గులాబీ సర్కార్‌కి మొట్టికాయ.. కేసీఆర్‌ ఏం చేస్తారో.!

'వాళ్ళంతా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారు.. వారితో ప్రభుత్వం చర్చలు జరిపే ప్రసక్తేలేదు. కొత్త కార్మికుల నియామకాల్ని చేపడ్తాం.. యూనియన్ల రగడ లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటాం.. కొత్త కార్మికులతో ఈ మేరకు సంతకాలు చేయించుకుంటాం.. ఆర్టీసీ పరిస్థితి బాగోలేదు.. ప్రైవేటు బస్సుల సంఖ్య పెరగాల్సిందే..' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చేసిన వ్యాఖ్యలు కార్మికుల్ని మరింతగా ఆగ్రహావేశాల్లోకి నెట్టేసిన విషయం విదితమే.

కేసీఆర్‌ వ్యాఖ్యల తర్వాత ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం చలించలేదు. ఏ ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ రాష్ట్రసాధన జరిగిందో.. అదేతరహా ఆత్మ బలిదానాలు తెలంగాణలో జరుగుతున్నాయిప్పుడు. అయినా, ప్రభుత్వం కనికరించడంలేదు. మరోపక్క, హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు గట్టిగానే వేసింది.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై.

ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదు.? ప్రభుత్వం తరఫున కార్మికులతో చర్చల విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.? రెండు రోజుల్లో చర్చలు జరిపి, మంచి వార్తతో రండి.. అంటూ సుతిమెత్తగా హెచ్చరిస్తూనే ప్రభుత్వానికి సూచించింది న్యాయస్థానం. మరోపక్క, పండగ పూట సమ్మెకు దిగడం ద్వారా ప్రజల్ని ఇబ్బందిపెట్టి ఏం సాధించారు.? అని కార్మిక సంఘాల్ని సైతం న్యాయస్థానం ప్రశ్నించడం గమనార్హం.

మొత్తమ్మీద, ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇప్పుడు తక్షణం ఎండీని నియమించాల్సి వుంది హైకోర్టు ఆదేశాల మేరకు. అదే సమయంలో కార్మిక సంఘాలతో చర్చలూ ప్రభుత్వం ప్రారంభించాల్సి వుంటుంది. 'చర్చల ప్రసక్తేలేదు..' అని నిర్మొహమాటంగా తేల్చేసిన కేసీఆర్‌, ఇప్పుడు.. చర్చలకు ఎలా సంసిద్ధమవుతారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 'సెల్ఫ్‌ డిస్మిస్‌..' అంటూ ఉపయోగించకూడని పదాన్ని ఉపయోగించేసిన కేసీఆర్‌.. హైకోర్టు ఆదేశాలతో మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న కేసీఆర్‌.. కార్మిక సంఘాలకు వున్న హక్కులు.. వారు న్యాయస్థానానికి వెళితే మారే పరిస్థితుల గురించి ముందస్తుగా అంచనా వేయలేకపోవడమా.? అధికారం కేసీఆర్‌ ఆలోచనా స్థాయిని తగ్గించేసిందా.? ఏమో, ఆయనకే తెలియాలి.  

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments

Related Stories :