 58% ఓట్లు వచ్చాయి. 

ఎన్నో ఏళ్లు రాష్ట్రాన్ని ఏలి, 2014 పార్లమెంటు ఎన్నికలలో 24% ఓట్లు, 2 సీట్లు గెలిచిన లోకదళ్‌కు యీసారి 1.9% ఓట్లు వచ్చాయి. 1966లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి కాంగ్రెసుకు యింత తక్కువ ఓట్లు ఎన్నడూ రాలేదు. 2014 పార్లమెంటు ఎన్నికలో కూడా 23% ఓట్లతో 1 ఎంపీ సీటు గెలుచుకుంది. ఈసారి అదీ లేదు. కాంగ్రెసు నాయకులనేకులు బిజెపిలోకి ఫిరాయించారు. ఇద్దరు ఎంపీలుగా నెగ్గారు కూడా! దళిత నాయకుడు, విద్యాధికుడు ఐన అశోక్‌ తన్వార్‌ను రాహుల్‌ గాంధీ ఎంపిక చేశాడు. అయితే ఈ ఐదేళ్లలో అతను జిల్లా కమిటీలను, బ్లాక్‌ కమిటీలను ఏర్పాటు చేయలేకపోయాడు. ఎందుకంటే హూడా పడనివ్వలేదు. రాహుల్‌ ఏమీ చేయలేక పోయాడు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్‌ దిగిపోవడంతో, సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెసులో వృద్ధ నాయకత్వానికి మళ్లీ కోరలు వచ్చాయి. హూడా కోరిక మేరకు సోనియా అశోక్‌ను అధ్యక్షుడిగా తీసేసి, హూడా అనుయాయి అయిన మరో దళిత నేత కుమారి షెల్జాను నియమించింది. 

దాంతో అశోక్‌ పార్టీలోంచి పోతూపోతూ కాంగ్రెసుకూ ప్రజాస్వామ్యానికీ చుక్కెదురు అనేసి పోయాడు. మామూలుగా అయితే యిలాటి నాయకులకు బిజెపి స్వాగతం బోర్డు పట్టుకుని ఆహ్వానించాలి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి రాష్ట్రంలో కాంగ్రెసు మంత్రిగా చేసిన చౌధురీ బీరేందర్‌ సింగ్‌ను, యుపిఏలో మంత్రిగా చేసిన రావ్‌ ఇందర్‌జీత్‌ సింగ్‌ను తీసుకుంది. మొన్న పార్లమెంటు ఎన్నికలలో కూడా మాజీ ముఖ్యమంత్రి కొడుకు దీపేందర్‌ హూడాను ఓడించడానికి కాంగ్రెసు ఎంపీ అరవింద్‌ శర్మను ఫిరాయింప చేసుకుంది. కానీ మనోహర్‌ లాల్‌ అశోక్‌కు మాత్రం 'నో ఎంట్రీ' అన్నాడు. 

హరియాణాలో జాట్‌లు అధిక సంఖ్యలో (22%) ఉన్నారు. హరియాణా రాజకీయాల్లో దేవీలాల్‌, బన్సీలాల్‌ వంటి జాట్లదే ప్రాబల్యం. మొత్తం 10 మంది ముఖ్యమంత్రులుంటే 6గురు జాట్లే. జాటేతర (బిష్ణోయ్‌ కులస్తుడు) నాయకుడైన భజన్‌లాల్‌ కొంతకాలం వెలిగాడు. 2014 వరకు కాంగ్రెసు ముఖ్యమంత్రిగా ఉన్న హూడా కూడా జాటే. (అతనిప్పుడు గఢీ సాంప్లా-కిలోయి నియోజకవర్గం నుంచి నిలబడుతున్నాడు) భజన్‌లాల్‌ కొడుకులైన చందర్‌ మోహన్‌, కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ 2007లో తండ్రి పెట్టిన జనహిత్‌ కాంగ్రెసు పార్టీని కొనసాగించి 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపితో చేతులు కలిపి జాటేతర ఓట్లను కాంగ్రెసు నుంచి గుంజుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పరచే అవకాశం రాగానే జాటేతర పంజాబీ క్షత్రియుడైన మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు అధికారం కట్టబెట్టి బిజెపి ఆ ఓట్లను వీళ్ల దగ్గర్నుంచి గుంజుకుంది. 

