గులాబీ తోటలో.. టిక్కెట్ల కార్చిచ్చు

'నువ్వు నేర్పిన విద్యయే కదా..' అన్నట్టు, గులాబీ పార్టీ నేర్పిన రాజకీయాన్ని, అదే గులాబీ పార్టీ మీద అప్లయ్‌ చేస్తున్నట్టున్నారు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అండ్‌ టీమ్‌. చెన్నూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అవకాశం కోల్పోయిన నల్లాల ఓదేలు, పార్టీ అధిష్టానంపై అసహనంతో ఊగిపోతున్న విషయం విదితమే. తమ అభిమాన నేతకి ఇంతటి అవమానం జరగడాన్ని నల్లాల ఓదేలు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

అనూహ్యంగా చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య 'దాడికి' యత్నించాడు. నిజానికి, ఇది ఆత్మహత్యాయత్నం. పెట్రోల్‌ పోసుకుని హడావిడి చేయడం.. కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించడం.. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ మార్క్‌ 'నిప్పు' రాజకీయాలే. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి చాలానే జరిగాయి. కొందరు అకారణంగా ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ ఉద్యమంలో. వారిని 'అమర వీరుల' ఖతాలో వేసి, రాజకీయ లబ్దిని టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, బాల్క సుమన్‌ - నల్లాల ఓదేలు మధ్య ఆధిపత్య పోరులో భాగంగా రేగిన 'కార్చిచ్చు' ఏకంగా 16 మందికి తగలబెట్టేసింది. వీరిలో 12 మంది పరిస్థితి కొంత ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. తనపై దాడి జరిగిందనీ, హత్యాయత్నానికి పాల్పడ్డారనీ టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపిస్తున్నారు. అయితే, 'అసమ్మతి గళాన్ని' చల్లార్చేందుకు ఆత్మహత్యాయత్నాన్ని కాస్తా, హత్యాయత్నంగా మార్చేస్తున్నారంటూ నల్లాల ఓదేలు అండ్‌ టీమ్‌ వాపోతుండడం గమనార్హం. 

తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో.. ఇలాంటివన్నీ మామూలే. ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వివిధ వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోన్న విషయం విదితమే. ఎప్పుడో 13 ఏళ్ళ క్రితం నాటి కేసు తిరగతోడి, మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని జైలుకు పంపించడం, కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డిని ఇరకాటంలో పడేయడం.. తాజాగా మరో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డికి పాత కేసులో నోటీసులు వెళ్ళడం.. ఇవన్నీ కేసీఆర్‌ మార్క్‌ రాజకీయాలు కాదని ఎలా అనుకోగలం.? అన్నట్టు, టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపైనా కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ 'గులాబీ' రాజకీయాల్ని ప్రయోగించడంతో.. ఆయనా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెల్సిందే. 

మొత్తమ్మీద, గులాబీ తోటలో టిక్కెట్ల కార్చిచ్చు జోరందుకుందన్నమాట.. దాన్ని చల్లార్చేందుకు.. విపక్షాల్ని నిర్వీర్యం చేసేందుకు.. కేసీఆర్‌, శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు మళ్ళీ కేసీఆర్‌ని అధికారంలోకి తీసుకొస్తాయా.? లేదంటే, కేసీఆర్‌ రచిస్తున్న ప్రతి వ్యూహం బెడిసికొట్టేయనుందా.? వేచి చూడాల్సిందే.

RELATED రాహుల్ సభ.. చప్పగా, టీడీపీతో బంధం!