సినిమా రివ్యూ: గుణ 369

సమీక్ష: గుణ 369
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: ఎస్‌జి మూవీ మేకర్స్‌
తారాగణం: కార్తికేయ, అనఘ, ఆదిత్య మీనన్‌, నరేష్‌, మంజు భార్గవి, 'రంగస్థలం' మహేష్‌ తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
ఛాయాగ్రహణం: రామ్‌
నిర్మాతలు: అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల
విడుదల తేదీ: ఆగస్ట్‌ 02, 2019

ప్రతి కథకీ ఒక స్ట్రక్చర్‌ వుంటుంది. దేనికైనా స్టార్ట్‌, మిడిల్‌, ఎండ్‌ అంటూ ఒక బేసిక్‌ స్ట్రక్చర్‌ పెట్టుకుని మిగతాది ఆయా ఘట్టాలని కలిపే రసవత్తర కథనంతో చెప్పాలి. సాంకేతికంగా ఎన్ని వింతలు, విశేషాలు వచ్చేసినా కానీ అంతర్జాతీయంగా రచయితలు పాటించే సూత్రమిది. ఒక్కసారి ఆది, మధ్య, అంతం కుదిరిపోయాయంటే కథ ఒక కొలిక్కి వచ్చినట్టే. అంతే కానీ అదే కథ కాదు... దాంతో సినిమా పూర్తవదు. కానీ యువ దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా తొలి ప్రయత్నానికి ఇంతే రాసి పెట్టుకున్నాడు. ఆ ఘట్టాలు తప్పించి మధ్యలో ఎక్కువగా 'గాలి' నింపేసాడు.

ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ఒక ప్రేమ జంటని అటకాయించి... ఆ యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేసి, అదంతా వీడియో తీస్తారొక బృందం. కట్‌ చేస్తే... తన పేరుని లెక్క చేయని ఒకడికి భయం చెప్పడానికి బయల్దేరిన విలన్‌ 'రాధా... గద్దలగుంట రాధా' అంటూ గర్జిస్తాడు. కట్‌ చేస్తే... గొడవలేమీ లేకుండా కుటుంబంతో హాయిగా బతికేస్తే చాలనుకునే కథానాయకుడు. ఈ ముగ్గురినీ కలిపే లింక్‌ ఇంటర్వెల్‌ దగ్గర పడుతుంది. కానీ ఆ ఆరంభానికి, ఈ విరామానికి మధ్య కూర్చోబెట్టగలిగే సన్నివేశమే లేదు. మధ్యలో సుదీర్ఘమైన ఒక ప్రేమకథ నడుస్తుంది కానీ అదంతా ఆ పాయింట్‌ నుంచి ఈ పాయింట్‌కి చేరడం కోసం చేసిన కాలక్షేపంలా అనిపిస్తుంది. ఎటు పోతోందీ సినిమా అనేంతలో ఊహించని పరిణామాలతో ఇంటర్వెల్‌ సీన్‌ షాక్‌ ఇస్తుంది. ఈ ఎపిసోడ్‌ రేపే ఉత్కంఠ అంతవరకు కలిగిన విసుగుని కూడా కొంతవరకు మినిమైజ్‌ చేసేస్తుంది.

ఇంటర్వెల్‌ తర్వాత ఇక కథనం పరుగులు పెడుతుందని అనుకుంటే... జైల్లో ల్యాండ్‌ అయిన హీరో భగవద్గీత చేతిలోకి తీసుకుని హీరోయిన్‌తో ఒక ఎమోషనల్‌ డ్యూయెట్‌ వేసుకుంటాడు. భగవద్గీతకీ, సాంగ్‌కీ ఏంటి సంబంధం అనుకుంటే కనుక... హీరోయిన్‌ పేరు గీత అని తెలుసుకోగలరు! ఎక్కడికో లేచిన గ్రాఫ్‌ని పాలపొంగులా చల్లార్చేయడానికి అన్నట్టుగా ఈ బీచ్‌ సాంగ్‌ పెట్టారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండించడం కోసం కొన్ని సన్నివేశాలు పెట్టుకున్నా కానీ ఏవీ ఆకట్టుకోవు. హీరో రిలీజ్‌ అయ్యేసరికి మరో ట్విస్టు. తన వల్ల జరిగిన తప్పు సరిదిద్దుకోకపోతే తన కుటుంబానికి కష్టమని తెలుసుకుంటాడు. అందుకే అంతవరకు నమ్మిన అహింసని పక్కన పెడతాడు. కానీ కుటుంబానికి మించిన కారణమొకటి అతడిలోని మృగాన్ని నిద్ర లేపడంతో శివమెత్తుతాడు. ఇక్కడ కొన్ని అనూహ్యమైన మలుపులు. టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేస్తూ హీరో ఖైదీ నంబర్‌ 369గా కనిపిస్తాడు.