ఇక చేసేదేం లేక కులదీప్‌ 2016లో మళ్లీ కాంగ్రెసులో చేరాడు. అతని కొడుకు పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు తరఫున నిలబడి ఓడిపోయాడు. ఈసారి కులదీప్‌ ఆదమ్‌పూర్‌ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నాడు. అతని ప్రత్యర్థి టిక్‌టాక్‌ ద్వారా ఖ్యాతిలోకి వచ్చిన జాట్‌ మహిళ సోనాలీ ఫోగట్‌!  తమకు రిజర్వేషన్‌ కావాలంటూ 2016లో జాట్లు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారి, వారి పట్ల ప్రజలకు వెగటు పుట్టింది. జాట్ల ప్రాబల్యం తగ్గుతోందని గ్రహించిన కాంగ్రెసు కూడా గతంలో కంటె యీసారి జాట్లకు తక్కువగా సీట్లు యిచ్చింది.  తమ ప్రాముఖ్యత తగ్గడం జాట్లకు నచ్చకపోయినా ఖట్టర్‌పై యిప్పటివరకు అవినీతి ఆరోపణలు లేకపోవడంతో బండి నడిచిపోతోంది. మోదీ పలుకుబడితో ఎన్నికలు నెగ్గుతూ వస్తున్నారు.

హరియాణాలో చక్రం తిప్పిన మరో రాజకీయ కుటుంబం దేవీలాల్‌ది. అతను స్థాపించిన లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) అతని తర్వాత కొడుకు ఓం ప్రకాశ్‌ చౌటాలా చేతిలోకి వెళ్లింది. అతను ముఖ్యమంత్రిగా పని చేసి పీకలలోతుగా అవినీతిలో కూరుకుపోయాడు, ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతనే కాదు, సగం మంది ప్రముఖ లోకదళ్‌ నాయకులు కూడా! ఓం ప్రకాశ్‌ చౌటాలా మనుమడు దుష్యంత్‌, అతని సోదరుడు దిగ్విజయ్‌ గత ఏడాది డిసెంబరులో పార్టీలోంచి బయటకు వెళ్లి జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) పేర వేరే పార్టీ పెట్టుకున్నారు. దాంతో పార్టీలోంచి కొందరు నాయకులు బయటకు వెళ్లి దానిలో చేరారు. ఇంకొంతమంది బిజెపికి, మరి కొంతమంది కాంగ్రెసుకు వెళ్లారు. ఇప్పుడు పార్టీ చిక్కి సగమైంది. చౌటాలా చిన్న కొడుకు అభయ్‌ యీ ఎన్నికలలో ఎలానాబాద్‌ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసి, పార్టీ ఉనికిని కాపాడుదామని చూస్తున్నాడు. 

ఈ రాజకీయ కుటుంబాలన్నీ పార్లమెంటు ఎన్నికలలో చావుదెబ్బ తిన్నాయి. ఓడిపోయిన వారిలో బన్సీలాల్‌ మనవరాలు శ్రుతి చౌధరీ, దేవీలాల్‌ మనుమడు దుష్యంత్‌ చౌటాలా, భజన్‌లాల్‌ మునిమనుమడు భవ్య బిష్ణోయ్‌ ఉన్నారు. గత కొద్ది వారాలుగా కాంగ్రెసు నుంచి 20 మంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. టిక్కెట్టు దొరకని మాజీ మంత్రి సంపత్‌ సింగ్‌ పార్టీ విడిచి వెళుతూ హిస్సార్‌ జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేస్తానని ప్రతిన పూనాడు. హరియాణా దిల్లీకి దగ్గరగా ఉంది. చాలామంది హరియాణా పౌరులు దిల్లీలో పని చేస్తూ ఉంటారు. అందువలన తక్కిన రాష్ట్రాల కంటె ఎక్కువగా హరియాణాపై జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది.

లోకదళ్‌ బలహీనపడడంతో బిజెపితో ముఖాముఖీ పోరాటంలో తమకు లబ్ధి కలుగుతుందనే ఆశతో ఉంది కాంగ్రెసు. అందువలన తన మానిఫెస్టోలో వరాలు గుప్పించింది. మధ్యప్రదేశ్‌లో ఋణమాఫీ హామీ అధ్వాన్నంగా అమలైనా బుద్ధి తెచ్చుకోకుండా యిక్కడే అదే హామీ యిస్తోంది. ఇక్కడ రైతులతో బాటు పేదలు తీసుకున్న స్వల్పఋణాలు కూడా అంటున్నారు. కరువు బాధితులైన రైతులకు ఎకరానికి రూ.12 వేలు కూడా. ఇవన్నీ అధికారం చిక్కిన కొన్ని గంటల్లోనేట. అంతేకాదు, మన జగన్‌ తరహాలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 75% రిజర్వేషన్‌ట. ప్రభుత్వోద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్‌, మహిళలకు వేసే ప్రత్యేక బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే ఉండడంతో బాటు టిక్కెట్టు కూడా కొననక్కరలేదు. ఇక ఉద్యోగం దొరికేవరకు యిచ్చే నిరుద్యోగ భృతి పోస్ట్‌ గ్రాజువేట్‌లకు నెలకు 12 వేలు, గ్రాజువేట్‌లకు 10 వేలు. 10వ క్లాసు విద్యార్థులకు నెలకు 1000, 12వ క్లాసు వారికి 1250 స్కాలర్‌షిప్‌లు యిస్తారట. 