ఒక మంచి మాస్‌ సినిమా కాగలిగే లక్షణాలు ఈ కథలో పుష్కలంగా వున్నాయి. లేదా ఒక పరుత్తివీరన్‌ లాంటి పవర్‌ఫుల్‌ డ్రామాని తీర్చిదిద్దడానికి కావాల్సిన సెట్టింగ్‌ కుదిరింది. కానీ దర్శకుడు ఈ చిత్రాన్ని రెండిటినీ కానివ్వకుండా అలా మధ్యలో వదిలేసాడు. పొటెన్షియల్‌ వున్న కథని కాస్తా ఒకటి రెండు ఆకట్టుకునే ఘట్టాలు, మలుపులు మాత్రమే అన్నట్టుగా మిగిల్చేసాడు. బలమైన ఆది, అంతం, మధ్యమం వుంటే కనుక మిగతాది కాస్త ఫన్‌ లేదా ఎమోషనల్‌ స్టఫ్‌తో నింపినా ఫర్వాలేదు. కానీ అర్జున్‌ జంధ్యాల ఐడియా ఆఫ్‌ రొమాన్స్‌ కానీ, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కానీ, అతనికి తెలిసిన ఎమోషన్స్‌ కానీ రిలేట్‌ చేసుకోవడం అటుంచి కనీసం చూడాలనిపించేలా లేవు.

కార్తికేయ లాంటి యువ హీరో వున్నపుడు ఇంత 'ఎయిర్‌'తో ఎగరాలి అని చూడడం అవివేకమే అవుతుంది. పోనీ ఇచ్చిన ట్విస్టులు కూడా యూత్‌ని వెర్రెక్కించే ఆర్‌ఎక్స్‌ 100 మాదిరి ట్విస్టులు కావు. ఇంటర్వెల్‌ సీన్‌ అయితే 'నా పేరు శివ'ని గుర్తు చేస్తుంది. అంతగా బిల్డప్‌ ఇచ్చిన కుర్రాళ్ల గ్యాంగ్‌ని ఆ తర్వాత బేలగా మార్చేయడం కూడా బాగోలేదు. ఎంతకయినా తెగించే గుణమున్న వాళ్లు 'గుణ' ముందు తోక ముడిచేయడం వల్ల ఆ పాత్రలకిచ్చిన పరిచయం, ప్రాముఖ్యం రెండూ దెబ్బతినేసాయి. అలాగే ఒక ట్రాజెడీని ఫీల్‌ అవ్వాలంటే సదరు వ్యక్తుల అనుబంధంతో కనక్ట్‌ కాగలగాలి. ఇలాంటి కథలు రాసుకునే దర్శ, రచయితలంతా తప్పక గుర్తుంచుకోవాల్సిన అంశమిది. ట్రాజెడీ పండాలంటే అందుకు అనుగుణమైన అనుబంధాన్ని ప్రేక్షకులతో ఏర్పరచగలగాలి. అందుకోసం హృద్యమైన, హత్తుకునే సన్నివేశాలు సృష్టించాలి. అదంతా లేకుండా కేవలం సీన్‌తో ఎమోషన్‌ పండించాలని చూస్తే సదరు ఎమోషన్‌ ఆ సీన్‌ ముగియడంతోనే కట్‌ అయిపోతుంది కానీ క్యారీ అవదు.

కార్తికేయకి సిక్స్‌ ప్యాక్‌ వుందనేది ఇప్పటికే రిజిష్టర్‌ అయిపోయింది. కనుక చొక్కా గుండీలు విప్పితే తప్ప గుర్తుంచుకోలేని స్టంట్లు మానేసి నటన మీద దృష్టి పెట్టాలి. అనఘ నటన ఫర్వాలేదనిపిస్తుంది. మహేష్‌ ఎప్పటిలా లౌడ్‌గా డైలాగులు చెబుతూ నటించేసాడు. ఆదిత్య మీనన్‌ పాత్రకి బిల్డప్‌ మరీ ఎక్కువ ఇచ్చారు కానీ అతని సన్నివేశాలు ఏమంత ఎఫెక్టివ్‌ అనిపించలేదు. మంజు భార్గవి సోకాల్డ్‌ పవర్‌ఫుల్‌ లేడీ పాత్రలో కాస్త కూడా ఇంపాక్ట్‌ చూపించలేదు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఫర్వాలేదు. ఖర్చు పరంగా నిర్మాతలు వెనుకాడలేదు. కానీ రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అర్జున్‌ జంధ్యాల అడపాదడపా తన గురువు 'బోయపాటిని' తలపించినా కానీ ఓవరాల్‌గా ఇంప్రెస్‌ చేసే సినిమాగా 'గుణ 369'ని మలచలేకపోయాడు. మాస్‌ని ఆకట్టుకునే కొన్ని గుణాలయితే వున్నాయి కానీ సక్సెస్‌ తీరం దాటేందుకు ఇంకొన్ని సుగుణాలుంటే గుణ పాస్‌ అయిపోయుండేవాడు.

బాటమ్‌ లైన్‌: సుగుణాలు తక్కువే!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: రాక్షసుడు