దీనికి ప్రతిగా విడుదల చేసిన బిజెపి మానిఫెస్టోలో 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, రూ. 3 లక్షల వరకు వ్యవసాయ ఋణాలకు వడ్డీ లేదన్నారు, షెడ్యూల్‌ కులాల వారికి రూ. 3 లక్షల వరకు హామీ లేని ఋణాలన్నారు, 25 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్యాభివృద్ధికై తర్ఫీదు, వృద్ధులకు రూ.3 వేల పెన్షన్‌ యిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల హెల్త్‌ సెంటర్లు పెడతామన్నారు. కాంగ్రెసు అధిష్టానం పార్టీకి గాలికి వదిలివేయగా, బిజెపి అధిష్టానం 370 రద్దు, ఎన్‌ఆర్‌సిలను చూపించి జాతిరక్షణ గురించి మాట్లాడుతోంది. 

ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తల చేత చాలా చురుగ్గా పని చేయిస్తోంది. 19 వేల పోలింగు బూతులుంటే వాటికై 18,900 వాట్సప్‌ గ్రూపులు తయారు చేయించి వాటి ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. 500 మంది సభ్యులున్న తమ ఐటీ సెల్‌ తయారుచేసిన ప్రచార సందేశాలను, వీడియోలను, గ్రాఫులను యీ వాట్సప్‌ గ్రూపుల ద్వారా నిమిషాల్లో 28 లక్షల మందికి చేరవేయగలరు. జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) కూడా సోషల్‌ మీడియాకు ప్రాధాన్యత యిస్తోంది. 15 మంది సభ్యులతో టీము ఏర్పరచి, 150 వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఓటర్లను చేరుతోంది.  

హరియాణా ఎన్నికలలో డేరా బాబా ఆశ్రమం (డేరా సచ్చా సౌదా) కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తూ వచ్చింది. దానికి లక్షలాది మంది అనుయాయులున్నారు. అది 'ఎంఎస్‌జి' బ్రాండ్‌తో ఉప్పు నుంచి బట్టల వరకూ వరకు, అనేక పరిశ్రమలు నడుపుతూ వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ వచ్చింది. వేలాది ఎకరాలున్న తన భూమిలో గడ్డి పీకే వారి నుంచి నిర్వహించేవారి వరకు అనేక వందల మందికి కల్పవృక్షంగా నిలిచింది. డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఎవరికి చెపితే వారికి లక్షలాది మంది అతని భక్తులు ఓటేసేవారు. అందువలన హరియాణా నాయకులందరూ అతని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 

2014లో అతను బిజెపిని సమర్థించాడు. అయితే 2017లో వచ్చిన కోర్టు తీర్పు వలన మానభంగం, హత్య నేరాలపై అతన్ని జైల్లో పెట్టారు. దాంతో ఆ పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. వేలాది మందికి ఉపాధి పోయింది. గతంలో వేలాది మంది హాజరయ్యే భజన కార్యక్రమాలకు యిప్పుడు వందల్లో హాజరవుతున్నారు. ఈ కారణాల వలన అతని భక్తులకు బిజెపిపై కోపం వచ్చింది. తమ గురువును జైల్లో పెట్టిన బిజెపి ఉపాధి పోయినవాళ్లకు ఎలాటి ఆశ్రయమూ కల్పించలేదన్న ఫిర్యాదు కూడా ఉంది. అందువలన డేరాకు చెందిన 35 మంది సభ్యుల రాజకీయ కమిటీ బిజెపికి వ్యతిరేకంగా ఓటేయమని పిలుపు నివ్వాలి. అయితే బిజెపికి, మోదీకి ఉన్న పలుకుబడి చూసి అది జంకుతోంది. అందుచేత యిప్పటిదాకా తటస్థంగా ఉంది. ఎటూ చెప్పటం లేదు. 

ఇప్పటివరకు హరియాణా ప్రతీ అసెంబ్లీ ఎన్నికలో ప్రభుత్వం మారుతూ వచ్చింది. 2009లో మాత్రం కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వచ్చింది కానీ సీట్లు తగ్గాయి. ఈసారి బిజెపి ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తే అది రికార్డే అవుతుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2019)
mbsprasad@gmail.com